RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, April 11, 2014

' రేసుగుర్రం' చిత్ర సమీక్ష

                                       ' రేసుగుర్రం' చిత్ర సమీక్ష  3/5



లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్‌పతాకం ఫై సురేందర్‌ రెడ్డి దర్శకత్వం లో 
నల్లమలుపు శ్రీనివాస్‌, డా"కె. వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు .

నీతి, నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ రామ్ , ఎప్పుడూ జల్సాగా తిరిగే లక్కీ  అన్నదమ్ములు. వీరికి క్షణం కూడా పడదు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో గొడవ పడుతుంటారు. ఈ క్రమంలో స్పందన (శృతి హాసన్)తో లక్కీ ప్రేమలో పడతాడు. అయితే లక్కీ-స్పందన ప్రేమ వ్యవహారానికి బ్రేక్ వేసేందుకు రామ్ ప్రయత్నిస్తాడు . శృతిని తనకు దక్కకుండా చేస్తున్న  రామ్ కు తగిన గుణపాఠం చెప్పాలని లక్కీ- అతని పోలీస్ కారును దొంగిలిస్తాడు. ఆ  కారులో ఉన్నది రామ్ అనుకుని, రాజకీయవేత్తగా మారిన రౌడీ మద్దాలి శివారెడ్డి మనుషులు   చంపాలనుకుంటారు . ఆ దాడి నుంచి లక్కీ క్షేమంగా బయటపడతాడు. అది తన అన్నని చంపాలని చేసిన దాడి అని తెలుసుకున్నలక్కీ - అతని  మనుషులతో సహా  శివారెడ్డిని విపరీతం గా కొడతాడు . దాంతో వారి కుటుంబం ఫై పగ బట్టిన  శివారెడ్డి- అతని తండ్రి సలహా మేరకు రాజకీయ అధికారం కోసం కొంతకాలం వేచి చూస్తాడు . రాష్ట్ర మంత్రి అయిన తర్వాత వారి కుటుంబాన్ని రోడ్ మీదికి లాగే పనులకు శ్రీకారం చుడతాడు . శివారెడ్డి ని  ఎదుర్కోవడానికి  లక్కీ ఏమి చేసాడో సినిమాలో చూడాలి ....  

ఖర్చు ఎక్కువ పెట్టిస్తాడనే పేరున్నప్పటికీ ,   విలక్షణమైన దర్శకుడని సురేందర్ రెడ్డి తన చిత్రాలతో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఈ చిత్రం విషయానికి వస్తే- వక్కంతం వంశీ కథ రొటీన్ గానేవుంది .  గతకాలపు  చేదు  అనుభవాల వల్ల  కధ  కన్నా, వినోదాన్నేఈ చిత్రం లో  సురేందర్ ఎక్కువ నమ్ముకున్నాడు . అందుకే ఈ చిత్రానికి ' రేసుగుర్రం' వంటి భారీ హీరోయిక్ పేరు పెట్టే  బదులు, 'జులాయి' తరహా సరదా పేరు పెడితే ఈ సినిమాకి సరిపోయేది . ఎందుకంటే - ఇందులో రేసు లేదు ... గుర్రము లేదు ... లాజిక్ అంతకంటే లేదు . అన్నింటి కన్నా ఘోరమైన విషయం ఏంటంటే - తన కుటుంబానికి తీవ్రమైన ఇబ్బందులు పెట్టిన విలన్ని-  సీరియస్ గాఎదుర్కొనడానికి బదులుగా  హీరో పరమ సిల్లీ పద్ధతిలో...  అందులోనూ బ్రహ్మనందం వంటి కమెడియన్ ని ముందు పెట్టి, తను  వెనుక ఉండి ఎదిరిస్తాడు .మన హీరో ల తాజా పరిస్థితి ఇది...జాలిపడాలి !
  
                  లక్కీ గా అల్లు అర్జున్ లోని స్టైలిష్ లుక్ , మాస్ పెర్ఫార్మెస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి . నటనలో అభివృద్ధి సాధించాడు . వినడానికి ఇబ్బంది పెట్టే  తన  గొంతుతో 'దేవుడా' అనే ఊతపదం పలికే  సాహసం చేసాడు . అయితే అల్లు అర్జున్‌ నుంచి కోరుకునేమంచి  డాన్స్ మూమెంట్స్  మాత్రం ఈ సినిమాలో అంతగా లేవు .అలాగే, విలన్ తండ్రి ముఖేశ్ రుషికి వార్నింగ్ ఇచ్చే సీన్ చెయ్యడానికి నటుడిగా అతని పరిణితి సరిపోలేదు.  పోలీస్ ఆఫీసర్  రామ్ గా శ్యామ్‌' కిక్‌' తర్వాత మరో గుర్తుండిపోయే మంచి క్యారెక్టర్‌ ఇందులో చేసాడు. స్పందన పాత్రలో శృతి గ్లామర్ తో పాటు, పెర్ఫార్మన్స్ కూడా బాగుంది.  ఆమె ఫై చేసిన  'లోపల  ఫీలవుతున్నా' అనే  ఎపిసోడ్స్ ఆలోచన బాగుంది. వాటిలో  శృతి బాగా చేసింది. అలాగే  హీరో  తో  పాటు పాటల్లో  కొన్ని బోల్డ్ స్టెప్పులు వేసి సహకరించింది . రౌడీగా మారిన రాజకీయవేత్త మద్దెల శివారెడ్డి పాత్రలో భోజ్ పురి నటుడు రవికిషన్ అవకాశం వున్న మేరకు బాగా చేశాడు. ప్రకాష్‌రాజ్‌ క్యారెక్టర్‌ సరదాగావుంది .  కానీ అతన్ని  అర్థాంతరంగా వదిలేసారు. దర్శకుడు బ్రహ్మనందం కామెడీనే ఎక్కువగా నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. బ్రహ్మానందం క్లయిమాక్స్‌కి ముందు వచ్చి ‘కిల్‌బిల్‌ పాండే’గా చెలరేగిపోయాడు. క్లైమాక్స్ వరకు   తనే హీరో అయి   బ్రహ్మానందం సినిమాని' ఓకే' అనిపించాడు . ' కిక్' సినిమాలో ఆలీ క్యారెక్టర్ ను కొనసాగింపుగా ఈ చిత్రంలో డాక్టర్ గా  చేసినా అంతగా పండలేదు . పోసాని , ముఖేశ్ రుషి, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ రెడ్డి , రాజీవ్ కనకాల, సలోని, కోట ,సయ్యాజి  షిండే, ఎమ్మెస్ , శ్రీనివాస రెడ్డి , దువ్వాసి , పవిత్ర , ప్రగతి , రఘు బాబు , రఘు కారుమంచి  ఇతరపాత్రలు పోషించారు .   

                తమన్ పాటల్లో 'సిన్మా సూపిస్తా మామా' తప్ప చెప్పుకోదగ్గవి లేవు , రీ రికార్డింగ్ సినిమాకు చాలా  ప్లస్ అయ్యింది .   మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ చాలా బాగుంది .గౌతంరాజు ఎడిటింగ్ బాగుంది .  రామ్ - లక్ష్మణ్ ల థ్రిల్స్ బాగున్నాయి . అయితే ఇంటర్వెల్ ముందు ఫైట్ మరీ అతిగా వుంది . దీపక్ రాజ్ - విక్రం సిరి ల సంభాషణలు బాగున్నాయి                                                                                                                                                -రాజేష్ 

0 comments:

Post a Comment