RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, December 14, 2012

'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్ర సమీక్ష


'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్ర సమీక్ష       3/5


తేజ సినిమా , ఫోటోన్ కధాస్ సంయుక్తంగా సి.కళ్యాణ్ నిర్మాణంలో గౌతం వాసుదేవ  మీనన్ దర్శకత్వం లో ఈ చిత్రం రూపొందించారు.

వరుణ్-నిత్య చిన్ననాటి స్నేహితులు.వారి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. ఎన్నో సందర్భాల్లో వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తు తుంటాయి.కొన్నాళ్ళ పాటు దూరంగా వున్నా , వారు మళ్ళీదగ్గరవుతుంటారు.వరుణ్ తన కుటుంబం కోసం తన కెరీర్ ని మలుచుకునే సందర్భంలో  వరుణ్-నిత్య ల మధ్య వచ్చిన విభేదాలు తారా స్థాయికి చేరుకుంటాయి.చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాయించుకున్న వరుణ్ నిత్య ని కలవాలని ...తిరిగి ఆమె ప్రేమను పొందాలని ప్రయత్నిస్తాడు.అప్పటికే సోషల్ వర్కర్ గా మారిన నిత్య అతన్ని తిరస్కరిస్తుంది.దాంతో వేరే అమ్మాయి తో వరుణ్ పెళ్ళికి అంగీకరిస్తాడు.అది తెలిసిన  నిత్యకు   తను చేసిన తప్పు ఏమిటో అర్ధమవుతుంది.ఒకరినొకరు వదులుకోలేక వరుణ్-నిత్య లు పడ్డ మానసిక సంఘర్షణ కు ముగింపు ఏమిటనేది సినిమాలో చూడాలి....

మణిరత్నం వంటి దర్శకుల తర్వాత వచ్చిన దర్శకుల్లో  తనకంటూ  ప్రత్యేకత ను సంతరించుకున్న దర్శకుల్లో గౌతం మీనన్ ఒకరు. అతని చిత్రాలు రొటీన్ కధనం తో కాకుండా...పాత్రల ఆత్మ కధలా ప్రేక్షకుల మనసులకు దగ్గరవుతుంటాయి.సున్నితంగా ..సునిశితంగా చెప్పడం అతనిలో విశేషం. .ఇందులో వరుణ్-నిత్య అనే రెండు పాత్రల ప్రేమ పరిణామ క్రమం ఎంతో హృద్యం గా చూపించారు.  అసహమైన నాటకీయతకు తావు లేకుండా వారి స్నేహం...ప్రేమ...కలహాలు...ఎడబాటు...కలయికలను విపులంగా, సహజంగా చూపుతూ కధను నడిపించారు.అయితే ఈ క్రమంలో సినిమాలో చాలా చోట్ల నడక నెమ్మదించి...సాగదీసిన ఫీలింగ్ తో ప్రేక్షకులు  అసహనానికి గురవుతున్నారు.ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు సన్నివేశంలో పది నిముషాల పాటు  లాంగ్ షాట్స్ పెట్టి ఇబ్బంది పెట్టారు.క్లైమాక్స్ కూడా సుదీర్గంగా వుంది...అయినా బలమైన సన్నివేశం కావడంతో దాన్ని సహించారు. సినిమా ప్రారంభంలో ఒకేసారి వరసగా కృష్ణుడు,నానిలఫై రెండుపాటలు పెట్టడం ఎందుకో అర్ధం కాదు. 'సూర్య సన్  ఆఫ్ కృష్ణన్' తరహా లోనే ఇందులో, హీరో హీరోయిన్లను చిన్న వయసునుండి చూపడంలో విజయవంతం అయ్యారు. రవిప్రకాష్ పెళ్లి సంబంధం కేన్సిల్ తర్వాత, వారి ఇంట్లో సన్నివేశం మనసుని తాకుతుంది. ప్రేమ విఫలమైన నిత్య సోషల్ వర్కర్ గా మారడం బాగుంది. ప్రేమికులు ఇష్టపడే  సన్నివేశాలు ఇందులో బాగానే  వున్నాయి.  కాస్త క్లాస్ టచ్ వున్న చిత్రాలు చూడగలిగే యువతకు  ఈ చిత్రం బాగా నచ్చుతుంది.

వరుణ్ గా  నాని అ పాత్రని చాలా బాగా చేసాడు.ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఎంతగానో ఆకట్టుకున్నాడు.నిత్య గా సమంత అన్నివిధాలా రాణించింది. వివిధ వయసులను ప్రతిబింబిస్తూ, తనలోని ప్రతిభావంతురాలైన  నటిని ప్రేక్షకుల ముందుంచింది. నాని ఫ్రెండ్ గా కృష్ణుడు పాత్ర కొంత రిలీఫ్ నిచ్చింది. రవిప్రకాష్, రవి రాఘవేంద్ర,వివేక్ పాథక్ ,అనుపమా కుమార్ ఇతర పాత్రలు పోషించారు.హీరో జీవా ఒకసారి తళుక్కున కనిపించడం ప్రేక్షకులకు బోనస్ . చాలా కాలం తర్వాత ఈ  ప్రేమ కదా చిత్రంలో  ఇళయ  రాజా సంగీతం ప్రత్యేకతను సంతరించుకుంది.'ఏది ఏది కుదురేది', 'లాయి లాయి హాయి','ఇంతకాలం కోరుకున్న' వంటి చాలా బాగున్న పాటలు ఇందులో  వున్నాయి .దర్శకుడి అభిరుచి మేరకు సందర్భానుసారం అందించిన నేపధ్య సంగీతం కూడా బాగుంది.  గేయరచయితగా అనంత శ్రీరామ్  మరోసారి ఈ చిత్రాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.మసాలా రచయితగా పేరున్న కోనవెంకట్ కు ఈ చిత్రం నిజంగా కత్తిమీద సామే...ఐనా అతను న్యాయం చెయ్యగలిగాడు.   -రాజేష్ 

1 comments:

cinesurgicals said...
This comment has been removed by the author.

Post a Comment