RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, March 28, 2014

'లెజెండ్' చిత్ర సమీక్ష

                                        'లెజెండ్' చిత్ర సమీక్ష   3 / 5

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్-వారాహి చలనచిత్రం పతాకం ఫై బోయపాటి శ్రీను దర్శకత్వం లో అచంట గోపినాథ్, ఆచంట రాము, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు . 

 
ఇంట్లో కారం, ఒంట్లో అహంకారం లేకుండా బతకలేననే జితేందర్ (జగపతిబాబు) ముఖ్యమంత్రిపై పదవిపై ఆశలు పెంచుకుంటాడు.  పెళ్లి చూపుల కెళ్లి ఓ వివాదంలో చిక్కుకుంటాడు. ఆ ఊరి పెద్ద (సుమన్) జితేందర్ ను నష్టపరిహారంచెల్లించి , క్షమాపణ చెప్పాలని తీర్పు ఇస్తాడు. జితేందర్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా అతని  భార్య (సుహాసిని)ను కుమారుడు కృష్ణ (బాలకృష్ణ)ను కిడ్నాప్ చేస్తాడు. ఆ వ్యవహారంలో తల్లి చనిపోవడంతో- కృష్ణ జితేందర్ తండ్రి, అతని అనుచరులను చంపుతాడు. చిన్నతనంలో ఫ్యాక్షన్ రాజకీయాల్లో తలదూర్చడం ఇష్టం లేని కారణంగా కృష్ణను పై చదువుల కోసం లండన్ పంపుతారు . చదువు పూర్తయిన తర్వాత దుబాయ్ లో బిజినెస్ లో స్థిరపడతాడు. పెళ్లి చేసుకుందామని వచ్చిన కృష్ణకు జితేందర్, అతని అనుచరుడి రూపంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. జితేందర్ ను, అతని అనుచరులను  ఎదుర్కొన్న కృష్ణను హతమార్చేందుకు కృష్ణపై కాల్పులు జరుపుతారు.  కృష్ణ పరిస్థితి విషమంగా మారుతుంది. ఆ సంఘటన తర్వాతే సినిమాలో పెద్ద మలుపు వస్తుంది . మిగతా విశేషాల కోసం  సినిమా చూడాల్సిందే. .. 

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన  ‘సింహా’ సంచలనం సృష్టించింది. బాలయ్యని ఆరేళ్ల పాటు వేధించిన పరాజయాల్ని ఆ చిత్రం మరిపించింది. దాంతో మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా అనేసరికి అభిమానుల్లో భారీ అంచనాలు సహజం . పక్కా కమర్షియల్ హంగులతో, సెంటిమెంట్ తోపాటు, బాలకృష్ణ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన చిత్రం' లెజెండ్' .ఈ సారికూడా వరుస పరాజయాల బాధితుడు బాలయ్యను ఈ చిత్రం గట్టెక్కించింది . అలాగే ఎన్నికల్లో ప్రచారానికి తగిన స్తైర్యాన్నీ కల్పించింది . 'దమ్ము' చిత్రంతో ఎదురెబ్బ తిన్న బోయపాటి శ్రీను ఈ చిత్రంలో చక్కటి స్క్రీన్ ప్లే తో  ముందుకు పోయాడు. తొలిభాగంలో కథ మామూలుగా నడిపించినా.. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి- ఆతర్వాత ద్వితీయార్ధంలో సన్నివేశాలను వేగం గా నడిపించాడు . మంచి టేకింగ్ కు రత్నం మాటలు తోడవ్వడంతో ప్రేక్షకుడికి ఓ మంచి అనుభూతిని కలిగించారు. అయితే చిత్రంలో మితి మీరిన హింస, ఊహలకు అందని  ఫైట్స్  మైనస్ పాయింట్స్  గా  చెప్పాలి .  కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్ లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. 'బాలయ్యని కొత్తగా చూపడం కన్నా,అభిమానులు అలవాటు పడ్డ విధానం లోనే లాగించేస్తే విజయం తధ్యం'-అని ఈ చిత్రం మరోసారి నిరూపించింది .  

బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌కి, పవర్‌ఫుల్‌ హవభావాలకి , డైలాగ్‌ డెలివరీకి తగ్గవిధం గా  అతని పాత్రని దర్శకుడు రూపొందించాడు . ద్వితీయార్థంలో ప్రవేశించే పాత్రలో బాలకృష్ణ చెలరేగిపోయాడు. ఫాన్స్‌ని  అలరించే సన్నివేశాలు, మాస్‌ రెచ్చి పోయే సంభాషణలు బాగానే కుదిరాయి . అయితే ,బాలయ్య వయసు పైబడ్డ ఛాయల్ని యంగ్‌ క్యారెక్టర్‌తో కవర్‌ చేయలేకపోయాడు. లెజెండ్‌ పాత్రకి తగిన వేషధారణ,జగపతిబాబు గెటప్‌ పర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. హీరోగా కూడా ఇంత మంచి గెటప్‌ జగపతిబాబు ఎప్పుడూ వేయలేదు. అలాగే, జగపతి నటన కూడా బాగుంది. కాకపోతే పాత్రీకరణ లో లోపాల వల్ల ఒక్కోసారి జగపతిబాబు పాత్ర తేలిపోయింది.సెకండాఫ్ లో బాలకృష్ణ – జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. హీరోయిన్లు ఇద్దరూ పెద్దగా చేయడానికేమీ లేదు. సోనాల్ చౌహాన్ అందం గా కనిపిస్తే ,రాధికా ఆప్టే  విసిగిస్తుంది.  బ్రహ్మానందం పాత్ర ఇబ్బంది పెట్టే  సినిమాల్లో ఇదొకటి. సుమన్, సుహాసిని, సితార,జయప్రకాష్‌రెడ్డి, రావు రమేష్‌ తదితరులు ఇతర పాత్రల్లో  నటించారు.హంసా నందిని ఐటెం సాంగ్ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు.

దేవి శ్రీ ప్రసాద్ బాలకృష్ణ క్రేజ్ ని   దృష్టిలో ఉంచుకుని రూపొందించిన 'సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిసాడంటే వీడు' అనే టైటిల్ సాంగ్, మెలోడి 'పట్టు చీర బాగుందే.. కట్టు బొట్టు బాగుందే'   అభిమానులను ఆకట్టుకున్నాయి . ఈ పాటలను  ఏమాత్రం తగ్గకుండా తెర రూపం కల్పించారు.  కీలకమైన సన్నివేశాలకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో దేవి శ్రీ ప్రసాద్ జీవం పోశారు. సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ సక్సెస్ అయ్యాడు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఫస్ట్ హాఫ్ మీద ఇంకాస్త శ్రద్ధ తీసుకొని కొన్ని అనవసర సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది                                                                                                                                    - దినేష్ 

Saturday, March 15, 2014

‘రాజా రాణి’ చిత్ర సమీక్ష

                  ‘రాజా రాణి’ చిత్ర సమీక్ష    3.25 / 5

ఏ.ఆర్‌. మురుగదాస్‌ ప్రొడక్షన్స్‌ పతాకం ఫై అట్లీ దర్శకత్వం లో  మురుగదాస్, ఫాక్స్ స్టార్ స్టూడియో  ఈ చిత్రాన్ని నిర్మించారు . 



ఆర్య(జాన్) , నయనతార(రెజీనా) పెళ్ళిచేసుకున్నా ఒకరంటే ఒకరికి గిట్టదు . ఎప్పుడూ గొడవ పడుతుంటారు . ఆ పరిస్థితుల్లో  జాన్  తాగుడికి అలవాటు పడతాడు . రెజీనా అతనికి దూరం గా పోవాలని  ట్రాన్స్ ఫర్ మీద  విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటుంది .  ఆ తర్వాత కాలంలో వారికి తెలుస్తుంది .... తాము  ఇద్దరూ లవ్‌లో ఫెయిల్‌ అయిన వారమేనని  . తాము ఇష్ట పడిన వారిని కోల్పోయి , కేవలం తల్లిదండ్రుల ఆనందం కోసం -ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరూ కలిసి బతకడానికి ఇబ్బంది పడుతుంటారు . ఒకరి గతం ఒకరికి తెలిసిన తర్వాత ఇద్దరిలోను మార్పు వస్తుంది. ఇద్దరిలోను మళ్లీ ప్రేమ భావనలు చిగురిస్తాయి. కానీ ఎవరూ బయటపడరు . ఒకరి మనసును ఒకరు  తెలుసుకుని- వారు  కొత్త జీవితం ఎలా మొదలు పెట్టారనేది  సినిమాలో చూడాలి .... 

ప్రముఖ దర్శకుడు శంకర్‌ వద్ద సహాయకుడిగా పని చేసిన అట్లీ మరో ప్రముఖ దర్శకుడు మురుగదాస్ నిర్మించగా   డైరెక్ట్‌ చేసిన తమిళ చిత్రం ‘రాజా రాణి’ . తొలిసారి దర్శకత్వం వహిస్తున్నప్పటికి, డైరెక్టర్ అట్లీ మంచి ప్రతిభ చూపించాడు.అక్కడ మంచి విజయం సాధించింది. నయనతార, ఆర్య జంటగా సాధించిన రెండో విజయమిది. ' లవ్‌ ఫెయిల్యూర్‌ తర్వాత కూడా లైఫ్‌ ఉంటుంది, మళ్లీ లవ్‌ ఉంటుంది' - అనేది ఈ సినిమా లో ప్రధానాంశం . గతం లో మనం చూసిన మణిరత్నం  'మౌనరాగం' వంటిచి త్రాలను  గుర్తుచేసే -  పాత పాయింటే  అయినా కొత్తగా...సమర్దవంతం గా చెప్పిన  అట్లీ అభినందీయుడు . కధలోని  ఫీల్‌ని  ప్రేక్షకుడు  మిస్ కాని విధంగా సినిమాని చక్కగా నడిపించాడు . ముఖ్యం గా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రెండు ప్రేమ కథలు ప్రేక్షకులకు మంచిఅనుభూతిని ఇస్తాయి.
ప్రేమ ఫెయిలయ్యిందనే పేరుతో అఘాయిత్యాలకు పాల్పడే యువతను  కొత్తజీవితం వైపు మళ్ళించే  
విధంగా ఇటువంటిచిత్రాలుతోడ్పడతాయి.  
నయనతార-ఆర్య లమధ్య గొడవలని  వినోదాత్మకం గా చూపించారు .  ఉద్వేగపూరితమైన సన్నివేశాలు, కుటుంబ సమేతంగా చూడాల్సిన  ప్రేమ కథ... వీటి  కోసం ఈ సినిమాని చూడొచ్చు. అయితే ,మరీ సాగ దీసినట్లు కొన్ని సన్నివేశాలు మన సహనాన్ని పరీక్షిస్తాయి . అలాగే ,క్లయిమాక్స్‌ రొటీన్‌గా వుంది . అయినా ఓ మంచి సినిమా కోసం కొన్నింటిని భరించాలి  . 

ఇందులో నయనతారది ప్రధాన   పాత్ర .  తనని విడిచిపోయిన ప్రియుడు, ఇష్టం లేని భర్త మధ్య మానసికంగా నలిగిపోయే యువతి పాత్రలో నయనతార అద్భుతంగా నటించింది . ఒక వైపు అందంగా అలరిస్తూనే  రెజీనాగా తన పాత్రలో  జీవించింది. కళ్ళ ముందే దూరమైన ప్రియురాలు , ఇష్టం లేని భార్యల  మధ్య సంఘర్షణను అనుభవించే  యువకుడిగా ఆర్య కూడా చాలా బాగా చేసాడు . అమాయకత్వం చూపుతూ, రంగులు మార్చే సూర్యగా జై, అతని ప్రియురాలు కీర్తనగా నజ్రియా ఇద్దరూ బాగా చేసారు. నయనతార తండ్రి పాత్రలో సత్యరాజ్‌ హుందాగా  నటించారు . సంతానం చేయడానికి ఎక్కువ అవకాశం లేకున్నా,తన మార్క్ కామిడీతో  ప్రత్యేకతను చాటుకున్నాడు.  జార్జ్‌ సి. విలియమ్స్‌ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది . రూబెన్‌ ఎడిటింగ్ లో మరింత షార్ప్ గా పనిచేస్తే సినిమా ఇంకా బాగుండేది . అనువాద భాష కారణంగా - జి.వి. ప్రకాష్‌కుమార్‌ పాటలు అంతంత మాత్రం గానే అనిపించినా... భాషతో పని లేదు కనుక, అతని నేపధ్య సంగీతం మాత్రం బ్రహ్మాండంగా  వినిపిస్తుంది.  . పాటల్లో అనంతశ్రీరామ్‌ చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు.  శ్రీరామకృష్ణ సంభాషణలు మాత్రం సినిమాకు నిండుదనాన్నిచ్చాయి . 
                                                                               -రాజేష్ 

Friday, March 7, 2014

'బంగారు కోడి పెట్ట' చిత్ర సమీక్ష

                             'బంగారు కోడి పెట్ట' చిత్ర సమీక్ష  1.5 / 5 

గురు ఫిలింస్‌ పతాకం ఫై రాజ్‌ పిప్పళ్ల  రచన , దర్శకత్వం లో సునీత తాటి ఈ చిత్రాన్ని నిర్మించారు . 


ఎనర్జీ డ్రింక్ కంపెనీలో వంశీ (నవదీప్) భాను (స్వాతి) పనిచేస్తుంటారు.  ప్రమోషన్ వస్తుందని ఆశతో ఉన్న భాను మేనేజర్ ప్రవర్తన కారణంగా ఉద్యోగం కోల్పోతుంది. సొంత ఫ్లాట్ కి అడ్వాన్స్ ఇవ్వడానికి  భానుకు డబ్బు అవసరమవుతుంది. డబ్బు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఎనర్జీ డ్రింక్ కంపెనీ వినియోగదారులకు అందించేందుకు పంపే -బంగారు బిస్కట్, కాయిన్స్ ను కాజేయాలని ప్లాన్ వేస్తుంది. అప్పటికే పోలీస్ రికార్డ్స్ లో వున్న  వంశీని భాగస్వామిగా పెట్టుకుంటుంది. అయితే ఆ తర్వాత ఈ దొంగతనం కధలో కొన్ని ఊహించని ట్విస్ట్ లు వస్తాయి .  దొంగతనం చేసే క్రమంలో  ఎలాంటి పరిస్థితులు, ఇబ్బందులు ఎదురయ్యాయి? చివరకు గోల్డ్ బిస్కట్, కాయిన్స్ ను భాను, వంశీల స్వంతమయ్యాయా ? అనే ప్రశ్నలకు జవాబు సినిమాలోనే దొరుకుతుంది ... 

దోపిడీ కి  ప్లాన్‌ చేయడం, దానిని అమలు చేయడంలో అడ్డంకులు ఎదురు కావడం, వాటిని దాటుకుని అనుకున్నది సాధించడం... అనే కధ మనకు కొత్తదేమీ కాదు . అయితే మూడు కథల్ని విడి విడిగా నడుపుతూ- చివరికి అవన్నీ ఒకే  చోట ఎలా కలుస్తాయి -అనే విధానం లో దర్శకుడు కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు . అయితే ఘోరం గా ఫెయిలయ్యాడు . 
ఈ సినిమా కన్నా ఈ మధ్య  ఔత్సాహికులైన కుర్రాళ్ళు తీస్తున్న షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి . కథలో కొత్తదనం లేకుండా,కధకు అవసరమైన బిగువైన  స్క్రీన్ ప్లే లేకుండా   దర్శకుడు రాజ్ పిప్పళ్ల  అర్ధం లేని సినిమా తీసాడు . సినిమా మొదలైన  కాసేపటికే ఇందులో విషయం లేదని  ప్రేక్షకుడికి అర్ధమయి పోతుంది. గంటా నలభై నిముషాల హింస తో ఈ చిత్రం సాగుతుంది . అసలు, దర్శకుడికి తెలుగు  సినిమాలు చూసే అలవాటన్నా ఉందా? అనే సందేహం కలుగుతుంది . ఇందులో ఒక్క సన్నివేశం  కూడా పండలేదు . దర్శకుడిగా పేరు వేసుకోవాలనుకునే వారు , తమలో విషయం లేనప్పుడు-మంచి  రైటర్ ని పెట్టుకుని చక్కగా  స్క్రీన్ ప్లే చేయించుకోవచ్చు ... దాన్ని మంచి ఎడిటర్ తో ఆసక్తికరం గా రూపుదిద్దవచ్చు ... మంచి సంగీత దర్శకుడితో  రీ రికార్డింగ్ చేయించి సన్నివేశాలకు జీవం పొయ్యొచ్చు . అయితే ఈ చిత్రం లో సాహిర్‌ రాజా ఫోటోగ్రఫీ అంతంత మాత్రమే . ధర్మేంద్ర కాకర్ల, చంద్రశేఖర్‌ ల ఎడిటింగ్ మరీ పేలవం గా వుంది . మహేష్‌ శంకర్‌ సంగీతం లో పాటల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు . ఇక రీ రికార్డింగ్ ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప, బాగు లేదు సరికదా... సన్నివేశాన్ని మరింత బలహీన పరిచేది గా వుంది . ప్రసాద్‌ వర్మ సంభాషణలు మరీ చిన్నపిల్లలు రాసినట్లుంటాయి ... ఏమాత్రం మెచ్యురిటీ  లేదు . 

వంశీ గా నవదీప్ పాత్రలో కొత్తదనం లేదు .  చెయ్యడానికి కూడా ఏమీ  లేకపోవడం తో, రొటీన్ గానే నడిపించాడు  .  భాను పాత్రలో స్వాతి అల్లరిగా , కొంటెగా కనిపించినా.. ప్రేక్షకులు ఆశించే స్థాయిలో ఆమె పాత్ర  లేదు . తనకి హ్యాండ్ ఇచ్చి మేనేజర్ తో కుమ్మక్కు అయిన  హీరో పట్ల హీరోయిన్ కి సానుభూతి ... ప్రేమ ఎలా కలుగుతుందో మనకి అర్ధం కాదు .   కథలో భాగంగా వచ్చే దొరబాబు, ఎర్రబాబుగా  స్టంట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ లతో చేయించడం బాగానే వుంది కానీ , వారిని ఏ మాత్రం సద్వినియోగం చేసుకోలేక పోయారు . 'బంగారు కోడిపెట్ట' అని పేరు పెట్టాం  కదా! -అని ఇందులో అతకని కోడి సెంటిమెంట్ ని కూడా  దర్శకుడు ప్రయోగించాడు  .   ఎనర్జీ డ్రింక్ కంపెనీ మేనేజర్ గా విలన్ షేడ్ ఉన్న పాత్రలో  హర్షవర్ధన్ కనిపించాడు .  క్లై మాక్స్ లో మినహా అతని నటన కూడా ఆకట్టుకోలేదు . రామ్, లక్ష్మణ్ ఎపిసోడ్ లో పాప సీన్లు, సినీ నటుడు కావాలని ప్రయత్నించే పిజా బాయ్ గా సంతోష్ సన్నివేశాలు  కొంత పర్వాలేదనిపిస్తాయి .తక్కువ లొకేషన్స్ లో, అతి తక్కువ ఖర్చుతో ఈ చిత్రాన్ని పూర్తి చెయ్యడం ఒక్కటే తెలివైన పని                                                                                                                                                                            -రాజేష్  

Wednesday, March 5, 2014

విడిపోయినా మేం మిత్రులమే!



పెళ్ళికి ముందు లవ్‌లు... డేటింగ్‌లు సెలబ్రిటీలకు సాధారణమే. ఓ వైపు ఒకరితో కాపురం చేస్తూనే... మరొకరితో సహజీవనం చేస్తారు. దాంపత్య జీవితం సజావుగా సాగితే సరి. లేకుంటే పెళ్ళిని కాస్తా పెటాకులు చేసుకొని మరో పెళ్ళికి సిద్ధమైపోతారు. అలా విడిపోయిన తరువాత ఎడమొహం... పెడమొహంగా ఉంటారా -అంటే అదీలేదు. విడిపోయిన కొద్ది రోజులకే పబ్లిక్ లో -చేతిలో చెయ్యేసుకుని కౌగిలింతలతో దర్శనమిస్తారు. ఎందుకిలా అంటే... మేం విడిపోయామే కానీ... స్నేహితులుగా మాత్రం కలిసుంటాం. ఇదంతా పిల్లల భవిష్యత్తు కోసమే -అంటూ సెలవిస్తారు ....  

నా మనసు చెప్పిందే చేస్తా ! -యామీ గౌతమ్


సినిమాలు ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానని, అయితే వాటికి భయపడేదాన్ని మాత్రం కాదని- చెబుతోంది యామీ గౌతమ్. మొదటి సినిమా వికీ డోనర్ విజయం సాధించడంతో ఈ బ్యూటీకి అవకాశాలు బాగానే వస్తున్నా తొందరపడడం లేదు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ‘నా మనసు చెప్పింది చేయడమే నాకిష్టం. ఒక సినిమా భారీ హిట్ కాగానే తరువాతి వాటిని ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే నాకు సినిమా కుటుంబం లేదు. ముంబై యువతినీ కాదు కాబట్టి రెండో అవకాశం రావడం కాస్త కష్టమే. అయితే జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అంతమాత్రాన నేను భయపడ్డట్టు కాదు’ అని యామీ వివరించింది. తాజా సినిమా 'టోటల్ సియప్పా' తనకు మనసుకు నచ్చిన కథ అని తెలిపింది. ‘నాకు అవకాశాలు చాలా వచ్చాయి. వద్దనుకున్న సినిమాల గురించి మాట్లాడడం ఇష్టముండదు’ అని చెప్పింది. అయితే నీరజ్ పాండే నిర్మిస్తున్న 'టోటల్ సియప్పా' ప్రాజెక్టుపై సంతకం చేయడానికి కూడా ఈమె చాలా సమయమే తీసుకుంది. ‘భిన్న నేపథ్యాలున్న కథ ఇది. హాస్యం, ఉద్వేగం, కోపం వంటి అంశాలూ ఉంటాయి. ఇందులో అవకాశం ఇచ్చిన నీరజ్ పాండేకు ఎంతో కృతజ్ఞురాలిని. సినిమా కథ గంభీరమైనదే అయినా ప్రేక్షకులు దీనిని పూర్తిగా ఆస్వాదించవచ్చు’ అని యామీ వివరించింది. 'టోటల్ సియప్పా'కు నీరజ్ కథ కూడా అందించగా, ఈశ్వర్ నివాస్ దర్శకత్వం వహించాడు. దీనిని వచ్చే నెల ఏడున విడుదల చేస్తున్నారు. పాకిస్థానీ నటుడు, గాయకుడు అలీ జఫర్, యామీ, అనుపమ్ ఖేర్, ఆయన సతీమణి కిరణ్ ఖేర్ తదితరులు ఇందులో కనిపిస్తారు.
రెహమాన్ కొత్త ఆల్బం లో యామి
'రానక్' అనే టైటిల్ తో స్వరబ్రహ్మ ఏ.ఆర్ రెహమాన్ తన కొత్త ఆల్బమ్ ను మనకు అందించడానికి సిద్ధమయ్యాడు. గతకొన్నాళ్లుగా ఈ సంగీతదర్శకుడు ఈ ఆల్బమ్ కోసం కష్టపడుతున్నాడు. అదే క్రమంలో దీనికి వీడియో కూడా తీసేశాడుఈ వీడియో తెరకెక్కించడానికి రాజా రవివర్మ గీసిన పెయింటింగ్స్ నుండి స్పూర్తి పొందాడట. అంతేకాక ఈ వీడియోలో యామి గౌతం కు కూడా స్థానం కల్పించాడు. ఇంకా ఈ భామ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. రెహమాన్ గతకొన్ని సంవత్సరాలుగా సొంత ఆల్బమ్ లు చేయడం లేదు. దీనికి కారణం ఆతను అంగీకరించిన సినిమాలే కారణమట. ‘ఆభి ఝా’ అంటూ సాగే ఒక పాట త్వరలో విడుదలచెయ్యనున్నారు. ఈ పాటకు యూనియన్ మినిస్టర్ కపిల్ సిబాల్ లిరిక్స్ ను అందించాడుయామి గౌతం త్వరలో ప్రభుదేవా కొత్త సినిమాలో నటించనుంది. నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' లో కూడా హీరోయిన్ గా మెరుస్తుంది

నాలోని నటిని ఎవరూ చూడరు! -షకీలా


చాలా మందికి షకీలా ఒక శృంగార దేవత. ఆమెది ఒక్క సీను ఉన్నా చాలు సినిమా హిట్. ఒకప్పుడు హీరోయిన్ల కన్నా ఆమెకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. అలాంటి షకీలా గతమేమిటి? చిన్నప్పుడు సూళ్లూరుపేట దగ్గర కోటలో పెరిగిన ఆమె మలయాళం సినీ పరిశ్రమకు ఎలా వెళ్లింది? కోట్ల మంది పురుషుల కలలరాణి అయిన షకీలా జీవితంలో ఎప్పుడైనా సుఖపడిందా?- ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానంగా- షకీలా తన ఆత్మకథ రాసుకుంది. 'నాలో అపరాధ భావన లేదు.. బాధే ఉంది' అనే ట్యాగ్‌లైన్‌తో మలయాళంలో విడుదలయిన ఈ ఆత్మకథలోని కొన్ని భాగాలకు అనువాదమిది.... 

డర్టీగర్ల్‌ నుండి పద్మశ్రీ వరకూ ...విద్యాబాలన్‌


'డర్టీ పిక్చర్‌' 'తో దేశాన్ని ఓ ఊపు ఊపిన నటి విద్యాబాలన్‌. తెలుగు నటీమణి సిల్క్‌స్మిత జీవిత కథను ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ చిత్రం అన్ని భాషల్లో విజయవంతం సాధించడమే కాదు...విద్యా బాలన్‌ -అంటే ఈమె అని అందరికీ తెలిసేలా చేసింది. పదహారేళ్ల కుర్రాడి నుంచి అరవై ఏళ్ల వృద్ధుడి వరకు ఈ చిత్రం చూడాలని తహతహలాడారంటే అది విద్యాబాలన్‌ నటనా కౌశలమే కారణం. డర్టీపిక్చర్‌, కహాని చిత్రాలకు అవార్డులు అందుకున్న ఈమెను తాజాగా భారత ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుకు ఎంపిక చేసింది.... 

అదృశ్యమై..'జబర్‌దస్త్' నటుడయ్యాడు!


ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు..తన కొడుకు తప్పి పోయాడని తండ్రి ఆవేదన...అదే కొడుకు ప్రయోజకుడిగా మారాడని తెలిస్తే.. తిరిగి ఇంటికి వస్తే.. కన్నవారి కళ్లల్లో ఆనందం చెప్పలేనిది. అదే జరిగింది శేషు శంకర్ ( షకలక శంకర్) విషయంలో. పదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఈయన నేడు మంచి కమేడియన్‌గా చిత్ర పరిశ్రమలో గుర్తిం పు తెచ్చుకున్నాడు. ఒక టీవీ చానల్‌లో ప్రసారమవుతున్న 'జబర్‌దస్త్' కార్య క్రమంలో 50 ఎపిసోడుల్లో నటించి తన ప్రతిభను ప్రదర్శిస్తున్న ఈయన సంక్రాంతి సందర్భంగా స్వగ్రా మమైన ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస గ్రామ పరిధిలోని శేసు పేట కు వచ్చిన ఆయనకు స్థానికులు ఘనస్వాగతం పలికారు.
పదో తరగతి పరీక్షలో తప్పడంతో శంకర్ గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో తండ్రి రాములు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌లో తన కుమారుడు అదృశ్యమయ్యాడని 2000 సంవత్సరం లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇంటి నుంచి వెళ్లిపోయిన ఈయన హైద రాబాద్ చేరుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారి సహకారంతో తొలుత పెయింటర్‌గా జీవితం ప్రారంభించారు. సిక్కోలు జిల్లా మండ లికం, యాస, తూర్పు రామాయణం జానపదం వంటి అంశాల్లో పట్టు ఉండడంతో సినీ రంగంలో చేరాలని భావించాడు. పెయింటర్‌గా పనిచేస్తూనే మరో పక్క సినిమాల్లో ప్రయత్నాలు ప్రారం భించాడు. కొత్త నటీనటులు కావాలని పత్రికల్లో వచ్చే ప్రకటనలు చూసి అక్కడ వాలిపోయేవాడు. 2007లో చంద్ అనే డెరైక్టర్ నూతన నటీనటులతో ‘నోట్ బుక్’ సినిమా తీశారు. ఈ సినిమాలో నటించేందుకు శంకర్‌కు అవకాశం వచ్చింది. ఆ తరువాత మళ్లీ అవకాశాలు రాలేదు. దీంతో అధైర్య పడకుండా మళ్లీ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. కొన్ని చిన్న సినిమాల్లో నటించినా అవి రిలేజ్‌కు సైతం నోచు కోలేదు. ఇంతలో ఓ చానెల్‌లో వస్తున్న 'జబర్‌దస్త్' కార్యక్రమానికి ఎంపికవ్వడంతో ఇతని జాతకం మారి పోయింది. ప్రముఖ నటుడు నాగ బాబు, నటి రోజా వంటి వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ కార్య క్రమం శంకర్‌లోని కమేడియన్‌ను పూర్తిస్థాయిలో వెతికితీసింది. దీంతో పాటు మరో 50 భాగాలు చేసేందుకు శంకర్ ఆ చానెల్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ కార్యక్రమం ప్రాచుర్యం పొందటంతో సినిమా అవ కాశాలు కూడా వస్తున్నాయి. మోహన్ బాబు హీరోగా రామ్‌గోపాల్ వర్మ డెరైక్టు చేస్తున్న సినిమాలో అవకాశం లభించింది. మహేష్‌బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంతో రూపు దిద్దు కుంటున్న ఆగడు, ఈరోజుల్లో దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపు దిద్దు కొంటున్న చిత్రంలో పాటు మరో 10 చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినట్టు శంకర్ చెప్పా రు. పవన్ కల్యాణ్‌తో కలిసి నటించాలని ఉందని మనసులోని మాట చెప్పుకొచ్చారు.

అందరిలాగే నేనూ తప్పులు చేశాను! -వీణా మాలిక్


హాట్‌హాట్ పోజులు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే పాక్ నటి వీణా మాలిక్ అభిమానులకు ఇది చేదు కబురు. ఇక నుంచి మత, సామాజికపరమైన కార్యక్రమాలు మినహా సినిమాల్లో నటించబోనని ఈమె ప్రకటించింది. ఒక ఇస్లామిక్ గురువు బోధనలు తనలో పరివర్తన తెచ్చాయని చెప్పింది. ‘ఇక నుంచి భారత్, పాక్ సినిమాలేవీ చేయను. గతంలో ఒప్పుకున్న ప్రాజెక్టుల నుంచి కూడా వైదొలుగుతాను’ అని ఈ 29 ఏళ్ల బ్యూటీ తెలిపింది. అసద్ బషీర్ ఖాన్ ఖట్టక్ అనే దుబాయి వ్యాపారిని వీణ గత సంవత్సరం పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ‘ఇస్లాం పండితుడు మౌలానా సాహిబ్ నా జీవితాన్ని సమూలంగా మార్చేశారు. ఇక నుంచి బుర్ఖా వేసుకుంటానని ఆయనకు మాటిచ్చాను. నా నిర్ణయాన్ని అభిమానులు, స్నేహితులు ప్రశంసించారు. అందరిలాగే నేనూ తప్పులు చేశాను. అందుకు భగవంతుణ్ని క్షమాపణలు కోరుతున్నాను’ అని వివరించారు. ఇక నుంచి సంప్రదాయ జీవితానికే కట్టుబడి ఉండే శక్తిని దేవుడు తనకు ఇవ్వాలని అభిమానులు ప్రార్థించాలని కూడా కోరింది. పాకిస్థాన్ ప్రజల సంక్షేమం కోసం చేతనైనంత కృషి చేస్తానని తెలియజేసింది. ఇవన్నీ ఇలా ఉంటే పాకిస్థాన్ టీవీ షోలో అసద్‌తో కలిసి ఒక కార్యక్రమం నిర్వహించడానికి వీణ సిద్ధమవుతోందట. ఇందుకోసం ఇది వరకే చానెళ్లను సంప్రదించిందని సమాచారం. అన్నట్టు అసద్ కూడా పాకిస్థాన్ జాతీయుడే. ఒక భారతీయ సినిమా పత్రికకు టాప్‌లెస్‌గా పోజివ్వడం, 'బిగ్‌బాస్‌'లో అస్మిత్ పటేల్‌తో సన్నిహితంగా మెలగడం వంటివి వీణామాలిక్‌కు విపరీత ప్రచారం తెచ్చిపెట్టాయి.

బైక్‌ మీదే హనీమూన్‌ ప్రయాణం - సమీరారెడ్డి


అంత హడావుడిగా పెళ్లెందుకు చేసుకోవలసి వచ్చిం దంటే -అన్న ప్రశ్నకు నటి సమీరారెడ్డి బదులిచ్చారు. తమిళంలో వారణం ఆయిరం, నడునిశి నాయగన వెడి, వేట్టై చిత్రాల్లో నటించిన ఈ బెంగళూరు బ్యూటీ ఇంతకుముందు టాలీవుడ్‌లో నరసింహ, అశోక్ తదితర చిత్రాల్లో నటించారు. ఈ ముద్దుగుమ్మ ఇటీవల మోటార్‌బైక్ వ్యాపారవేత్త అక్షయ్ వర్దేవ్‌ను వివాహమాడారు. వీరి వివాహం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా జరిగింది. సినీ ప్రముఖులెవరూ హాజరు కాలేదు.
జనవరి 21న ఆకస్మికంగా అక్షయ్ వర్దే అనే అతణి పెళ్లాడి అందర్నీ ఆశ్చర్య పరచింది అందాల తార సమీరారెడ్డి. ఆఖరుకి ఆమె ఆ రోజు పెళ్లాడుతుందని ఆమె సన్నిహిత స్నేహితుల్లో చాలా మందికి తెలీదు! "నిజానికి అక్షయ్, నేను ఏప్రిల్‌లో పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కానీ పరిస్థితుల కారణంగా ఇప్పుడే చేసుకోవాల్సి వచ్చింది. మా పెద్దక్క మేఘన విదేశాల నుండి తన కూతురితో వచ్చి ఉంది. అలాగే అక్షయ్ సోదరి కూడా. మళ్లీ ఏప్రిల్‌లో ఇక్కడకు రావాలంటే వాళ్లకు బాగా ఇబ్బంది. పైగా జనవరి 21 మంచిరోజని సిద్ధాంతులు చెప్పారు'' అని తెలిపింది సమీరా. తమది కొద్దిమంది స్నేహితులు, సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన కచ్చితమైన వివాహమని చెప్పింది రాజమండ్రిలో పుట్టి ముంబైలో పెరిగిన తెలుగమ్మాయి సమీర. "పది రోజుల్లో పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసింది మా రెండో అక్క సుష్మ. పదకొండేళ్లు సినిమాల్లో చేయడం వల్ల రకరకాల కాస్ట్యూమ్స్ ధరించాను. నా పెళ్లికి సింపుల్‌గా డ్రస్ చేసుకోవాలని అనుకున్నా. డిజైనర్ నీతా లుల్లాకు దక్షిణాది చీరను డిజైన్ చేయమని చెప్పాను. 'రెడ్డి' సంప్రదాయానికి తగ్గట్లు దాన్ని ఆమె డిజైన్ చేసింది. అక్షయ్ మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. మా ఇద్దరినీ కలిపింది మోటార్ బైక్‌లపై ఉన్న మోజే. బైక్స్‌ని నడపడమంటే నాకు చాలా ఇష్టం. అలా ఓసారి నన్ను చూశాడు అక్షయ్. అతనికి సొంతంగా మోటార్ బైక్స్ వ్యాపారం ఉంది. చాలా కాలం నుంచీ పరస్పరం ఏమిటో తెలుసుకుంటూ వచ్చాం. సినిమా ఇండస్ట్రీ బయటి వ్యక్తినే పెళ్లాడాలని నేను అనుకున్నా. అక్షయ్ అందుకు అన్ని విధాలా తగినవాడనిపించింది. ఫిబ్రవరిలో ఓ ఆటో-ఎక్స్‌పోకి అక్షయ్ హాజరవ్వాల్సి ఉంది. దాని తర్వాత హనీమూన్‌కు వెళ్తాం. దానికి బైక్‌ల మీదే ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాం'' అని వివరించింది సమీరా.

అన్నయ్యలా డైరక్షన్ చెయ్యాలి !


డైరక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఏడేళ్లపాటు పూరీ అన్నయ్య వద్ద 'శివమణి' సినిమా వరకు అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశాను. హీరోగా ఇప్పటి వరకు 9 సినిమాలు చేశాను. రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 'ఇడియట్', 'నేనింతే' సినిమాల్లో అతిథి పాత్రలు పోషించాను. నేను నటించిన '143', 'బంపర్ ఆఫర్' సినిమాలు నాకు మంచి పేరు తెచ్చాయి..అవి నాకిష్టమైన సినిమాలు. బంపర్ ఆఫర్ సినిమాకు పూరీ అన్నయ్య కథ మాటలు అందించారు. అన్నయ్య బిజీగా ఉండడం వల్ల అన్నయ్య డైరక్షన్‌లో నటించే అవకాశం కలగలేదు. అన్నయ్యకు నేను, గణేష్ అన్నయ్య అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ మా క్షేమాన్నే ఆయన ఆశిస్తారు. అందుకే తాను బిజీగా ఉన్నప్పటికీ నేను నటించిన 'రోమియో', 'దిల్లున్నోడు' (రెండూ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి) సినిమాలకు కథ, మాటలు ఇచ్చారు.
ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళ్‌లో ఒకటి సినిమాలు అంగీకరించాను. తమిళ్ సినిమా ఈ నెలాఖరు ప్రారంభమవుతుంది. కొత్త సినిమా కోసమే ఈ గెడ్డం పెంచుతున్నా. నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదు. కథ నచ్చితే ఏ పాత్రనైనా చేస్తాను. గణేష్ అన్నయ్య(వైఎస్సార్ సీపీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త) ఎన్నికల్లో పోటీ చేస్తే నేను, పూరీ అన్నయ్య కూడా ప్రచారం చేస్తాం. ఉదయ్‌కిరణ్‌తో నాకు పరిచయం ఉంది.. తను చాలా దృఢమైన మనస్తత్వం ఉన్నవాడు... కానీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఇప్పటికీ అర్ధం కావడం లేదు. ఎంత హీరో అయినా నేను మా గ్రామంలో సాయిని మాత్రమే. పాత మిత్రులు, వారితో చేసిన అల్లరి పనులు గుర్తుకు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకే ప్రతి ఏటా సంక్రాంతి పండుగను స్వంత ఊళ్లో,కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొంటాను.

పూర్తిగా రాజకీయాలకు అంకితం! -స్మృతి ఇరాని



మా తాతగారు స్వయంసేవక్‌గా పనిచేసేవారు. మా అమ్మ ఒక పార్టీకి స్వచ్ఛంద సేవకురాలిగా ఉండేవారు. ఆ స్ఫూర్తితోనే నేను కూడా దేశ సేవ చేయాలని సంకల్పించుకున్నాను. ''నువ్వు సమాజానికి సేవ చేయాలనుకుంటే ఏ స్వచ్ఛంద సంస్థలో అయినా చేరచ్చు కదా, ఎందుకు రాజకీయాలను ఎంచుకున్నావు?'' అని మా అమ్మ నన్ను అడిగారు. దానికి, రాజకీయాల్లోకి వెళ్ళాలన్న బలమైన సంకల్పంతో పాటు సామాజిక బాధ్యత నన్ను రాజకీయాల వైపు నడిపించింది -అని సమాధానం చెప్పాను....