RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, March 7, 2014

'బంగారు కోడి పెట్ట' చిత్ర సమీక్ష

                             'బంగారు కోడి పెట్ట' చిత్ర సమీక్ష  1.5 / 5 

గురు ఫిలింస్‌ పతాకం ఫై రాజ్‌ పిప్పళ్ల  రచన , దర్శకత్వం లో సునీత తాటి ఈ చిత్రాన్ని నిర్మించారు . 


ఎనర్జీ డ్రింక్ కంపెనీలో వంశీ (నవదీప్) భాను (స్వాతి) పనిచేస్తుంటారు.  ప్రమోషన్ వస్తుందని ఆశతో ఉన్న భాను మేనేజర్ ప్రవర్తన కారణంగా ఉద్యోగం కోల్పోతుంది. సొంత ఫ్లాట్ కి అడ్వాన్స్ ఇవ్వడానికి  భానుకు డబ్బు అవసరమవుతుంది. డబ్బు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఎనర్జీ డ్రింక్ కంపెనీ వినియోగదారులకు అందించేందుకు పంపే -బంగారు బిస్కట్, కాయిన్స్ ను కాజేయాలని ప్లాన్ వేస్తుంది. అప్పటికే పోలీస్ రికార్డ్స్ లో వున్న  వంశీని భాగస్వామిగా పెట్టుకుంటుంది. అయితే ఆ తర్వాత ఈ దొంగతనం కధలో కొన్ని ఊహించని ట్విస్ట్ లు వస్తాయి .  దొంగతనం చేసే క్రమంలో  ఎలాంటి పరిస్థితులు, ఇబ్బందులు ఎదురయ్యాయి? చివరకు గోల్డ్ బిస్కట్, కాయిన్స్ ను భాను, వంశీల స్వంతమయ్యాయా ? అనే ప్రశ్నలకు జవాబు సినిమాలోనే దొరుకుతుంది ... 

దోపిడీ కి  ప్లాన్‌ చేయడం, దానిని అమలు చేయడంలో అడ్డంకులు ఎదురు కావడం, వాటిని దాటుకుని అనుకున్నది సాధించడం... అనే కధ మనకు కొత్తదేమీ కాదు . అయితే మూడు కథల్ని విడి విడిగా నడుపుతూ- చివరికి అవన్నీ ఒకే  చోట ఎలా కలుస్తాయి -అనే విధానం లో దర్శకుడు కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు . అయితే ఘోరం గా ఫెయిలయ్యాడు . 
ఈ సినిమా కన్నా ఈ మధ్య  ఔత్సాహికులైన కుర్రాళ్ళు తీస్తున్న షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి . కథలో కొత్తదనం లేకుండా,కధకు అవసరమైన బిగువైన  స్క్రీన్ ప్లే లేకుండా   దర్శకుడు రాజ్ పిప్పళ్ల  అర్ధం లేని సినిమా తీసాడు . సినిమా మొదలైన  కాసేపటికే ఇందులో విషయం లేదని  ప్రేక్షకుడికి అర్ధమయి పోతుంది. గంటా నలభై నిముషాల హింస తో ఈ చిత్రం సాగుతుంది . అసలు, దర్శకుడికి తెలుగు  సినిమాలు చూసే అలవాటన్నా ఉందా? అనే సందేహం కలుగుతుంది . ఇందులో ఒక్క సన్నివేశం  కూడా పండలేదు . దర్శకుడిగా పేరు వేసుకోవాలనుకునే వారు , తమలో విషయం లేనప్పుడు-మంచి  రైటర్ ని పెట్టుకుని చక్కగా  స్క్రీన్ ప్లే చేయించుకోవచ్చు ... దాన్ని మంచి ఎడిటర్ తో ఆసక్తికరం గా రూపుదిద్దవచ్చు ... మంచి సంగీత దర్శకుడితో  రీ రికార్డింగ్ చేయించి సన్నివేశాలకు జీవం పొయ్యొచ్చు . అయితే ఈ చిత్రం లో సాహిర్‌ రాజా ఫోటోగ్రఫీ అంతంత మాత్రమే . ధర్మేంద్ర కాకర్ల, చంద్రశేఖర్‌ ల ఎడిటింగ్ మరీ పేలవం గా వుంది . మహేష్‌ శంకర్‌ సంగీతం లో పాటల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు . ఇక రీ రికార్డింగ్ ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప, బాగు లేదు సరికదా... సన్నివేశాన్ని మరింత బలహీన పరిచేది గా వుంది . ప్రసాద్‌ వర్మ సంభాషణలు మరీ చిన్నపిల్లలు రాసినట్లుంటాయి ... ఏమాత్రం మెచ్యురిటీ  లేదు . 

వంశీ గా నవదీప్ పాత్రలో కొత్తదనం లేదు .  చెయ్యడానికి కూడా ఏమీ  లేకపోవడం తో, రొటీన్ గానే నడిపించాడు  .  భాను పాత్రలో స్వాతి అల్లరిగా , కొంటెగా కనిపించినా.. ప్రేక్షకులు ఆశించే స్థాయిలో ఆమె పాత్ర  లేదు . తనకి హ్యాండ్ ఇచ్చి మేనేజర్ తో కుమ్మక్కు అయిన  హీరో పట్ల హీరోయిన్ కి సానుభూతి ... ప్రేమ ఎలా కలుగుతుందో మనకి అర్ధం కాదు .   కథలో భాగంగా వచ్చే దొరబాబు, ఎర్రబాబుగా  స్టంట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ లతో చేయించడం బాగానే వుంది కానీ , వారిని ఏ మాత్రం సద్వినియోగం చేసుకోలేక పోయారు . 'బంగారు కోడిపెట్ట' అని పేరు పెట్టాం  కదా! -అని ఇందులో అతకని కోడి సెంటిమెంట్ ని కూడా  దర్శకుడు ప్రయోగించాడు  .   ఎనర్జీ డ్రింక్ కంపెనీ మేనేజర్ గా విలన్ షేడ్ ఉన్న పాత్రలో  హర్షవర్ధన్ కనిపించాడు .  క్లై మాక్స్ లో మినహా అతని నటన కూడా ఆకట్టుకోలేదు . రామ్, లక్ష్మణ్ ఎపిసోడ్ లో పాప సీన్లు, సినీ నటుడు కావాలని ప్రయత్నించే పిజా బాయ్ గా సంతోష్ సన్నివేశాలు  కొంత పర్వాలేదనిపిస్తాయి .తక్కువ లొకేషన్స్ లో, అతి తక్కువ ఖర్చుతో ఈ చిత్రాన్ని పూర్తి చెయ్యడం ఒక్కటే తెలివైన పని                                                                                                                                                                            -రాజేష్  

0 comments:

Post a Comment