RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, February 21, 2014

'ఆహా కళ్యాణం' చిత్ర సమీక్ష

                                'ఆహా కళ్యాణం' చిత్ర సమీక్ష        3/5 

యష్‌రాజ్‌  ఫిలింస్‌  పతాకం ఫై  గోకుల్ కృష్ణ దర్శకత్వం లో  ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు 


శక్తి (నాని) ఎటువంటి లక్ష్యం లేని కుర్రాడు . అతనికి జీవితంలో ఏం చేయాలో కూడా తెలియదు.  అతను ఒక పెళ్లిలో శృతి (వాణి కపూర్)తో పరిచయమై ,ఫ్రెండ్స్ అవుతారు. శృతి ఒక లక్ష్యం వున్న అమ్మాయి. ఆమె సొంతంగా ఒక వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీని ప్రారంభించాలని అనుకుంటుంది. తన  వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ లో భాగస్వామిగా చేసుకోమని శక్తి కోరతాడు. మొదట వద్దన్నా , తరువాత శక్తిని పార్ట్నర్ గా చేర్చుకోవడానికి శృతి అంగీకరిస్తుంది. వారిద్దరూ కలిసి ‘గట్టి మేళం’ అనే పేరుతో వెడ్డింగ్ ప్లానింగ్  కంపెనీని మొదలుపెడతారు. వీరి కంపెనీకి కొద్ది రోజుల్లోనే మంచి పేరు వస్తుంది. ఒక రోజు వారి  బృందం పార్టీ  జరుపుకున్న రాత్రి - ఆ మైకం లో శృతి, శక్తి మరింత దగ్గరవుతారు . ఆ సాన్నిహిత్యాన్ని రొటీన్   సంఘటనగా తీసుకున్న శక్తితో  శృతిగొడవ పడుతుంది .దానివల్ల ఇద్దరూ విడిపోయి నష్టపోతారు . ఆ తరువాత వారి బిజినెస్ ఏమైంది? మళ్ళీ వారిద్దరూ కలిశారా?  అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే... 

హిందీ లో విజయ వంతం అయిన 'బ్యాండ్ బాజా బారాత్' ను గతంలో ఓ పెద్ద దొంగల సంస్థ తెలుగులో  ఫ్రీ మేక్ చేసేసింది . అయితే, దొంగలకు ఎలాంటి శాస్తి జరగాలో- అలానే ఆ చిత్రం బాక్సాఫీసు  ముందు ఘోరంగా  చీదేసింది. ఆ నేపధ్యం , పాత్రలతోనే వచ్చిన 'ఆహా కళ్యాణం' మాత్రం 'ఆహా' అనిపించక పోయినా , ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని కలిగిస్తుంది .దీన్ని  తమిళంలో రీ మేక్ చేసి తెలుగు లోకి అనువదించారు . అందుకనే- సినిమా అంతా ఎంత జాగ్రత్త పడ్డా, అనువాద అవలక్షణాలు స్పష్టంగా కనిపిస్తూనే వుంటాయి .దర్శకుడు గోకుల్‌ కృష్ణ ఒరిజినల్‌కి మార్పు చేర్పులు చేయడానికి సాహసించలేదు. హిందీలో ఎలా ఉందో అలానే తీయడానికి కట్టుబడ్డాడు. సరదా సన్నివేశాల వరకు బాగానే చేసినా , సినిమాలో హీరో - హీరో యిన్ ల మధ్య ఘర్షణని  సరిగా హ్యాండిల్‌ చేయలేకపోయాడు. సినిమా మొత్తం నాని - వాణి ల ఫైనే నడిచినా, ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా, ఇద్దరూ బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ తో అలరించారు . నాని – వాణి కపూర్ ల మధ్య కెమిస్ట్రీ ఈ మూవీకి పెద్ద  ప్లస్ పాయింట్. వీరి మధ్య వచ్చే ముద్దు సన్నివేశం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది .  

యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమా మొత్తం పెళ్లిసందడితో కలర్ ఫుల్ గా సాగుతుంది. వచ్చీరాని ఇంగ్లీష్  మాట్లాడే శక్తి పాత్రలో నాని చాలా బాగా చేసాడు . శృతి పాత్ర చేసిన వాణీకపూర్  అందం, అభినయం రెండింటితో   ప్రేక్షకులను ఆకట్టుకుంది . డాన్సుల్లో  కూడా తన గ్లామర్ తో  కట్టి పడేసి, ఈ సినిమాలో  తనే హైలైట్ అయ్యింది . అతిథిపాత్రలో చాన్నాళ్ళకి  సిమ్రాన్ మళ్ళీ కనిపించింది . శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు బాగున్నాయి .ధరన్ కుమార్ పాటలు బాగున్నా -అనువాద సాహిత్యం సింక్ కాక రొదలా వినిపించాయి  .ప్రయోగాత్మకం గా చేసిన పంచ్  డైలాగ్స్ పాట కూడా అలానే వుంది  .  రీ రికార్డింగ్ కొన్ని సన్నివేశాల్లో బాగుంది .  లోగనాధన్‌ శ్రీనివాసన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫ్రేమ్స్‌ అన్నీ రిచ్‌గా ఉన్నాయి. ఆర్ట్‌ వర్క్‌ అందంగా, బాగుంది. బవన్‌ శ్రీకుమార్‌ ఎడిటింగ్‌ ఫర్వాలేదు                               -రాజేష్ 

Friday, February 7, 2014

' పైసా' చిత్ర సమీక్ష

                                     ' పైసా' చిత్ర సమీక్ష     2.5 / 5

ఎల్లో ఫ్లవర్స్‌ పతాకం ఫై కృష్ణవంశీ కథ, కథనం, మాటలు, దర్శకత్వంతో   రమేష్‌ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మించారు .ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది .  


ప్రకాష్‌ (నాని)కు డబ్బంటే విపరీతమైన పిచ్చి. అతను  హైదరాబాద్ పాతబస్తీలో ఓబట్టల షాప్ మోడల్ . జీవితంలో కోటి రూపాయలు సంపాదించి సెటిలైపోవాలనుకుంటాడు. పాతబస్తీలో ఉండే నూర్ (కేథెరిన్ థెరిసా) అంటే ప్రకాష్ కు ఇష్టం. అలాగే ప్రకాష్‌ అంటే నూర్ కు చెప్పలేనంత ప్రేమ.ఒక రోజు  పరిచయమైన  అందమైన, ధనవంతుల  అమ్మాయి స్వీటీ(సిద్దిక శర్మ) -ప్రకాష్‌ లు మంచి స్నేహితులవుతారు. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న నూర్ కు ఇష్టం లేకపోయినా, తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ముసలి  దుబాయ్ షేక్ ని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. అది తెలిసిన ప్రకాష్‌ నూర్  పెళ్లి చెడగొట్టి , ఆమెను  తీసుకొని అక్కడ వున్న   బ్లాక్  ఇన్నోవా కారులో పారిపోతాడు. పైసా అంటే పడి చచ్చే ప్రకాష్‌ కు అనుకోకుండా-అదే కారు లో  యాభై కోట్ల రూపాయలు వున్న  విషయం తెలిసి షాక్ తింటాడు . డబ్బు తో పాటు అతన్ని సమస్యలూ చుట్టు  ముడతాయి . మూడు ముటాలబారి నుండి బయట పడటానికీ , డబ్బు స్వంతం చేసుకోవడానికీ ప్రకాష్  ఎన్ని కష్టాలు   పడ్డాడు? అనేది సినిమాలో చూడాలి ... 

తెలుగులో తనదైన సృజనాత్మక శైలి కలిగిన దర్శకుల్లో  కృష్ణవంశీ ఒకరు . గతంలో ఎన్నో మంచి చిత్రాలు అందించిన కృష్ణవంశీలో విషయం తగ్గుముఖం పడుతోందని ఈ మధ్య వచ్చిన అతని చిత్రాలే చెబుతున్నాయి . కృష్ణవంశీ దర్సకత్వంలో వచ్చిన 'మొగుడు' అందుకు పెద్ద ఉదాహరణ .  అతని గత  చిత్రాలు నిరాశ పరిచినా-  సినీ ప్రియులకి అతని సినిమాల పై ఆసక్తి మాత్రం వుంటుంది .  ‘పైసా’ కూడా కృష్ణవంశీ విలక్షణతకి అద్దం పట్టే చిత్రమే. ఇందులోనూ  కృష్ణవంశీ తన ప్రత్యేక ముద్ర చాటుకుంటూ , తనదైన శైలిలో చిత్రీకరించాడు. అయితే  పూర్తి స్థాయిలో సంతృప్తి పరచడంలో విఫలమయ్యాడు .కొన్ని సన్నివేశాలు తనదైన శైలి లో ప్రతిభావంతంగా చేసిన   కృష్ణవంశీ చాలా సన్నివేశాలు' సో సో' గా చెయ్యడమే ఈ చిత్రాన్ని బలహీనపరిచింది  .  కృష్ణవంశీ గత చిత్రం ‘మొగుడు’తో పోలిస్తే ఖచ్చితంగా ‘పైసా’ బెటర్‌ చిత్రం .డబ్బుల పతంగ్ ని హీరో సాధించడం , కారులో డబ్బు విషయం హీరో కి తెలిసిన సన్నివేశం బాగా చిత్రీకరించారు . అలాగే స్వీటీ తో కలిసి ఓల్డ్ సిటీ లోని  'మెహబూబ్ కి మెహందీ' (రెడ్ లైట్ ) కి వెళ్లి ఇబ్బందుల్లో పడటం ... అర్ధం లేని , చిరాకు పుట్టించే సందర్భం. మూడు గ్రూపుల చేజ్ లు  గోల గోలగా నడిచాయి  . క్లైమాక్స్ కూడా మరీ నీరసం గా  వుంది. చివరి ట్విస్ట్ ఒక్కటే ఆసక్తికరంగా ప్రేక్షకుడు ఫీలయ్యాడు .  

'ఈగ' తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న  నానికి ఈ చిత్రంలోని ప్రకాష్ పాత్ర బాగా కుదిరింది . నటుడిగా నిరూపించుకోవడానికి లభించిన ఈ  పాత్రను నాని చక్కగా సద్వినియోగ పరుచుకున్నాడు. మాస్ ఎలిమెంట్స్ ఉన్న పాత్రలో తనదైన స్టైల్ తో ఆకట్టుకున్నాడు. కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ ను చక్కగా పలికించాడు. 
నూర్ గా  కేథరిన్ థెరిసాకు మంచి పాత్రే లభించింది. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని..  గ్లామర్ తో పాటు, పెర్మార్మెన్స్ తో కూడా కేథరిన్ ఆకట్టుకుంది. ఎమ్మెల్యే కూతురుగా స్వీటీ పాత్రలో కనిపించిన సిద్దికా శర్మ గ్లామర్ కే పరిమితమైంది. నాని ఫ్రెండ్ గా డ్రైవర్ పాత్రలో  తబర్ గుర్తుండిపోయే పాత్రను పోషించాడు. ఇతర పాత్రల్లో చరణ్ రాజ్, భరత్ రెడ్డి, ఆర్ కే, రాజా రవీంద్ర, దువ్వాసి మోహన్ నటించారు . చిలక జ్యోతిష్కుడి పాత్రలో కొద్దిసేపే కనిపించిన వేణు  ఆకట్టుకున్నాడు. 

సంతోష్  రాయ్  ఫోటోగ్రఫీ లో కొన్ని కెమెరా యాంగిల్స్‌ ,అలాగే వేగం గా సాగిన  త్యాగు ఎడిటింగ్ కూడా ప్రేక్షకులను  ఇబ్బంది పెడుతుంది . పాటలతో పెద్దగా పని లేని ఈ చిత్రం లో - 'నీతో ఏదో' అనే పాట చిత్రీకరణ లో కృష్ణ వంశీ ముద్ర కనిపిస్తుంది .టెంపోను కొనసాగించడానికి రీరికార్డింగ్ బాగా ఉపయోగపడింది. ‘కడుపుకి మించిన ఆకలి, అర్హతకి మించిన ఆశ, అవసరానికి మించిన డబ్బు... అరగవు’-లాంటి కృష్ణ వంశీ సంభాషణలతో పాటు... ‘ప్రేమ, పెళ్లి, జీవితం’ గురించి నాని చెప్పే సన్నివేశంలోని తత్వం.. మెప్పిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు బాగా చేసారు .   సి.జి వర్క్ లో చాలా లోపాలున్నాయి.                                        -రాజేష్