RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, May 25, 2012



                                                 'దరువు' చిత్ర సమీక్ష     2.25 /5

శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై శివ దర్శకత్వం లో బూరుగు పల్లి శివ రామ క్రిష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సిగ్గు సెరం...మానం మర్యాద లేకుండా డబ్బుకోసం అడ్డమైన పనులు చేసే బుల్లెట్ రాజా ఓ సారి దొంగతనానికి వెళ్ళినప్పుడు పెళ్ళికూతురు శ్వేతప్రేమలో పడిపోతాడు. తన బావ హార్బర్ బాబు తో బలవంతపు పెళ్ళికి సిద్దపడ్డ శ్వేత మనసుని , డాన్స్ మాస్టర్ విద్యా బాలన్ ని అడ్డం పెట్టుకుని గెలుచుకుంటాడు . అయితే, యమలోకం లో చిన్న యముడిని ఇబ్బంది పెట్టడానికి , చిత్రగుప్తుడు కావాలని  చేసిన పొరపాటువల్ల ...ఆయువు తీరకుండానే బుల్లెట్ రాజా చనిపోయి ,యమలోకానికి వస్తాడు. అప్పుడు జరిగిన పొరపాటు తెలుసుకున్న చిన్న యముడు- బుల్లెట్ రాజాను పక్క రాష్ట్రంలో మరణించిన మంత్రి రవీందర్ రూపంలో తిరిగి భూలోకానికి  పంపుతాడు. రవీందర్ గత ప్రవర్తన కు భిన్నంగా, ప్రజలకు  అనుకూలంగా చేస్తున్న బుల్లెట్ రాజా ను మట్టు పెట్టాలని అతని సన్నిహితులు ప్రయత్నిస్తారు. వారి కుట్రలను భగ్నం చేసి ...శ్వేతను ఎలా సొంతం  చేసుకున్నాడనేదే  ఈ చిత్ర కధాంశం.

వినోదాత్మక చిత్రాల హీరో రవితేజ ని కొత్తగా చూపించాలని ఇందులో సోషియో ఫాంటసి  గా  యమలోకాన్ని తీసుకున్నారు.అయితే గతం లో ప్రముఖ నటులు విజయవంతంగా చేసిన యమలోకం నేపధ్యంలో- సన్నివేశ రూప కల్పనలో ఘోరంగా విఫలమయ్యారు. దాదాపు  గత చిత్రాల్లోని సన్నివేశాలనే పేలవంగా  మరోసారి చూస్తున్నట్లు అనిపిస్తుంది. బుల్లెట్ రాజా -రవీందర్ లుగా రవితేజ నటనే ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ ఏకైక అంశం. బుల్లెట్ రాజా గా రవితేజ మరీ ఊర మాస్ పాత్ర చేసాడు. అరుపులు,గోలతో, వింత హావభావాలతో ... రెచ్చి పోయి చేసిన అతని నటన చూసాక రాబోయే చిత్రాల్లో - రవి తేజ ఇంకా  ఏ రేంజ్ నటనతో ఇరగదీస్తాడో నని భయం వేస్తుంది.  అయితే ఎడతెగని  ఉత్సాహంతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనే అతని తపన ఎంతైనా అభినందనీయం. రవీందర్ పాత్ర కాస్త హుందాగా వుంది. విద్యా బాలన్ గా బ్రహ్మానందం పాత్ర కూడా ఈ చిత్రం లో ప్రత్యేకత సంతరించుకుంది. శివ శంకర్ ని  పోలిన  డాన్స్ మాస్టర్ గా బ్రహ్మానందం తో ఇంకా మంచి ఫలితాలు సాధించే అవకాశం వున్నా ...స్క్రీన్ ప్లే లోపం వల్ల , వున్నంతలో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. పవిత్రానంద స్వామి పిలిస్తే చనిపోయిన రవీందర్ లేవడం, స్మశానం లో విలన్స్ తో కామెడీ-ఫైట్ సన్నివేశం, నిమ్మ కాయలు తల ఫై పెట్టి ఆడుకోవడం, జ్యోతి తో డిస్కషన్ సీన్ లో పవిత్రానంద స్వామి  ఇరుక్కు పోవడం,తల్లి  జయ సుధతో  సెంటిమెంట్ సన్నివేశాలు బాగున్నాయి. యమలోకం సెట్ తో  సహా కళా దర్శకుడి ప్రతిభ స్పష్టంగా కని పిస్తుంది. ఇటువంటి సినిమాల్లో పంచ్ లున్న డైలాగ్స్ కి ఎంతో ప్రాధాన్యత వుంటుంది. అయితే అందులో   చాలా మంది చేతులు పెట్టినట్లున్నారు ...సంభాషణలు అక్కడక్కడా బాగున్నాయి , కొన్ని చోట్ల ఘోరంగా వున్నాయి . అలాగే ప్రేక్షకులను అలరించే పాటలు కూడా ఈ చిత్రం లో మైనస్ అయ్యాయి.విజయ్ అంటోనీ   పాటల తో పాటు చిత్రీకరణ  కూడా ఆకట్టు కోలేదు . దర్శకుడు,సంగీత దర్శకుడు తమిళియన్స్ కావడం మూలంగా అరవ వాసన కూడా తగులుతుంది.
ప్రాధాన్యత లేని శ్వేత పాత్రలో  తాప్సి లంకణాలు చేసిన దానిలా, ఎండి పోయిన చెట్టులా కనిపించింది. పెద్ద యముడిగా సత్యనారాయణ,చిన్న యముడిగా తమిళ నటుడు ప్రభు,చిత్ర గుప్తుడిగా ఎమ్మెస్ నారాయణ,నారదుడుగా యల్.బి.శ్రీరాం,  మిత్రుడిగా వెన్నెల కిషోర్, పీ.ఏగా శ్రీనివాస రెడ్డి,  పవిత్రానంద స్వామిగా రఘు బాబు, తల్లిగా జయసుధ,పండితుడిగా  ధర్మవరపు, విలన్స్  హార్బర్ బాబు గా సుశాంత్ సింగ్,సయ్యజి షిండే, అవినాష్ నటించారు. వెట్రి ఫోటో గ్రఫీ పర్వాలేదు. రీ రికార్డింగ్- గ్రాఫిక్స్ అంతంత మాత్రం గానే వున్నాయి.                    
                                          -  రాజేష్

Friday, May 11, 2012

'గబ్బర్ సింగ్' చిత్ర సమీక్ష

'గబ్బర్ సింగ్' చిత్ర సమీక్ష                    3/5

పరమేశ్వర ఆర్ట్ ప్రోడక్షన్స్ పతాకం ఫై హరీష్ శంకర్ దర్శకత్వం లో గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

తనకు తగిన ఆదరణ లేకపోవడం తో చిన్నతనం లోనే  ఇల్లువదిలి పోయిన హీరో కు 'షోలే' గబ్బర్ సింగ్  విలనిజం అంటే ఇష్టం . ఆ పేరునే పెట్టుకుని పోలీసు అధికారి గా మారి తన వూరు కొండవీడు కి బదిలీ అయ్యి వస్తాడు. అక్కడ జనాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్న సిద్దప్ప నాయుడు  ను అడ్డుకుని ప్రజల్లో మంచిపేరు తెచ్చుకుంటాడు. తాగు బోతు కూతురు భాగ్య లక్ష్మి ఫై మనసు పడతాడు.రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మల్యే అవ్వాలనుకున్న , తమ దారికి అడ్డుపడుతున్న గబ్బర్ సింగ్ ను తప్పించడానికి సిద్దప్ప చేసే ప్రయత్నాలను ఎదుర్కుంటూ ...భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకున్న గబ్బర్ సింగ్ తన కుటుంభాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్న అభిమన్యుని ఎలా మట్టు పెట్టాడనేదే ఈ చిత్ర కధాంశం.

మొదట 'షాక్' తిన్నా ...రవితేజ  'మిరపకాయ్' ,ఇప్పుడు పవన్ కళ్యాణ్  'గబ్బర్ సింగ్'తో హీరో ల ఇమేజ్ తో మ్యాజిక్ చెయ్యడం లో  హరీష్ శంకర్ విజయవంతమయ్యాడు. హిందీ లో  విజయం సాధించిన 'దబాంగ్' కు మన నేటివిటీ కి తగిన మార్పులు చేసి తీసిన ఈ చిత్రం పూర్తిగా మాస్ ...పరమ మాస్ చిత్రం. పూర్తిగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఫై నే  ఆధార పడి చేసిన చిత్రం. పోలీసు స్టేషన్ కే తన పేరు పెట్టుకున్న  గబ్బర్ సింగ్ వ్యవహార శైలి ...చూస్తే మనకు మహా అసహజత్వం కనిపిస్తుంది.  అటువంటివి ఏమీ ఆలోచించ కుండా చూస్తూ పోతేనే ఈ చిత్రం లో వినోదం దొరుకుతుంది . గబ్బర్ సింగ్ గ్రామస్థులతో పరిచయ సన్నివేశం, రౌడీ తో కబాడీ ఫైట్, హస్త కళా ప్రదర్శన ప్రారంభం లో చెప్పుల ప్రహసనం, కోట మందు పాట, గబ్బర్ భారీ  కట్ అవుట్ తో బ్రహ్మానందం హడావుడి, పెళ్లి చూపులకు వెళ్ళి వచ్చే సన్నివేశాలు,పోలీసు స్టేషన్ లో రౌడీలతో అంత్యాక్షరి... మంచి వినోదాన్ని అందించాయి.అయితే ఈ రౌడీల అంత్యాక్షరి మరీ అంత మొరటుగా కాకుండా చేసుంటే  బాగుండేది. తల్లి, సవతి తండ్రి, తమ్ముళ్ళ  తో చేసినసన్నివేశాలు తక్కువే అయినా, పండాయి.  హీరోతో తల పడిన ప్రతినాయకుడి ఎత్తుగడలన్నీ  మరీ పాతకాలం నాటివి.  క్యారెక్టరైజేషణ్ లో విలన్ ని ఇంకాస్త బలం గా చూపాల్సింది. అలాగే  క్లైమాక్స్ కూడా షార్ట్ కట్ లో        తేల్చేసి నట్లనిపిస్తుంది. హరీష్ రాసిన  సంభాషణలు ఈవినోదాత్మక చిత్రానికి పెద్ద అసెట్ అయ్యాయి.

ప్రజలకి మంచి చేసే' తిక్క' పోలీసు అధికారిగా 'లెక్క' తప్పకుండా,  తన సహజ శైలి లో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను,అభిమానులను విశేషం గా ఆకట్టుకున్నాడు. భాగ్య లక్ష్మి గా శృతి హసన్ ఎంపిక ఈ చిత్రం లో పెద్ద మైనస్. గ్రామీణ వాతావరణానికి ఏ మాత్రం సరిపడని గెటప్ తో శ్రుతిని ఓ బొమ్మలా చూపించారు. ఆమెకి చెప్పించిన డబ్బింగ్ ఇంకా ఇబ్బంది పెట్టింది. సిద్దప్పగా అభిమన్యు సింగ్ బాగా చేసాడు.  చిన్న గబ్బర్ సింగ్ గా  పూరి జగన్నాద్ కొడుకు ఆకాష్ నటించిన ఈ చిత్రం లో తనికెళ్ళ భరణి,నాగినీడు,సుహాసిని,రావు రమేష్,గాయత్రి రావు,అజయ్, కోటఇతర పాత్రలు పోషించారు. పోలీసు సాంబ గా అలీ, రికవరీ రంజిత్ కుమార్ గా బ్రహ్మానందంతో పాటు సిద్దప్ప గ్యాంగ్ లో రౌడీ లు అంతా  మంచి కామెడీ చేసారు. 'దబాంగ్' లో చేసిన మలైకాఅరోరా ఇందులోనూ ' కెవ్వు కేక' అంటూ ఐటెం సాంగ్ చేసింది. ఒకటి రెండు పాత ట్యూన్స్ ఉన్నావాటిని  చక్కగా మిక్స్  చేసి , పాటలు హిట్ చేసి దేవి శ్రీ ప్రసాద్ సినిమా  విజయానికి దోహదం చేసాడు. ప్రత్యేకం గా 'ఆకాశం అమ్మయితే' పాటను చెప్పుకోవాలి .  పాటల చిత్రీకరణ తో పాటు , జయనన్ విన్సెంట్ ఫోటో గ్రఫీ, రాం-లక్ష్మణ్ యాక్షన్, గౌతం రాజు ఎడిటింగ్ బాగున్నాయి.                                                                                                                                                                                                                                                      -రాజేష్

Friday, April 27, 2012

'దమ్ము' చిత్ర సమీక్ష

 'దమ్ము' చిత్ర సమీక్ష                      2.5/5

సి.సి.మీడియా -ఎంటర్ టైన్మెంట్ పతాకం ఫై కే.యస్.రామారావు సమర్పణ లో బోయపాటి శ్రీను దర్శకత్వం లో కే.ఏ . వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అనాధగా , ఆర్ధికంగా అతిజాగ్రత్తగా నగరం లో బతుకుతున్న విజయ్ సత్య ప్రేమలో పడతాడు. తమది' రాజ కుటుంభం' అని ఆమెకు  అబద్ధం చెప్పిన విజయ్ ఒక సంస్థాన రాజ కుటుంభం వారు తనని దత్తత తీసుకుంటారంటే అంగీకరిస్తాడు. అక్కడికి వెళ్ళిన విజయ్ కి  ఆ సంస్థానానికి, సమీపంలో ఉన్న మరో సంస్థానానికి మధ్య చిరకాలం గా విరోధం ఉన్న విషయం  తెలుస్తుంది. ఆ కక్షలు-హత్యల మధ్య ఉండలేక వెళ్ళిపోదామనుకున్న విజయ్ ప్రత్యర్ధి నాజర్  సంస్థానం వారు సాగిస్తున్న దమన కాండను చూసి వెనక్కి వచ్చి వారికి గుణ పాఠం చెబుతాడు. విజయ్ ని  నాజర్ దురాగతాలను అడ్డుకోవడానికి పాతికేళ్ళకు   వచ్చిన యువరాజు ' శ్రీ సింహ' గా ఆ సంస్థానం వారు జేజేలు పలుకుతారు.  ప్రతీకార వాంచతో ఉన్న నాజర్ మనుషులు విజయ్ కాబోయే బావను చంపి,   హింసను వ్యతిరేకించే విజయ్ ని హింసా మార్గానికి మళ్ళిస్తారు. ఆ తర్వాత విజయ్ యువరాజు ' శ్రీ సింహ' కాదనే విషయం తెలిసి పోతుంది. ఇక మిగతా కధ సినిమాలో చూడాలి ...

యాక్షన్- వయలెన్స్ కు ప్రాధాన్యతనిచ్చే బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఫ్యాక్షన్ చిత్రాల స్పెషలిస్టు నందమూరి హీరో యన్. టి. ఆర్ తో నిర్మించిన ఈ భారీ చిత్రం గతం లో వచ్చిన యన్. టి. ఆర్ 'ఆది','సింహాద్రి' చిత్రాల ను, బోయపాటి 'సింహా' ను చాలా చోట్ల గుర్తు చేస్తుంది. హీరోను వీరోచితం గా చూపడానికి అరిగి పోయిన ఫ్యాక్షన్ చిత్రాల బాటను ఎంపిక చేసుకోవడం లోనే దర్శకుడు తప్పు చేసాడు.కొన్ని భావోద్వేగ సన్నివేశాలు బాగా పండినా...గతం లో మనం చాలా సార్లు చూసిన రొటీన్ సన్నివేశాలే కావడంతో  చిత్రం లో కొత్తదనం కరువయ్యింది.అంతా రొటీన్ ఫార్ములతోనే నడుస్తుంది. బోయపాటి మార్క్ యాక్షన్- వయలెన్స్ మోతాదు మించింది.సినిమాలో సగం దీనికే కేటాయించారు.సందర్భ బలం లేకుండా పది సినిమాల్లో పెట్టాల్సిన భారీ డైలాగులు ఈ ఒక్క సినిమాలోనే పెట్టేసారని అనిపిస్తుంది. దానికి బోనస్ గా ద్వందార్ధాలు కూడా ఎక్కువ మోతాదులోనే కలిపినా ప్రేక్షకులు  ఆనంద పడక పోగా  ...హింసగా  ఫీలవుతున్నారు. ఇద్దరు హీరోయిన్ ల తో' ఏ' టైపు పాట పెట్టినా తనివి తీరక, నలుగురితో మరోపాట పెట్టి తమ కళా ప్రతిభను  ప్రదర్శించారు.ఇంట్లోనే అజ్ఞాతవాసం ఉన్న సుమన్ పాతికేళ్ళ తర్వాత బయటికి రావడం, తరాలుగా వైరం ఉన్న నాజర్ క్లైమాక్స్ లో ప్రత్యర్ధి హీరో ను పొగుడుతూ ఉపన్యాసం  ఇవ్వడం మరీ ఎబ్బెట్టుగా వుంది.

విజయ్ గా, శ్రీసింహ గా యన్.టి ఆర్ నటన ను ఈ సినిమాలో ప్రత్యేకత. పాటలు-ఫైట్లు- డైలాగ్ డెలివరి లోను  చాలా బాగాచేసాడు. సత్య  గా త్రిష- నీల  గా  కార్తీక గ్లామర్ కోసమే కనిపిస్తారు. అలీ-బ్రహ్మానందం కామెడీ కూడా అంతంతమాత్రమే . హీరో వేణు ఈ చిత్రం లోయన్.టి ఆర్ బావ గా ఒక పాత్ర పోషించడం విశేషం. ఇందులో ఇతర పాత్రల్లో సుమన్,నాజర్,కోట,అశోక్ కుమార్, ఆహుతి ప్రసాద్, తనికెళ్ళ భరణి,భానుప్రియ,చలపతిరావు,అభి
నయ,ప్రవీణ,శ్రీధర్, సంపత్ రాజ్,రాహుల్ దేవ్, కిషోర్ పోషించారు.  సంభాషణల రచయితగా రత్నం తన పనితనం ప్రేక్షకులకు మరో సారి రుచి చూపించాడు. యన్.టి ఆర్   రాజకీయ దృక్పధాన్ని  కూడా అక్కడక్కడా చూపించాడు. ఆర్ధర్ విల్సన్ ఫోటో గ్రఫీ ,కోటగిరి ఎడిటింగ్, ఆనంద్ సాయి కళ  , రాం -లక్ష్మణ్ ఫైట్స్ బాగున్నాయి.
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     -రాజేష్




Saturday, April 14, 2012

వీర్యదాత గా టీవీ ప్రెజెంటర్ ఆయుష్మాన్ ఖురానా


టీవీ ప్రెజెంటర్ ఆయుష్మాన్ ఖురానా చిరకాల వాంఛ తీరింది. ఒక కొత్త తరహా సినిమా' వికీ డోనర్‌'లో అవకాశం దక్కించుకున్నాడు. ఇందులో వీర్యదాత గా కనిపిస్తాడు. కాస్త సమయం పట్టినా మంచి సినిమాతో కెరీర్‌ను మొదలుపెట్టినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈ యువకుడు అంటున్నాడు. టీవీ చానెల్స్‌లో రకరకాల షోలు నిర్వహించిన ఈ 27 ఏళ్ల యువకుడు హీరో చాన్స్ కోసం నాలుగేళ్లు నిరీక్షించాడు. ‘ఎంటీవీ రోడీస్‌లో విజయం సాధించిన తరువాత చాలా సినిమాల్లో హీరోగానూ, రెండో హీరోగానూ అవకాశాలు వచ్చాయి. ఆ స్క్రిప్టులేవీ నాకు నచ్చలేదు. అందుకే నాలుగేళ్లు....

ఇక సినిమాలకు దూరంగా ఐశ్వర్య?

బాలీవుడ్‌ అందాల సుందరి ఐశ్వర్యరాయ్, ఇకపై కెమరా ముందుకు వచ్చే కన్పించడం లేదు. సినిమాలపై తనకు ఆసక్తి తగ్గినమాట వాస్తవమేనని, మళ్లీ సినిమాల్లో కన్పించే అవకాశాలు చాలా తక్కువేనని ఐశ్వర్యరారు తేల్చేసింది.ఐష్‌ తాజా ప్రకటనతో ఒక్కసారిగా ఆమె అభిమానుల్లో ఆందోళన మొదలైంది. పెళ్లయ్యాక కూడా బాలీవుడ్‌ హీరోయిన్‌గా నెంబర్‌వన్‌ పొజిషన్‌ తనదేనన్పించకుంది. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఐష్‌, చాన్నాళ్లకు వెండితెరకు దూరంగా....

Saturday, April 7, 2012

                                                     'రచ్చ' చిత్ర సమీక్ష            2.5/5                              
          
మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకం ఫై సంపత్ నంది దర్శకత్వం లో యన్.వి.ప్రసాద్, పారస్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రతి దానికీ పందెం కాసే బస్తీ వాసి బెట్టింగ్ 'రాజ్' ఒక సారి తన తండ్రి ఆపరేషన్ కోసం డబ్బు అవసరమై తన ప్రత్యర్ధి జేమ్స్ తో ఓ పందెం కడతాడు. దాని ప్రకారం, ఫ్యాక్షనిస్ట్ బళ్ళారి కూతురు చైత్రను రాజ్ ప్రేమలోకి దించాలి. అవసరార్ధం దీనికి వప్పుకున్న రాజ్- చైత్ర తన ప్రేమకు పెట్టిన మూడు పరీక్షల్లో నెగ్గు తాడు. రాజ్ తో చైత్ర  'ఐ లవ్ యూ' చెప్పే   సమయానికి వారి ఫై దాడి చేసిన బళ్ళారి గ్యాంగ్  నుండి చైత్రను కాపాడేందుకు ఆమెను తీసుకుని శ్రీశైలం అడవుల్లోకి వెళ్తాడు.అక్కడ తెలుస్తుంది చైత్ర బళ్ళారి కూతురు కాదని ...ఆస్తి కోసం ఆమెను బళ్ళారి చంపాలను కుంటున్నాడని. దానితో పాటు రాజ్ తండ్రికి...వారి వూరికి బళ్ళారి చేసిన ద్రోహం కూడా తెలుసుకున్న రాజ్ ఏమి చేసాడనేదే ఈ చిత్ర కధాంశం .

యువ నటులతో యూత్ సినిమా చేసి విజయవంతం అయిన సంపత్ నంది రాంచరణ్ తో ఈ భారీ చిత్రం చేసి అంతగా సఫలం కాలేదు  .సక్సెస్ సాధించిన సినిమాల ఫార్ములాను ఎంచుకోవడం తప్ప, ప్రధానమైన కధ విషయం లోనే తప్పు చేసిన దర్శకుడు ...కధనం విషయం లో మరింత గందర గోళానికి లోనయ్యాడు. ఫ్యాక్షనిస్ట్ నేపధ్యం లో తెలుగులో వచ్చిన చాలా సినిమాల సన్నివేశాలే  ఈ చిత్రం లో కనిపిస్తాయి. 'బన్నీ' వంటి సినిమాలు గుర్తొస్తాయి. సినిమా అంతా సూపర్ స్పీడ్ లో నడిపించాలనే దర్శకుడు ...  ఏ సన్నివేశం  ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా చెయ్యలేక పోయాడు. కొత్తగా వుంటే పర్వాలేదు ...రొటీన్ సన్నివేశాలని ఎంత వేగంగా చూపినా లాభం  లేదు. చివరికి,  సినిమాలో ప్రధానమైన ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు కూడా విఫల మయ్యాడు . సినిమా ప్రారంభంలో ట్రైన్ కి ఎదురెళ్ళే సన్నివేశం తో సహా ఫైట్స్ లో గ్రాఫిక్స్ ప్రభావం ఎక్కువైపోయి సహజత్వానికి దూరమైపోయాయి.  శ్రీశైలం అడవులని చెప్పి...వెదురు తోటల్లో విదేశీయులతో ఫైట్  పెట్టారు. క్లైమాక్స్ లో రొటీన్ నరుకుడు ఫైట్  సుదీర్ఘంగా ప్రేక్షకులను బాధించింది. సినిమాలో ప్రతి చిన్న పాత్రకీ పాపులర్ నటీనటులను పెట్టుకున్నారు.కానీ ఎవరినీ సద్వినియోగం చేసుకోలేకపోయారు.

'బెట్టింగ్ రాజ్' గా పూర్తి మాస్ పాత్రలో  రాణించడానికి రాం చరణ్  బాగా కష్ట పడ్డాడు. అయితే చిరంజీవి లాకనిపించా లనే అతని ప్రయత్నం, అతని క్యారెక్టరైజేషన్ ...సినిమాటిక్ గానే వున్నాయి తప్ప , ప్రేక్షకులు హర్షించేలా లేవు. త్వరలో హిందీ సినిమా చేస్తున్నందుకు కాబోలు ...ఇందులో హిందీ  డైలాగులు ఎక్కువ పెట్టారు. పనిలో పనిగా ...నందమూరి వంశం  ఫైన  కూడా కొన్ని సెటైర్లు కొట్టారు.  చైత్ర గా తమన్నా తెలతెల్లగా అందంగానే వున్నా, ఆకర్షణీయంగా ఆనిపించలేదు. 'వానా వానా ' పాటలో మాత్రం సెక్సీ గా వుంది. రంగీలా గా బ్రహ్మానందం, లవ్ గురు పాపారావు గా అలీ కొంత నవ్వించారు. ఇతర పాత్రల్లో కోట, పార్తీపన్, దేవ్ గిల్, అజ్మల్, ముకేష్ రుషి,జయప్రకాష్ రెడ్డి,పరుచూరి వేంకటేశ్వర్ రావు, నాజర్, యల్.బి.శ్రీరాం,రవి బాబు తదితరులు నటించారు.పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అక్కడక్కడా పర్వాలేదు. హీరో విషయం లో చెప్పించిన డైలాగులు మాత్రం-' పిట్ట కొంచం ...పొగడ్త ఘనం'అన్నట్లున్నాయి. మణిశర్మ పాటల్లో టైటిల్ సాంగ్,'వాన వానా' తప్ప ఏ పాటా వినసొంపుగా లేదు. సమీర్ రెడ్డి  ఫోటోగ్రఫి బాగుంది.                                                                                                        -రాజేష్
                                                                                                                                                                                                                                              
                                                                                                                                                                                                                                                

Wednesday, April 4, 2012

ఘనంగా వి.బి.రాజేంద్ర ప్రసాద్ అశీతి మహోత్సవం

                                            ఘనంగా వి.బి.రాజేంద్ర ప్రసాద్ అశీతి మహోత్సవం

ప్రముఖ  చిత్ర నిర్మాణ సంస్థ  జగపతి ఆర్ట్స్ అధినేత , దర్శకుడు  వి.బి.రాజేంద్ర ప్రసాద్  80 ఏళ్ళ పండగ (అశీతి మహోత్సవం) ఏప్రిల్  3  న రవీంద్రభారతి లో 'యువకళావాహిని' వై.కే.నాగేశ్వరరావు  ఆధ్వర్యం లో  వైభవం గా జరిగింది.  ఇదే వేదిక ఫై జగపతి సంస్థ నిర్మించిన 'ఆరాధన' చిత్రం  50 ఏళ్ళ వేడుక కూడా నిర్వహించారు. సారిపల్లి కొండల రావు అధ్యక్షత వహించిన ఈ సభలో- డా"సి. నారాయణ రెడ్డి, రాష్ట్ర మంత్రి కాసు కృష్ణా రెడ్డి , అక్కినేని నాగేశ్వర్ రావు, డి.రామా నాయుడు, టి.సుబ్బరామి రెడ్డి, జమున ,వాణిశ్రీ,  ఏడిద నాగేశ్వర్ రావు, అక్కినేని రమేష్ ప్రసాద్, మురళీ మోహన్, పీ . చంద్ర శేఖర రెడ్డి , జగపతి బాబులు పాల్గొని జగపతి రాజేంద్ర ప్రసాద్ ను ఘనం గా సత్కరించారు. "రాజేంద్రప్రసాద్ మనసున్న  మనిషి .జగపతి పతాకం ఫై సకుటుంబంగా చూడదగ్గ చిత్రాలు ఎన్నో అందించారు. వారు నిర్మించిన చిత్రాలన్నీ కధ....సంగీత పరంగా మంచి  స్థాయి కలిగినవి . ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డ్ ఇచ్చి సత్కరించడం ఎంతైనా అభినందనీయం" -అంటూ ఈ సందర్భంగా హాజరైన  ప్రముఖులు ప్రశంసించారు .ఈ సందర్భం గా- 'ఆరాధన' చిత్ర కధా నాయకుడు అక్కినేనిని,'అన్నపూర్ణ' చిత్ర  నాయిక జమునని,' దసరాబుల్లోడు' చిత్ర నాయిక వాణిశ్రీ ని సత్కరించారు. ఈ సభలో-యస్.వి .రామారావు వ్యాఖ్యానం తో  చంద్ర తేజ, విజయ లక్ష్మి, వినోద్ బాబు లు అందించిన 'జగపతి చిత్ర గీతమాలిక' ప్రేక్షకులను విశేషంగా అలరించింది.