RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, April 27, 2012

'దమ్ము' చిత్ర సమీక్ష

 'దమ్ము' చిత్ర సమీక్ష                      2.5/5

సి.సి.మీడియా -ఎంటర్ టైన్మెంట్ పతాకం ఫై కే.యస్.రామారావు సమర్పణ లో బోయపాటి శ్రీను దర్శకత్వం లో కే.ఏ . వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అనాధగా , ఆర్ధికంగా అతిజాగ్రత్తగా నగరం లో బతుకుతున్న విజయ్ సత్య ప్రేమలో పడతాడు. తమది' రాజ కుటుంభం' అని ఆమెకు  అబద్ధం చెప్పిన విజయ్ ఒక సంస్థాన రాజ కుటుంభం వారు తనని దత్తత తీసుకుంటారంటే అంగీకరిస్తాడు. అక్కడికి వెళ్ళిన విజయ్ కి  ఆ సంస్థానానికి, సమీపంలో ఉన్న మరో సంస్థానానికి మధ్య చిరకాలం గా విరోధం ఉన్న విషయం  తెలుస్తుంది. ఆ కక్షలు-హత్యల మధ్య ఉండలేక వెళ్ళిపోదామనుకున్న విజయ్ ప్రత్యర్ధి నాజర్  సంస్థానం వారు సాగిస్తున్న దమన కాండను చూసి వెనక్కి వచ్చి వారికి గుణ పాఠం చెబుతాడు. విజయ్ ని  నాజర్ దురాగతాలను అడ్డుకోవడానికి పాతికేళ్ళకు   వచ్చిన యువరాజు ' శ్రీ సింహ' గా ఆ సంస్థానం వారు జేజేలు పలుకుతారు.  ప్రతీకార వాంచతో ఉన్న నాజర్ మనుషులు విజయ్ కాబోయే బావను చంపి,   హింసను వ్యతిరేకించే విజయ్ ని హింసా మార్గానికి మళ్ళిస్తారు. ఆ తర్వాత విజయ్ యువరాజు ' శ్రీ సింహ' కాదనే విషయం తెలిసి పోతుంది. ఇక మిగతా కధ సినిమాలో చూడాలి ...

యాక్షన్- వయలెన్స్ కు ప్రాధాన్యతనిచ్చే బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఫ్యాక్షన్ చిత్రాల స్పెషలిస్టు నందమూరి హీరో యన్. టి. ఆర్ తో నిర్మించిన ఈ భారీ చిత్రం గతం లో వచ్చిన యన్. టి. ఆర్ 'ఆది','సింహాద్రి' చిత్రాల ను, బోయపాటి 'సింహా' ను చాలా చోట్ల గుర్తు చేస్తుంది. హీరోను వీరోచితం గా చూపడానికి అరిగి పోయిన ఫ్యాక్షన్ చిత్రాల బాటను ఎంపిక చేసుకోవడం లోనే దర్శకుడు తప్పు చేసాడు.కొన్ని భావోద్వేగ సన్నివేశాలు బాగా పండినా...గతం లో మనం చాలా సార్లు చూసిన రొటీన్ సన్నివేశాలే కావడంతో  చిత్రం లో కొత్తదనం కరువయ్యింది.అంతా రొటీన్ ఫార్ములతోనే నడుస్తుంది. బోయపాటి మార్క్ యాక్షన్- వయలెన్స్ మోతాదు మించింది.సినిమాలో సగం దీనికే కేటాయించారు.సందర్భ బలం లేకుండా పది సినిమాల్లో పెట్టాల్సిన భారీ డైలాగులు ఈ ఒక్క సినిమాలోనే పెట్టేసారని అనిపిస్తుంది. దానికి బోనస్ గా ద్వందార్ధాలు కూడా ఎక్కువ మోతాదులోనే కలిపినా ప్రేక్షకులు  ఆనంద పడక పోగా  ...హింసగా  ఫీలవుతున్నారు. ఇద్దరు హీరోయిన్ ల తో' ఏ' టైపు పాట పెట్టినా తనివి తీరక, నలుగురితో మరోపాట పెట్టి తమ కళా ప్రతిభను  ప్రదర్శించారు.ఇంట్లోనే అజ్ఞాతవాసం ఉన్న సుమన్ పాతికేళ్ళ తర్వాత బయటికి రావడం, తరాలుగా వైరం ఉన్న నాజర్ క్లైమాక్స్ లో ప్రత్యర్ధి హీరో ను పొగుడుతూ ఉపన్యాసం  ఇవ్వడం మరీ ఎబ్బెట్టుగా వుంది.

విజయ్ గా, శ్రీసింహ గా యన్.టి ఆర్ నటన ను ఈ సినిమాలో ప్రత్యేకత. పాటలు-ఫైట్లు- డైలాగ్ డెలివరి లోను  చాలా బాగాచేసాడు. సత్య  గా త్రిష- నీల  గా  కార్తీక గ్లామర్ కోసమే కనిపిస్తారు. అలీ-బ్రహ్మానందం కామెడీ కూడా అంతంతమాత్రమే . హీరో వేణు ఈ చిత్రం లోయన్.టి ఆర్ బావ గా ఒక పాత్ర పోషించడం విశేషం. ఇందులో ఇతర పాత్రల్లో సుమన్,నాజర్,కోట,అశోక్ కుమార్, ఆహుతి ప్రసాద్, తనికెళ్ళ భరణి,భానుప్రియ,చలపతిరావు,అభి
నయ,ప్రవీణ,శ్రీధర్, సంపత్ రాజ్,రాహుల్ దేవ్, కిషోర్ పోషించారు.  సంభాషణల రచయితగా రత్నం తన పనితనం ప్రేక్షకులకు మరో సారి రుచి చూపించాడు. యన్.టి ఆర్   రాజకీయ దృక్పధాన్ని  కూడా అక్కడక్కడా చూపించాడు. ఆర్ధర్ విల్సన్ ఫోటో గ్రఫీ ,కోటగిరి ఎడిటింగ్, ఆనంద్ సాయి కళ  , రాం -లక్ష్మణ్ ఫైట్స్ బాగున్నాయి.
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     -రాజేష్




0 comments:

Post a Comment