RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Thursday, August 30, 2012

'శ్రీమన్నారాయణ' చిత్ర సమీక్ష              2 / 5

ఎల్లో ఫ్లవర్స్ పతాకం ఫై  రవికుమార్ చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రజా సేవకుడు కల్కి నారాయణ మూర్తి కుమారుడు శ్రీమన్నారాయణ ఓ టీవీ చానెల్ జర్నలిస్ట్ గా  అవినీతి పరులకు సింహ స్వప్నం అవుతాడు.అతనికి మరదలితో నిశ్చితార్ధం జరుగుతుంది.అయితే మరో చానెల్ లో పనిచేసే స్వప్నిక అతని వెంటపడుతూ వుంటుంది. అన్నదాతల సంక్షేమం కోసం   కల్కి నారాయణ మూర్తి  చేపట్టిన  'జైకిసాన్' కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. అది  కార్య రూపం దాల్చే సమయం లో అకస్మాత్ గా కల్కి నారాయణ మూర్తి మరణిస్తారు. 'జైకిసాన్' కోసం పోగయ్యిన కోట్ల  విరాళాలు మాయమవుతాయి.  దానికి బాధ్యుడు గా చేసి శ్రీమన్నారాయణ ను అరెస్ట్ చేస్తారు. నిజానికి  ఆ డబ్బు దోపిడీ లో ఆరుగురు ప్రముఖులున్నట్లు , దాచిపెట్టిన సొమ్ము కు సంబంధించి  ఈ ఆరుగురు ఆరుఅంకెల  పాస్ వర్డ్ పెట్టుకున్నట్లు శ్రీమన్నారాయణ తెలుసుకుంటాడు. ఆ తర్వాత,జైలు లో వుంటూనే - ఆ ఆరుగురి నుండి రైతు సంక్షేమం కోసం పోగుచేసిన డబ్బు ఆచూకీ చెప్పే  పాస్ వర్డ్  తెలుసుకుంటూ,తండ్రి మరణానికి కారణమైన వారిని చంపే పని ప్రారంభిస్తాడు శ్రీమన్నారాయణ. ఈ పనిలో అతను ఎంతవరకూ విజయవంతం అయ్యిందీ  సినిమాలో చూడాలి...

అంతంత మాత్రం అనుభవమున్న దర్శకుడు  రవి చావలి బాలకృష్ణను జర్నలిస్ట్ గా చూపుతూ  విజయవంతం కాలేక పోయాడు.( అతనికి చేదోడు వాదోడుగా వుండే సినిమాటోగ్రాఫర్  సి.విజయకుమార్ ఈ చిత్రానికి  లేకపోవడం కూడా ఒక కారణమేమో? ). "తండ్రి మరణం...తన అకారణ జైలు జీవితానికి కారణమైన వారి ఫై హీరో ప్రతీకారం తీర్చుకునే" -ఈ కధ ఎప్పటినుండో, ఎన్నో సినిమాల్లో మనం చూసేసాం. పోనీ, ఆ పాత కధని  కొత్తగా చూపించినా బాగుండేది.అలా కాకుండా పరమ రొటీన్ గా ఈచిత్రాన్ని నడిపించారు.ఆసక్తికి అవకాశం లేకుండా , ప్రతి సన్నివేశం మనం ముందే ఊహించేస్తాం . బాలకృష్ణ  నుండి ప్రేక్షకులు ఆశించే స్థాయి లో అతని పాత్రీకరణ లేదు.  లెక్కలేనన్ని సినిమాల్లో చూసినట్లుగానే ఇందులోనూ  బాలకృష్ణ కు ఇద్దరు హీరోయిన్లతో  అరిగిపోయిన  రొమాన్సునే  మళ్ళీ  పెట్టారు . ఇంతకు ముందు చిత్రాల్లో  రెండు అర్దాల మాటలుంటే... ఇందులో' A ' సర్టిఫికేట్ ని అడ్డం పెట్టుకుని  - "దాన్నిపెళ్లి చేసుకో... నన్ను ఉంచుకో" అంటూ సూటిగా  మాట్లాడేసుకుంటారు. విలన్లు కొట్టేసిన డబ్బు ఏ ఎకౌంట్ లోకి పోయిందీ? ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో తేలిగ్గా తెలుసుకోవచ్చు.అది వదిలేసి పాస్ వర్డ్ కోసం పాకులాడ్డం, అందరి కళ్ళు అతని ఫైనే వున్నా, హీరో  జైలు నుండి ఈజీగా వచ్చి చంపేసి పోవడం,  క్లైమాక్స్ లో పాస్ వర్డ్ సంపాయించకుండానే, విలన్ హీరో కుటుంబాన్ని చంపెయ్యమని చెప్పడానికి  డజన్ సెల్ ఫోన్లు విరగ్గొట్టడం ....లాంటిఅర్ధం లేని విషయాలు   ఈ చిత్రంలో చాలా చూడొచ్చు. విలన్లు గా చేసిన ఆరుగురు ప్రతిభావంతులైన నటులను కూడా  సరిగా  వాడుకోలేకపోయారు. పరిమిత బడ్జెట్ లో చెయ్యడం ఒక్కటే ఈ చిత్రం లో నిర్మాతకు కలిసొచ్చే అంశం....కానీ ప్రేక్షకుడిని     మాత్రం ఏ విషయం లోను ఆనంద పరచాలేకపోయారు. 

శ్రీమన్నారాయణ గా చేసిన బాలకృష్ణ నటన ఒక్కటే ఈ చిత్రంలో హైలైట్ గా  చెప్పు కోవాలి. అందమైన  గెటప్ తో బాలకృష్ణ తన పాత్రను చాలా బాగా పోషించారు.నరసింహ స్వామి వంటి వివిధ గెటప్స్ లో కూడా బాగున్నారు.  అయితే తన  వయసు - శరీరానికి సరిపడని డాన్స్ లు చెయ్యాలని ప్రయత్నించి ఇబ్బంది పెట్టారు. బక్క చిక్కిన జర్నలిస్ట్ గా పార్వతి మెల్టన్, హీరో మరదలిగా ఇషా చావ్లా పెద్ద ప్రాధాన్యం లేని పాత్రల్లో, పాటలకోసమే వున్నారని అనిపించారు. ఆరుగురు విలన్లుగా కోట, సురేష్, జయప్రకాష్ రెడ్డి ,నాగినీడు, రావు రమేష్, సుప్రీత్ లు షరా మామూలు గానే చేసారు.ఎమ్మెస్ నారాయణ, కృష్ణ భగవాన్ ల కామెడీ అంతగా లేకపోయినా...దువ్వాసి మాత్రం ఆకట్టుకున్నాడు. కల్కి నారాయణ మూర్తిగా విజయ కుమార్,   సి .బి.ఐ అధికారిగా వినోద్ కుమార్, జైలర్ గా ఆహుతి ప్రసాద్, ఛానెల్ అధిపతిగా ధర్మవరపు...నటించారు. చక్రి సంగీతం లో కొత్త ట్యూన్ లు కాకపోయినా, సగటు ప్రేక్షకుడికి కావాల్సిన మసాలా మాత్రం బాగానే వుంది .సురేంద్ర రెడ్డి ఫోటోగ్రఫీ బాగుంది. ఘటికా చలం మాటలు కొన్ని సన్నివేశాల్లో చాలా బాగున్నాయి.                                                                     -రాజేష్                                  
                                                                                                                                                                                                                                                    

0 comments:

Post a Comment