RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, January 31, 2014

'హార్ట్ ఎటాక్' చిత్ర సమీక్ష

                                    'హార్ట్ ఎటాక్' చిత్ర సమీక్ష  3/5
 

పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకం ఫై పూరి జగన్నాధ్ స్వీయ రచన , దర్శకత్వం లో నిర్మించిన చిత్రం ఇది . 


వరుణ్‌ (నితిన్‌) ఒక హిప్పీతరహా కుర్రాడు . ఆ దేశం ఈ దేశం  అంటూ తిరుగుతూ, రేపటి మీద ఆశ లేకుండా, ఏ రోజుని ఆ రోజు ఎంజాయ్‌ చేసే వ్యక్తి . స్పెయిన్ లో  హయాతిని (అదా శర్మ)చూసి  ఇష్టపడతాడు. ఆమెని ఓ ముద్దిమ్మంటూ వెంటపడతాడు. తనని ప్రేమించడం లేదని, ముద్దిస్తే చాలని వేధిస్తుంటాడు. ఈ క్రమం లో వరుణ్‌ని హయాతి లవ్‌ చేస్తుంది. అయితే ఏ సెంటిమెంట్స్ లేనివరుణ్‌ ధోరణి నచ్చక -తనని జీవితం లో ఎప్పుడూ కలవొద్దని అంటుంది .  ఆ తర్వాత గోవా వెళ్ళిపోతుంది . సెంటిమెంట్స్ లేవంటూనే - తాను హయాతి ని ప్రేమించిన విషయాన్ని తెలుసుకున్న వరుణ్‌  ఆమె కోసం వెతుకుతూ గోవా వస్తాడు . అప్పటికే తండ్రి కోసం హయాతి గోవా డాన్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్దపడుతుంది . ఆ పరిస్థితుల్లో వరుణ్‌ ఏం చేసాడనేది సినిమాలో చూడాలి ... 

యూత్ -మాస్  చిత్రాలు చెయ్యడం లో పూరి జగన్నాధ్ స్టైలే  వేరు . అతను గతం లో చేసిన పలు చిత్రాలు యువ ప్రేక్షకులను కిర్రెక్కించి, బాక్సాఫీసుల్ని బద్దలు గొట్టాయి . అతని లోని సత్తా ఇంకా తగ్గలేదని ఈ చిత్రం కూడా నిరూపిస్తుంది . కాలం తో పాటు మారుతూ జగన్ తెలుగు సినిమా ని ప్రపంచ స్థాయి తీసుకెళ్ళా లను కుంటున్నాడో ఏమో -ఇటీవల అతని సినిమాలన్నీ ఎక్కువ భాగం విదేశాల్లోనే తీస్తున్నాడు  . ఆదునిక సమాజం లో ఇప్పుడు  ప్రేమ- అను బంధాల పరిస్థితి ఎలా వుందో ఈ చిత్రం లో తన స్టైల్ లో చూపించాడు . సాంకేతికం గానూ , నిర్మాణ విలువల్లోనూ అద్భుత స్థాయిలో ఈ చిత్రం వుంది . ఆధునికత ఎంత పెచ్చు పెరిగినా- అనుబంధాల విలువ ఎలా తగ్గలేదని ఇందులో చూపించారో  ..అలానే  సినిమా లో ఎన్ని హంగులున్నా, కధ కున్న ప్రాధాన్యత కూడా అలానే తగ్గ లేదని దర్శకులు గ్రహించాలి . ఈ చిత్రం లో కధాంశం కొత్త గా ఉంటే ఇంకా బాగుండేది .  ఇందులో కధే ప్రధాన లోపం  . అసలు ఇందులో కధ  వుందని ప్రత్యేకం గా చెప్పుకోవడానికి ఏమీ లేదు . గతం లో మనం చూసిన ఎన్నో సినిమాలు , జగన్ చేసిన సినిమాలే ఇందులోనూ కనిపిస్తాయి తప్ప ,కొత్తగా ఏమీ లేదు . అయితే జగన్ ఎంతో ప్రతిభావంతంగా , ప్రభావవంతంగా ఈ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేసాడు . అందులో తను చాలా వరకూ విజయవంతం అయ్యాడు . 

ఇందులో- ఏ బంధాలు వద్దని చెప్పేహీరో  హీరోయిన్‌ని ముద్దు పెట్టమంటూ  వెంటపడడం ఏమిటో ? అతడిని హీరోయిన్‌ ఎందుకు ప్రేమిస్తుందనే దానికి కారణం అంటూ కనిపించదు.'చూపించండే ' అనే పాట పూరి జగన్ ఆధునిక అభిరుచికి నిదర్శనం .  సినిమాలో చాలా సన్నివేశాలు రొటీన్ గానే సాగినా , రెండవ భాగం లో హీరో హీరోయిన్ కోసం గోవా వచ్చినప్పటినుండి సినిమా ఆసక్తికరంగానే నడిచింది  . 

 వరుణ్ గా నితిన్ పూరి జగన్ స్కూల్ లో పిల్ల చేష్టల్ని దాటేసి, గతం లో కన్నా పరిణితి చెందిన  నటన ప్రదర్శించాడు  . ప్రతి సినిమాకి తెలుగుదనం తక్కువైన హీరోయిన్ ని మనకు పరిచయం చేసే పూరి జగన్ ఇందులో '1920 'అనే హిందీ హార్రర్  చిత్రంలో చేసిన అదా శర్మను పెట్టారు .ఫలితం అంతంత మాత్రమే . ఇస్కాన్ రమణ గా బ్రహ్మానందం పాత్ర , నటన బాగున్నాయి .గోవా లో తమిళ్ వ్యాపారి గా అలీ పాత్ర ఓకే. ఇతర పాత్రల్లో దేవన్ ,అజయ్ , నికోల్ , అజాజ్ ఖాన్ , కేశా కంబటి పోషించారు .   చివరిలో కాసేపు ప్రకాష్ రాజ్ కనిపించడం విశేషం .    


అనుప్ రుబెన్స్ పాటలు ఈ చిత్రం లో ప్రధాన ఆకర్షణ . అన్ని పాటలూ ... శేఖర్ నృత్య దర్శకత్వం లో ఆ పాటల చిత్రీకరణా  ప్రేక్షకులను ఉర్రూత లూగించేలా వున్నాయి .అతని బాణీలను  అందుకోవడంలోపాటల రచయిత భాస్కర భట్ల కొన్ని చోట్ల తడబడ్డాడు ... మరి కొన్నిచోట్ల వెనుకబడ్డాడు . అమోల్ రాథోడ్ ఫోటోగ్రఫీ ఈ చిత్రం లో మరో హైలైట్ . విదేశీ లోకేషన్స్ సహా సినిమా మొత్తం కనులకింపుగా చిత్రీకరించారు . నేపధ్య సంగీతం బాగుంది  ,  రామ్ - లక్ష్మణ్  ఫైట్స్ కొత్తదనాన్ని సంతరించుకున్నాయి . శేఖర్ ఎడిటింగ్ సినిమా వేగాన్ని పెంచింది  . బ్రహ్మ కడలి కళా దర్శకత్వం సినిమాకి నిండుదనాన్ని ఇచ్చింది . యువ ప్రేక్షకులను కట్టిపడేసే పూరి జగన్ సంభాషణలు ఈ సారి  కొంతమేరకే పని చేసాయి                                                                                       -రాజేష్ 

0 comments:

Post a Comment