RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Thursday, June 28, 2012

ఎంతో కష్టపడితే ఈ గుర్తింపు వచ్చింది:మాధురీదీక్షిత్

‘ఇది నాకు వచ్చిన మిలియనవ అవార్డు కావచ్చు. కానీ ప్రజలు ఇంకా నా గురించి ఆలోచించడమే నాకు ముఖ్యం’’ అని నిన్నటితరం బాలీవుడ్ భామ మాధురీదీక్షిత్ పేర్కొన్నారు. ప్లాన్‌మాన్ మీడియా వారి పవర్‌బ్రాండ్స్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం రాత్రి ఇక్కడ జరిగింది. నటనా రంగంలో అసాధారణ ప్రతిభాపాటవాలు చూపినందుకుగాను మాధురీదీక్షిత్‌కు ‘ప్లాటినం దివా’ అవార్డు .....

'పవర్ స్టార్' అనిపించుకున్న పవన్ కళ్యాణ్

తెలుగు సినిమా నిర్మాణ ఖర్చు రోజు రోజుకు పెరిగిపోతోంది. తద్వారా పరిశ్రమలో లాభాల శాతం కూడా చాలా తగ్గి పోయింది. కొన్ని సినిమాలు హిట్ అయినా నిర్మాణ వ్యయం హద్దులు దాటిపోవడం వల్ల 'కాస్ట్ ఫెయిల్యూర్' అవుతున్నాయి. ఇటీవల ఒక అగ్ర యువ హీరోతో ఒక భారీ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రం 'సూపర్ డూపర్ హిట్' అని ప్రచారం చేసుకున్నా....దాదాపు 13 కోట్లు నష్టాన్ని మిగిల్చింది. తెలుగు పరిశ్రమ నుంచి దాదాపు 100 సినిమాలు వస్తే..అందులో సక్సెస్‌ రేటు కనీసం పది పదిహేను శాతం కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్‌ తగ్గించడానికి పవన్‌ కళ్యాణ్‌ కీలక మార్పులకు శ్రీకారం.....

Friday, June 22, 2012

   'శకుని' చిత్ర సమీక్ష                 3/5
          'స్టూడియో గ్రీన్' గ్యాన వేల్ రాజా సమర్పణలో  శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకం ఫై శంకర్ దయాళ్ దర్శకత్వం లో బెల్లం కొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

          గ్రామంలోని తాతల నాటి ఇంటిని రైల్వే విస్తరణ లో కోల్పోతున్న కమల్ కృష్ణ, దాన్ని కాపాడుకోవడానికి రైల్వే మంత్రిని కలుద్దామని నగరానికి వస్తాడు. తను కోరుకున్న విధంగా జరిగే అవకాశం లేకపోవడంతో -ఆ రైల్వే బ్రిడ్జి  కాంట్రాక్ట్ తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి భూపతి ని కలిస్తే, అక్కడ అతనికి అవమానం ఎదురవుతుంది. అధికారం లేనిదే పనులు కావని తెలుసుకున్న కమల్ తన తెలివితో  సామాన్యురాలు రమణక్కను మేయర్ని చేసి భూపతికి తన తొలి సవాల్ విసురుతాడు. అధికారాన్ని చూసుకుని అహంకారంతో , సంపాదనే లక్ష్యం గా విర్రవీగుతున్న భూపతిని పదవి నుంచి దించడానికి ప్రతి పక్ష నాయకుడు పెరుమాళ్ళు ని పురికొల్పుతాడు.ఎన్ని ఇబ్బందులోచ్చినా కమల్ తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేదే ఈ చిత్ర కధాంశం .
          తెలుగు హీరోలతో సమానం గా ఎదిగిన కార్తీ హీరోగా రాజకీయాలను కలిపి , పూర్తి వినోదాత్మకం గా నిర్మించిన చిత్రం ఇది. కార్తీ నటనతో పాటు అప్పలరాజు గా చేసిన సంతానం నటన... మంచి స్క్రీన్ ప్లే ,శశాంక్ వెన్నెలకంటి  చురుకైన మాటలు ఈ చిత్రం లో ప్రత్యేకతలు. అలాగే ప్రధాన పాత్రలకు సమర్ధులైన నటీ నటులను ఎంపిక చెయ్యడం  కూడా సినిమాకి కలిసొచ్చింది.  సినిమా ప్రారంభం లో ....జేబులో రూపాయి లేకుండా రజనీ అభిమాని అప్పల రాజు ఆటో ఎక్కి, హీరో తన ఫ్లాష్ బాక్ చెప్పే సన్నివేశాలు  ప్రేక్షకులను చాలాబాగా అలరించాయి . ఇడ్లీలు అమ్ముకునే  రమణక్కను కార్పొరేటర్ ని ...ఆ తర్వాత మేయర్ ని చేసే సన్నివేశాలు , చెట్టుకింద స్వామిని కమల్ తన తెలివి తో బడా స్వామిని చేసే సన్నివేశాలు, రాజకీయఎత్తుగడల సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  కరడు గట్టిన రాజకీయుల మధ్య, ఎన్ని తెలివితేటలున్నా కమల్ వంటి వారు ఇంత తేలికగా నెగ్గుకు రావడం ...అంత తేలికైన విషయం అని మాత్రం ఎవరూ నమ్మరు.అయితే అటువంటివి ఏమీ ఆలోచించకుండా చూసే వారికి ఈ సినిమా రెండు గంటల పాటు మంచి వినోదాన్ని అందిస్తుందని మాత్రం చెప్పొచ్చు.
           కమల్ గా కార్తీ తన సహజ శైలి లో పూర్తి న్యాయం చేసాడు.నటన పరం గా,విజయాల పరం గా ఈ చిత్రం తో మరో మెట్టు ఫైకెక్కాడు. శ్రీదేవి గా ప్రణీత రెండు సీన్లు,రెండు పాటలకే పరిమిత మయ్యింది. అయితే అందంగా కనిపించింది.అప్పలరాజు గా సంతానం మంచి  కామెడీ పండించాడు. భూపతిగా ప్రకాష్ రాజ్ తన రెగ్యులర్ తరహా పాత్రనే మరోసారి బాగా చేసాడు. అతని ఉంపుడుగత్తె  గా కిరణ్ రాథోడ్, రమణక్కగా రాధిక ,  బీడీ బాబా గా నాజర్, హీరో మేనత్తగా రోజా, ప్రతిపక్ష నాయకుడు పెరుమాళ్ళు గా కోట ప్రధాన పాత్రలు ప్రతిభా వంతం గా పోషించారు. పోలిస్ అధికారిగా అనుష్క ఒకసారి మెరుపులా కనిపించింది. అలాగే ఆండ్రియా కూడా...'మనసులో మధువే' ఒక్కటి తప్ప , ప్రకాష్ కుమార్ పాటల్లో  చెప్పుకోదగ్గవి లేవు. కార్తీ ఫై చేసిన ఒక మాస్ మందు  పాటను తీసేసి, సినిమాకు మేలు చేసారు. రీ రికార్డింగ్ కూడా కొన్ని చోట్లే సందర్భోచితంగా వుంది.. ముత్తయ్య ఫోటోగ్రఫీ  బాగుంది.                     
                                                                                                                                                                                                     -రాజేష్

Thursday, June 21, 2012

పంజాబీ సినిమాలోఆర్నాల్డ్ ష్వాజ్‌నెగ్గర్

హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్, ఆస్ట్రేలియా గాయకుడు కైలీ మినోగ్ దారిలోనే బాలీవుడ్ బాట పట్టాడు ఆర్నాల్డ్ ష్వాజ్‌నెగ్గర్. హిందీ కాదు కాని పంజాబీ సినిమా 'ఫతేహ్- ది విక్టరీ'లో నటిస్తున్నాడు. వరీందర్ గుమన్ తీస్తున్న ఈ సినిమాలో బాడీ బిల్డింగ్ చాంపియన్‌గా, అథ్లెట్‌గా కనిపిస్తాడు ఆర్నాల్డ్. ప్రపంచంలోనే మొట్టమొదటి శాకాహార బాడీ బిల్డర్ వరీందర్. ఈయన మాజీ మిస్టర్ ఇండియా. పలు ఆరోగ్య ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. "కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో జరిగిన గ్రాండ్ ప్రిక్స్‌లో పాల్గొన్నప్పుడు ఆర్నాల్డ్‌ని కలిశాను. ఆ తరువాత.....

వందేళ్ళనాటి పాత్ర కోసం కష్టపడ్డాను

దాదాపు వంద సంవత్సరాల కిందటి కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘తేరీ మేరీ కహానీ’. ఈ చిత్రంలో ‘ఆరాధన’ అనే యువతి పాత్రలో బాలీ వుడ్ నటి ప్రియాంకా చోప్రా నటిస్తోంది. అయితే ‘ఆరాధన’గా నటించడం చాలా కష్టమవుతోందని ప్రియాంక చెబుతోంది. సినిమా ప్రచారంలోభాగంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రియాంక మాట్లాడుతూ... ‘ఆ పాత్ర వంద సంవత్సరాల పూర్వానికి కావడంతోపాటు ఆ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు కనీసం .....

Monday, June 18, 2012

పార్వతి ఓమన కుట్టన్ ను మరచిపోయారు


పార్వతి ఓమన కుట్టన్ గురించి ఇప్పుడు పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. ఈ సౌందర్య రాశి మిస్ వరల్డ్ నుంచి పలు కిరీటాలను కైవసం చేసుకున్న కేరళ కుట్టి. నటి అవ్వాలనే ఆసక్తి లేదంటూనే కొంచెం లేట్‌గా దక్షిణాదిలో చిత్రరంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ నటించిన బిల్లా-2 త్వరలో తెరపైకి రాబోతోంది. ఈ సందర్భంగా ఈ ముద్దు గుమ్మతో చిన్న భేటి...
మీ నేపథ్యం గురించి చెప్పండి?
మాది కేరళ. నా పేరు పార్వతి ఓమన్ కుట్టన్. ఓమన్‌కుట్టన్ అనేది నాన్న పేరు. ఆయన పేరుకు అర్థం ఏమిటో నా కిప్పటికీ తెలియదు. నా అసలు పేరు మరొకటి ఉంది. అదే ఆంత్ర. ఆంత్ర అంటే పాటలు వచ్చే పల్లవి అని అర్థం. అమ్మకొన్నాళ్లు తమిళనాడులో ఉండేది. ఆ సమయంలో ఆమె శివ భక్తురాలయ్యింది. అప్పుడే నా పేరు పార్వతిగా మార్చింది. నా గురించి ఇంత కంటే పరిచయం అవసరమా?
ప్రపంచ సుందరి పట్టం గెల్చుకున్న మీకు ఇప్పుడు పరిచయం చేసుకోవలసిన పరిస్థితి రావడానికి కారణం?
కరెక్ట్‌గా చెప్పారు. ఇప్పుడందరూ నన్ను మరచిపోయారు. అందుకు కారణం నేనే. ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్నప్పుడు చాలా మంది సినిమాల్లోకి ఆహ్వానించారు. అప్పుడు ఈ రంగంలోకి రావడానికి ఇష్టం లేకపోయింది. మిస్ వరల్డ్, మిస్ ఇండియా, మిస్ సౌత్ ఇండియా అంటూ పలు కిరీటాలను గెలుచుకున్నా కని పించకపోతే ఇలానే మర్చిపోతారు.
జాతీయ అందాల పోటీల నుంచి అంతర్జాతీయ అం దాల పోటీ స్థాయికి ఎదిగిన మీరు సినిమాకు దూరం కావడానికి కారణం?
అందాల పోటీల్లో జయించిన వెంటనే సినిమాల్లోకి రావాలనేమి లేదుగా. సినిమాను వదిలి చాలా విషయాలపై దృష్టి సారించవచ్చు. నిజం చెప్పాలంటే నాకు చిన్న ప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. అయినా వాటిలో నటించాలనే ఆలోచన రాలేదు. అందువల్లే అందాల పోటీ ల్లో కిరీటాన్ని సాధించినా నటనపై ఆసక్తి కలగలేదు. ప్రము ఖ దర్శకులు, నిర్మాతలు నటించమని కోరారు. చాలా మంది అడుగుతున్నారని ఒక చిత్రంలో నటించి చూద్దాం అని అనుకున్నాను. హిందీలో (యునెటైడ్ సిక్స్) అనే చిత్రంలో నటించాను. ఆ చిత్రం గనుక హిట్ అయ్యుంటే నేను టాప్ హీరోయిన్‌గా పాపులర్ అయ్యేదాన్ని.
సుస్మితాసేన్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్ వంటి వారందరు చిత్ర రంగంలో ప్రముఖ స్థానానికి చేరుకున్నారు. ఈ రంగాన్ని మీరెందుకు సీరియస్‌గా తీసుకోలేదు?
ఒక్కొక్కరికి ఒక్కో లైప్ స్టైల్ ఉంటుంది. నాకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంది. రాజకీయాలు, క్రికెట్, సినిమా ఈ మూడే దేశాన్ని పాలిస్తున్నాయి. అయితే ఈ మూడు రంగాలపై నాకు పెద్దగా ఆసక్తి లేదు.
బిల్లా-2 చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చింది.
కేరళ తరువాత నాకు నచ్చిన ప్రదేశం చెన్నై. ఏడాది క్రితం చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో జరిగిన సినిమా కార్యక్రమంలో పాల్గొన్నాను. అప్పుడు పత్రికలు, మీడియా నన్ను ప్రముఖంగా చిత్రీకరించాయి. అప్పట్లో నయనతార, ప్రభుదేవా గురించి సంచలనంగా చెప్పుకున్నారు. వారి గురించి నన్ను కామెంట్ చేయమని అడిగారు. నాకు అంతగా ఆసక్తి లేకపోయినా తమిళంలో ఒక భారీ చిత్రం చేయాలనిపించింది. ఆ సమయంలో బిల్లా-2 చిత్ర అవకాశం వచ్చింది. అజిత్ సరసన నటిస్తారా? అని అడిగారు. నిజానికి అజిత్ అంటే నాకు చాలా ఇష్టం. వెంటిన ఓకే చెప్పాను. దర్శకుడు చక్రి తోలేటి నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను

ఆత్మసంతృప్తినిచ్చే పాత్రలతో కమల్‌హాసన్


‘‘నటనను ‘పని’గా మాత్రమే చూసి ఉంటే ఈపాటికి విసుగు వచ్చేదేమో. కానీ నేనెప్పుడూ అలా చూడలేదు. డబ్బు, పేరు కోసం పని చేయడం మానుకుని దాదాపు 25 ఏళ్లు పైనే అయ్యింది. నటుడిగా నాకు ఆత్మసంతృప్తినిచ్చే పాత్రలను మాత్రమే చేస్తున్నాను. నటనను ఎంజాయ్ చేస్తున్నాను. అందుకే ఎన్ని సంవత్సరాలైనా నాకు అలుపు రాదు. కెమెరా ముందు నిలబడినప్పుడు నాకు లభించే ఆనందమే వేరు’’ అన్నారు పద్మశ్రీ కమల్‌హాసన్. నటుడిగా ఆయన వయసు 50 ఏళ్లు. ఈ యాభైఏళ్లల్లో ఎన్నో పాత్రలు పోషించి, వైవిధ్యానికి చిరునామాగా నిలిచారాయన. ‘‘50 ఏళ్ల కెరీర్ అంటే మాటలు కాదు. ఎప్పుడైనా విసుగు అనిపించిందా?’’ అని కమల్‌ని ఓ సందర్భంలో అడిగితే పై విధంగా స్పందించారాయన.
ప్రస్తుతం కమల్ నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వరూపం’. ఆంథోని హాప్‌కిన్స్ నటించిన ‘హన్నిబాల్’ చిత్రాన్ని ఆదర్శంగా తీసుకుని కమల్ ఈ చిత్రం చేశారనే వార్త ఉంది. ఈ వార్త నిజమేనా? అనే ప్రశ్న కమల్ ముందుంచితే - ‘‘హన్నిబాల్ సినిమా అంటే నాకిష్టమే. ఒకవేళ ఆ చిత్రాన్ని ఆదర్శంగా తీసుకుని సినిమా చేయాలనుకుంటే భవిష్యత్తులో చేస్తాను. ఇప్పుడు కాదు. ‘విశ్వరూపం’ దేనికీ ఇన్‌స్పిరేషన్ కాదు. నా హృదయానికి దగ్గరైన కథతో ఈ చిత్రం చేశాను’’ అని చెప్పారు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ను ‘ఐఫా’ వేడుకల్లో ఆవిష్కరించారు. అలాగే, గత నెల కాన్స్ చిత్రోత్సవాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం వచ్చే నెల విడుదల కానుంది
విశ్వరూపం కథేంటి?
పద్మశ్రీ కమలహాసన్ నటిస్తున్న తాజా చిత్రం విశ్వరూపం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కమల్ చిత్రాలో కల్లా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆయన కథ, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను నిర్వహించడం విశేషం. పూజాకుమార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జరీనా వాహెబ్, శేఖర్‌కపూర్, రాహుల్ బోస్, ఆండ్రియ, జైదీప్ అహ్లావత్ నాజర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వైరముత్తు సాహిత్యాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ త్రయం శంకర్ మహదేవన్, ఎషాన్‌నూరణి, లాయ్ మెంటోసా (శంకర్ ఎషాన్ లాయ్) సంగీత బాణీలు కట్టడం విశేషం. ఇంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న విశ్వరూపం చిత్ర కథేంటి అనే కూతూహలం అందరిలోనూ ఉంటుంది. ఇందులో కమలహాసన్ ఉగ్రవాది పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ తరహా ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టే విధంగా చిత్ర యూనిట్ విశ్వరూపం కథాంశాన్ని కాస్త రిలీజ్ చేసింది. ఒక మధ్యతరగతి యువతి తన ఉన్నత విద్యను అమెరికాలో పూర్తి చేయాలని భావిస్తుంది. అనుకున్నట్టుగానే నిరంతర కృషితో అమెరికాలో చదువుతుంది. నిరు అనే నిరుపమకు ఎస్ అనే విశ్వనాథన్‌కు మధ్య మూడేళ్ల ప్రేమ పెళ్లికి దారితీస్తుంది. ప్రేమ, పెళ్లితో జీవితాన్ని ఎంజాయ్ చేసిన నిరుపమ పనిలో పనిగా పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టర్ నిరుపమా విశ్వనాథన్ హోదాను పొందుతుంది. విశ్వనాథన్ తన కథక్ నాట్యశాల విద్యార్థులకు నృత్యం నే ర్పుతూ భార్యతో జీవితంలో స్థిరపడుతాడు. డాక్టర్ నిరుపమ విశ్వనాథన్ తన స్థాయికి తగ్గ భర్త కాదని ఆయన్ని దూరం చేసుకునే ప్రయత్నంలో పడుతుంది. ఆయనలోని లోపాలను వెదకడానికి ఒక డిటెక్టివ్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటుంది. ఆ తరువాత ఏమయ్యేందనేది విశ్వరూపం చిత్రం అంటున్నారు యూనిట్ వర్గాలు
హాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహిస్తా
తాను హాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు ప్రముఖ నటుడు పద్మశ్రీ డాక్టర్ కమలహాసన్ ప్రకటించారు. తాను హాలీవుడ్ చిత్రానికి కథ రాస్తున్నానని వివరించారు. ఆ చిత్రంలో తానే హీరోగా నటిస్తానన్నారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన తమిళ సినిమాకు ఎప్పుడూ రుణపడి వుంటానన్నారు. హాలీవుడ్‌లో నటించేందుకు వచ్చిన అవకాశంపై ఒప్పందం కుదుర్చుకునేందుకే సింగపూర్ వెళ్లానన్నారు.తాను ఆస్కార్ అవార్డు కోసం హాలీవుడ్‌లో నటించడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హాలీవుడ్‌లోనే వుండిపోనని, ఎప్పటిలానే అన్ని భాషాల్లో నటిస్తానని పేర్కొన్నారు. 'విశ్వరూపం' సినిమాను తమిళం, హిందీలలో రూపొందిస్తున్నట్లు చెప్పిన కమల్.. 'ఈ రెండు భాషల చిత్రాల్లో ఏదైనా వ్యత్యాసముందా' అని విలేఖరులడిగిన ప్రశ్నకు 'దాని గురించి ఇప్పుడే చెప్పను' అని సమాధానమిచ్చారు. హాలీవుడ్ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదని, ఆ సినిమాను నిర్మాత బెర్రీ యాస్బెన్ రూపొందిస్తున్నారని కమల్ వివరించారు

Friday, June 1, 2012

 'అధినాయకుడు' చిత్ర సమీక్ష          2.5/5

శ్రీ కీర్తి క్రియేషన్స్  పతాకం ఫై పరుచూరి మురళి దర్శకత్వం లో యం.యల్.పద్మ కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

కిరాయి హంతకుడిగా జీవిస్తున్న బాబీకి   అనుకోకుండా, తను చంపాలనుకున్నరాయల సీమ ప్రజా నాయకుడు రామ కృష్ణ ప్రసాద్   తన తండ్రి అనే విషయం తెలుస్తుంది. రాయల సీమ ప్రజల కష్టాలను తీర్చడానికి ,ఫ్యాక్షనిజాన్ని రూపు మాపడానికి  కంకణం కట్టుకున్న హరిశ్చంద్ర ప్రసాద్ కుమారుడైన రామ కృష్ణ ప్రసాద్ కుటుంభం ఫై ప్రతీకారం తీర్చు కోవాలని అతని ప్రత్యర్ధులు రామ కృష్ణ ప్రసాద్  మేనకోడలిని కిడ్నాప్ చెయ్యాలని చూస్తారు.వారి ప్రయత్నాన్ని అడ్డుకున్న బాబీ  ఆమెతో కలిసి రాయల సీమలోని రామ కృష్ణ ప్రసాద్ ఇంటికి వెళ్తాడు. చిన్నప్పుడే దూరమైన కొడుకు వచ్చినందుకు ఆ కుటుంభం లోని వారంతా ఎంతో సంతోషిస్తారు. అయితే,ఒక కటినమైన వాత్సవం తెలిసిన రామ కృష్ణ ప్రసాద్ మాత్రం బాబీ ని దూరంగానే పెడతాడు. హరిశ్చంద్ర ప్రసాద్ హత్యకు కారకులైన వారు రామ కృష్ణ ప్రసాద్ కుటుంభం ఫై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తారు. వాటిని రామ కృష్ణ ప్రసాద్,బాబీ ఎదుర్కొని, ప్రత్యర్ధులను మట్టు పెట్టడం ఈ చిత్ర కధాంశం.

బాల కృష్ణ వంటి అద్భుత మైన నటుడి త్రి పాత్రాభినయం తో మంచి కమర్షియల్ సినిమా తీయడం -అన్నది దర్శకుడు పరుచూరి మురళి 'ప్రతిభకు మించిన పని' అని ఈ చిత్రం చూస్తే అర్ధం అవుతుంది. ఎంతో విస్తృతమైన కధ ను హ్యాండిల్   చేయడం లో దర్శకుడి నిస్సహాయత అడుగడుగునా  కనిపిస్తుంది. ప్రేక్షకులకు ఓ కొత్త చిత్రం చూస్తున్న ఫీలింగ్ ఎక్కడా కలగదు. సినిమాలో ఏ పాత్ర ఏంటి? అనేది అర్ధం కాక ప్రేక్షకులు చాలాసార్లు గందరగోళానికి గురవుతారు. రాయల సీమ ఫ్యాక్షన్, పగ-ప్రతీకారాల  పాతబడ్డ  సన్నివేశాలకు తోడు ...బలహీనమైన   టేకింగ్ ...ఏ మాత్రం ఉత్సాహం లేని రీ రికార్డింగ్  కలిసి ఈ చిత్రాన్ని నిస్సారం గా మార్చాయి.  మూడు పాత్రల్లో బాల కృష్ణ  నటన మాత్రమే  ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ అంశం. అయితే,బాలకృష్ణ అభిమానులకు కూడా ఈ చిత్రం సంతృప్తిని ఇవ్వదు .బాలయ్య  బాబీ గా టీ షర్ట్ లు, టైట్ పాంట్స్ వేసుకుని కుర్రాడిలా అనిపించడానికి చేసిన ప్రయత్నం ఇబ్బంది కరంగా వుంది. రామ కృష్ణ ప్రసాద్ గెటప్ కూడా అంత బాగా కుదరలేదు. హరిశ్చంద్ర ప్రసాద్ గా కనిపించే అన్ని సన్నివేశాలు బాగున్నాయి.ముఖ్యం గా -లండన్లో సమావేశం సన్నివేశం. అతని తో రాయల సీమ యాస పలికించడం కూడా బాగుంది.  'ట్రెండ్ తో మాకు పని లేదు...తప్పు చేసిన వాడి బెండు తీయడమే నా స్టైల్' వంటి డైలాగ్స్ కొన్ని అక్కడక్కడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 'నేను మాట్లాడుతున్నపుడు నీ గొంతు పెరిగిందో...మాటల్లో మర్యాద తగ్గిందో' వంటి  కొన్నిడైలాగ్స్ మరీ రొటీన్ గా  వున్నాయి.రెహమాన్ తో ఫ్లాష్ బ్యాక్  చెప్పించడం బాగుంది. పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ఫారినర్స్ ఫై ప్రదీప్ రావత్ గ్యాంగ్ దాడి చేసే సన్నివేశాలు మరీ అతిగా వున్నాయి. అమాయకుడి పాత్ర పోషించిన బ్రహ్మానందం కామెడీ కొన్ని చోట్ల పండింది. వేణుమాధవ్ సన్నివేశాలు బాగున్నాయి. గ్లామర్ కోసం లక్ష్మీ రాయ్ ఉపయోగపడింది. ఓ పాటలో మితి మించింది. సలోని కూడా ఓపాటలో  అందాలు చిందించింది. ఇతర పాత్రల్లో కోట, ప్రదీప్ రావత్,మురళి శర్మ, చరణ్ రాజ్, జయసుధ, రెహమాన్, సుకన్య, పీ.జే.శర్మ, సన, కరుణ, కాశీ విశ్వనాద్,రవిప్రకాష్ పోషించారు. సన్నివేశ పరమైన ఒక పాట తప్ప, కళ్యాణీ మాలిక్ పాటల్లో కొత్తదనం లేదు. సురేంద్ర రెడ్డి ఫోటోగ్రఫీ పర్వాలేదు.  సాంకేతిక లోపం వల్ల -సినిమాలో పలు చోట్ల కలర్ లో వ్యత్యాసం కనిపిస్తుంది. జయసుధ విగ్గులోని  ఇబ్బందిని పట్టించుకోకుండానే పని కానిచ్చేసారు. ప్రకృతి చికిత్స ఆశ్రమం సెట్ బాగుంది.                    
                                                                                                                                                                                                                                                                                                                          -రాజేష్