RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, February 7, 2014

' పైసా' చిత్ర సమీక్ష

                                     ' పైసా' చిత్ర సమీక్ష     2.5 / 5

ఎల్లో ఫ్లవర్స్‌ పతాకం ఫై కృష్ణవంశీ కథ, కథనం, మాటలు, దర్శకత్వంతో   రమేష్‌ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మించారు .ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది .  


ప్రకాష్‌ (నాని)కు డబ్బంటే విపరీతమైన పిచ్చి. అతను  హైదరాబాద్ పాతబస్తీలో ఓబట్టల షాప్ మోడల్ . జీవితంలో కోటి రూపాయలు సంపాదించి సెటిలైపోవాలనుకుంటాడు. పాతబస్తీలో ఉండే నూర్ (కేథెరిన్ థెరిసా) అంటే ప్రకాష్ కు ఇష్టం. అలాగే ప్రకాష్‌ అంటే నూర్ కు చెప్పలేనంత ప్రేమ.ఒక రోజు  పరిచయమైన  అందమైన, ధనవంతుల  అమ్మాయి స్వీటీ(సిద్దిక శర్మ) -ప్రకాష్‌ లు మంచి స్నేహితులవుతారు. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న నూర్ కు ఇష్టం లేకపోయినా, తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ముసలి  దుబాయ్ షేక్ ని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. అది తెలిసిన ప్రకాష్‌ నూర్  పెళ్లి చెడగొట్టి , ఆమెను  తీసుకొని అక్కడ వున్న   బ్లాక్  ఇన్నోవా కారులో పారిపోతాడు. పైసా అంటే పడి చచ్చే ప్రకాష్‌ కు అనుకోకుండా-అదే కారు లో  యాభై కోట్ల రూపాయలు వున్న  విషయం తెలిసి షాక్ తింటాడు . డబ్బు తో పాటు అతన్ని సమస్యలూ చుట్టు  ముడతాయి . మూడు ముటాలబారి నుండి బయట పడటానికీ , డబ్బు స్వంతం చేసుకోవడానికీ ప్రకాష్  ఎన్ని కష్టాలు   పడ్డాడు? అనేది సినిమాలో చూడాలి ... 

తెలుగులో తనదైన సృజనాత్మక శైలి కలిగిన దర్శకుల్లో  కృష్ణవంశీ ఒకరు . గతంలో ఎన్నో మంచి చిత్రాలు అందించిన కృష్ణవంశీలో విషయం తగ్గుముఖం పడుతోందని ఈ మధ్య వచ్చిన అతని చిత్రాలే చెబుతున్నాయి . కృష్ణవంశీ దర్సకత్వంలో వచ్చిన 'మొగుడు' అందుకు పెద్ద ఉదాహరణ .  అతని గత  చిత్రాలు నిరాశ పరిచినా-  సినీ ప్రియులకి అతని సినిమాల పై ఆసక్తి మాత్రం వుంటుంది .  ‘పైసా’ కూడా కృష్ణవంశీ విలక్షణతకి అద్దం పట్టే చిత్రమే. ఇందులోనూ  కృష్ణవంశీ తన ప్రత్యేక ముద్ర చాటుకుంటూ , తనదైన శైలిలో చిత్రీకరించాడు. అయితే  పూర్తి స్థాయిలో సంతృప్తి పరచడంలో విఫలమయ్యాడు .కొన్ని సన్నివేశాలు తనదైన శైలి లో ప్రతిభావంతంగా చేసిన   కృష్ణవంశీ చాలా సన్నివేశాలు' సో సో' గా చెయ్యడమే ఈ చిత్రాన్ని బలహీనపరిచింది  .  కృష్ణవంశీ గత చిత్రం ‘మొగుడు’తో పోలిస్తే ఖచ్చితంగా ‘పైసా’ బెటర్‌ చిత్రం .డబ్బుల పతంగ్ ని హీరో సాధించడం , కారులో డబ్బు విషయం హీరో కి తెలిసిన సన్నివేశం బాగా చిత్రీకరించారు . అలాగే స్వీటీ తో కలిసి ఓల్డ్ సిటీ లోని  'మెహబూబ్ కి మెహందీ' (రెడ్ లైట్ ) కి వెళ్లి ఇబ్బందుల్లో పడటం ... అర్ధం లేని , చిరాకు పుట్టించే సందర్భం. మూడు గ్రూపుల చేజ్ లు  గోల గోలగా నడిచాయి  . క్లైమాక్స్ కూడా మరీ నీరసం గా  వుంది. చివరి ట్విస్ట్ ఒక్కటే ఆసక్తికరంగా ప్రేక్షకుడు ఫీలయ్యాడు .  

'ఈగ' తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న  నానికి ఈ చిత్రంలోని ప్రకాష్ పాత్ర బాగా కుదిరింది . నటుడిగా నిరూపించుకోవడానికి లభించిన ఈ  పాత్రను నాని చక్కగా సద్వినియోగ పరుచుకున్నాడు. మాస్ ఎలిమెంట్స్ ఉన్న పాత్రలో తనదైన స్టైల్ తో ఆకట్టుకున్నాడు. కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ ను చక్కగా పలికించాడు. 
నూర్ గా  కేథరిన్ థెరిసాకు మంచి పాత్రే లభించింది. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని..  గ్లామర్ తో పాటు, పెర్మార్మెన్స్ తో కూడా కేథరిన్ ఆకట్టుకుంది. ఎమ్మెల్యే కూతురుగా స్వీటీ పాత్రలో కనిపించిన సిద్దికా శర్మ గ్లామర్ కే పరిమితమైంది. నాని ఫ్రెండ్ గా డ్రైవర్ పాత్రలో  తబర్ గుర్తుండిపోయే పాత్రను పోషించాడు. ఇతర పాత్రల్లో చరణ్ రాజ్, భరత్ రెడ్డి, ఆర్ కే, రాజా రవీంద్ర, దువ్వాసి మోహన్ నటించారు . చిలక జ్యోతిష్కుడి పాత్రలో కొద్దిసేపే కనిపించిన వేణు  ఆకట్టుకున్నాడు. 

సంతోష్  రాయ్  ఫోటోగ్రఫీ లో కొన్ని కెమెరా యాంగిల్స్‌ ,అలాగే వేగం గా సాగిన  త్యాగు ఎడిటింగ్ కూడా ప్రేక్షకులను  ఇబ్బంది పెడుతుంది . పాటలతో పెద్దగా పని లేని ఈ చిత్రం లో - 'నీతో ఏదో' అనే పాట చిత్రీకరణ లో కృష్ణ వంశీ ముద్ర కనిపిస్తుంది .టెంపోను కొనసాగించడానికి రీరికార్డింగ్ బాగా ఉపయోగపడింది. ‘కడుపుకి మించిన ఆకలి, అర్హతకి మించిన ఆశ, అవసరానికి మించిన డబ్బు... అరగవు’-లాంటి కృష్ణ వంశీ సంభాషణలతో పాటు... ‘ప్రేమ, పెళ్లి, జీవితం’ గురించి నాని చెప్పే సన్నివేశంలోని తత్వం.. మెప్పిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు బాగా చేసారు .   సి.జి వర్క్ లో చాలా లోపాలున్నాయి.                                        -రాజేష్ 

0 comments:

Post a Comment