RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Saturday, May 10, 2014

'ప్యార్ మే పడిపోయానే' చిత్ర సమీక్ష

                           'ప్యార్ మే పడిపోయానే' చిత్ర సమీక్ష   2/5

శ్రీ సత్య సాయి ఆర్ట్స్‌ పతాకం ఫై  రవి చావలి దర్శకత్వం లో కె.కె. రాధా మోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు . 

 చంద్ర/చిన్నా(ఆది), యుక్త (శాన్వి) చిన్నప్పుడు పక్కపక్క ఇళ్లలోనే వుండేవారు  కానీ, వీరిద్దరికీ అస్సలు పడదు. కొద్ది రోజులకి చిన్నా వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేసే వేరే ఏరియాకి వెళ్ళిపోతారు. కానీ అప్పుడు చేసిన ఓ పని వల్ల యుక్త చిన్నాపై పగ పెంచుకుంటుంది.ఆ తరువాత కొన్నాళ్ళకు ...   మ్యూజిక్ కంపోజర్ అవ్వాలనుకునే ఓ బిటెక్ కుర్రాడు చంద్ర. ఆ  కాలేజ్ లోనే యుక్త చేరుతుంది. యుక్తని మొదటి చూపులోనే ప్రేమించేసిన చంద్ర తనతో ఎలాగన్నా పరిచయం పెంచుకోవాలనుకుంటాడు. యుక్తకి సింగర్ అవ్వాలనే కోరిక ఉండడంతో తన ట్రూప్ లో చేర్చుకుంటాడు. అలా పరిచయం మొదలై వీరిద్దరూ ప్రేమికులుగా మారుతారు. అప్పుడే- యుక్త తన చిన్నప్పటి ఫ్రెండ్ అని, అలాగే చిన్నాపై పగ పెంచుకొని ఉందని తెలుస్తుంది.  యుక్తకి చంద్రనే చిన్నా అని తెలిసిందా? అలా తెలిస్తే చిన్నాని యుక్త ఏం చేసింది? అసలు యుక్తకి చిన్నా చేసిన ద్రోహం ఏంటి అనేది  సినిమాలో  చూడాల్సిందే.... 

'శ్రీమన్నారాయణ' తదితర వరుస చిత్రాలతో నిరాశ పరిచిన రవి చావలి ఈసారి ‘లవ్‌లీ’ జంటతో  ఒక ఎంటర్‌టైనింగ్‌ లవ్‌స్టోరీ తీసే ప్రయత్నం చేసాడు. అయితే అటు రొమాన్స్‌ని-ఇటు ఎంటర్‌టైన్‌మెంట్‌ని దేన్నీ  పూర్తి స్థాయిలో పండించ లేకపోయాడు. ప్రేమకథా చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్‌ అవడం కీలకం. ఇందులో అది పూర్తిగా లోపించింది.   రొటీన్‌ అనిపించకుండా కొత్తగా అనిపిస్తేనే- లవ్‌ సినిమాలు ఆదరణ పొందుతాయి .రవి చావలి తన కథని, తన పాత్రల్ని చాలా తేలికగా తీసుకున్నాడు. ఇద్దరూ  ప్రేమలో పడడానికి బలమైన కారణాలేమీ చూపించలేదు. కనీసం వారిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలతో  మనసుని తాకే ప్రయత్నమూ చేయలేదు. కేవలం ఒక సిల్లీ కారణమొకటి చూపించి -దానినే ప్రధానాంశం చేసేశాడు . దాంతో  ఈ చిత్రాన్ని  రక్తి కట్టించడం తన వల్ల కాలేదు. మధ్యమధ్యలో కొన్ని కామెడీ సీన్లు పెట్టినా   అవేమీ అంతగా  నవ్వించలేదు. క్లైమాక్స్  సన్నివేశాలని మరీ పాతకాలపు దర్శకుల ధోరణి  లో చేశాడు . రొమాంటిక్‌ సినిమాలకి వచ్చేసరికి ఎంతో కొంత ఎమోషనల్‌ ఎటాచ్‌మెంట్‌ ఏర్పడేట్టు చేయడం అవసరం . ప్రేమ జంట - లవ్‌ సక్సెస్‌ కావాలని, వారికి ఎదురవుతున్న అవరోధాలు తొలగిపోవాలని అనిపించేలా.. కథని నడిపించాలి. ప్రేమకథా చిత్రాల్లో ఉండాల్సిన ఫీల్‌ వర్కవుట్‌ చేయడం చేతకాకపోతే - లవ్‌ స్టోరీస్‌ జోలికి వెళ్లక పోవడమే  ఉత్తమం. రవి చావలి తనకు తోచినట్లుగా   సీన్లన్నీ చుట్టి పారేసాడు. ప్రేమికులిద్దరూ కలిసిపోయారనే తృప్తి కంటే... ఇప్పటికైనా కలిసారులే- అనిపించే ట్టుగా  తెర కెక్కించాడు  . ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం బెటర్‌ అనిపిస్తుంది. కొన్ని పాటలు, సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి .  కథలోకాస్త  విషయమున్నా కానీ, కథనం పరంగా దర్శకుడు చాలా పొరపాట్లు చేయడంతో ఈ చిత్రం -'బోర్ మే పడిపోయామే' అనిపిస్తుంది. మన దర్శకులు అవకాశాలను పట్టడం లోనే తమ పనితనాన్ని చూపిస్తున్నారు కానీ- వచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోలేక పోతున్నారనడానికి ఇది మరో ఉదాహరణ. 

ఈ లవ్ ఎంటర్టైనర్ లో ఆది చక్కటి నటనని కనబరిచాడు. స్టైలిష్ లుక్ లో కనిపించిన ఆది కామెడీ సీన్స్ ని చాలా బాగా చేసాడు. ముఖ్యంగా సాయి కుమార్, రవి శంకర్ ని ఇమిటేట్ చేసిన సీన్స్, కొన్ని చోట్ల గందరగోళం క్రియేట్ చేసే సీన్స్ లో చాలా బాగా హావభావాలు పలికించాడు . పాటల్లో డాన్స్ బాగా వేసాడు. హీరోయిన్ శాన్వి కూడా తన పాత్రకి న్యాయం చేసింది. సినిమాలో గ్లామరస్ గా కనిపించడమే కాకుండా ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేసింది.ఫస్ట్ హాఫ్ లో వచ్చే వెన్నెల కిషోర్ కామెడీ ఎపిసోడ్, హర్రర్ సినిమాల ఎపిసోడ్ నవ్విస్తే, ఇక సెకండాఫ్ లో వచ్చే హుస్సేన్ వర్మ పాత్ర పోషించిన సప్తగిరి ఎపిసోడ్, అలాగే తాగుబోతు రమేష్ ఎపిసోడ్, మధు చేసిన కొన్ని సీన్స్ ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. అలాగే ఆది పక్కన ముస్లీం ఫ్రెండ్ పాత్ర కూడా  బాగుంది.
టెక్నికల్ విభాగంలో సినిమాటోగ్రాఫర్ టి. సురేందర్ రెడ్డి  ప్రతి లొకేషన్ ని చాలా అందం గా చూపించి ఆడియన్స్ కి రిచ్ ఫీల్ కలిగించేలా చేసాడు. అలాగే-  అనూప్ అందించిన పాటలు కూడా  బాగున్నాయి.  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి హెల్ప్ అయ్యింది. డైలాగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు.ఎడిటర్ ఇంకాస్త శ్రద్ధ తీసుకొని  బోరింగ్  సీన్స్  కట్ చేసి,  నిడివి కాస్త తగ్గిస్తే  సినిమాకి  హెల్ప్ అయ్యేది.                  -ధరణి 

0 comments:

Post a Comment