RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, February 1, 2013

'ఒంగోలు గిత్త' చిత్ర సమీక్ష


                                       'ఒంగోలు గిత్త' చిత్ర సమీక్ష           2/5

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం ఫై 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం లో బి.వి.యస్.యన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.


చిన్నప్పుడే ఒంగోలు మిర్చి యార్డ్ లోకి వచ్చిన  అనాధ, క్రమంగా వైట్ పేరుతో మిర్చి వర్తకుడిగా ...అందరికీ  తలలో నాలుకలా మారుతాడు. మిర్చి యార్డ్ చైర్మన్ ఆదికేశవులు దృష్టిలో సమర్ధుడనిపించుకుంటాడు. ఒక సందర్భంలో -ఆదికేశవులు కూతుర్ని తనకిచ్చి పెళ్లి చెయ్యడానికి ఒప్పించి, నిశ్చితార్ధం కూడా కానిస్తాడు. బయటికి ఎంతో గొప్పవాడిగా కనిపించే ఆదికేశవులు అసలు రూపం మరొకటి వుంటుంది. మిర్చి యార్డ్ ను మరో చోటికి తరలించాలని , ఎమ్మెల్యే తో కలిసి అతడు చేసే కుట్రను వైట్ అడ్డుకుంటాడు.ఆదికేశవులు అసలు రూపాన్ని బైటికి తేవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు.ఇంతకీ ఈ వైట్ ఎవరు? మిర్చి యార్డ్ లో అతను ఏ ప్రయోజనం ఆశిస్తున్నాడు?చివరికి ఆదికేశవులు  గోముఖాన్ని ఎలా తొలిగించాడనేది సినిమాలో చూడాలి ...

'బొమ్మరిల్లు' తో గొప్పపేరు,'పరుగు'తో మంచిపేరు తెచ్చుకున్న భాస్కర్,ఆ తర్వాత  'ఆరెంజ్' పేరుతో పూర్తిగా విదేశాల్లో అర్ధంలేని ఓ 'ఆధునిక' చిత్రాన్ని విపరీత  ఖర్చుతో తీసి,  నిర్మాత  నాగబాబు కొంప ముంచాడు. ఇప్పుడు, తన ధోరణికి పూర్తి భిన్నంగా, పక్కా కమర్షియల్ పంధాలో ఈ చిత్రాన్ని చేసాడు.  అయితే ,అసలు అతనికి 'పక్కా కమర్షియల్ పంధా' అంటే ఏంటో తెలియక పోవడం వల్ల ...తనకు తోచిందేదో చేసేసి మరో పెద్ద పరాజయాన్ని ఇచ్చాడు . పరమ రొటీన్ కధతో, అర్ధం లేని  స్క్రీన్ ప్లేతో చేసిన ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు నాసిరకం  టేకింగ్ వల్ల  పండలేదు. సినిమా చూస్తున్న  ప్రేక్షకుడు ఎన్నో సార్లు తీవ్ర అసహనానికి గురవు తాడు. దీనికి తోడు- భాస్కర్ మాస్ మసాలా అంతా అరవ వాసన తో వెగటు పుట్టించింది. సినిమాలో పాటలు మరో పెద్ద మైనస్. అసందర్భం అయినా,జానపద గాయకులతో పాట పెట్టడం అభినందనీయం. కొత్తగా మిర్చి యార్డ్ (గుంటూరు) నేపధ్యంలో చెయ్యడం కూడా బాగుంది.  ఈ చిత్రం లో ఒకే ఒక ప్లస్...ప్రకాష్ రాజ్ పాత్ర, అతని నటన. ఈ మధ్య రొటీన్ పాత్రలే చేస్తున్న ప్రకాష్ రాజ్ ఆదికేశవులు గా అధ్బుతంగా చేసాడు.అయితే ,అతని పాత్రను నగ్నంగా చూపాల్సిన అవసరం ఎంత మాత్రం కనిపించలేదు. మంచితనం ముసుగేసుకునే ఆదికేశవులు కేరెక్టర్ రూపకల్పనలోనూ... ఆదికేశవులు  ఆఫీసులో  "ప్రేమే దైవం...సేవే మార్గం" వంటి స్లోగన్స్ తో బోర్డులు పెట్టడంతోనూ దర్శకుడు ఎవరినో ద్దేశించాడనే సందేహం కలుగుతుంది.

'పిట్ట కొంచం,కూత ఘనం' అనిపించుకునే  రామ్, ఇందులోనూ వైట్ గా ఉత్సాహంతో, బాగా చేసాడు. సంధ్య గా కృతి కర్బంద అందంగా నటించింది. పావురం గా కిషోర్ దాస్ ఈ చిత్రం లో పెద్ద పాత్రను బాగా చేసాడు. అలీ కామెడీ ఇబ్బంది పెట్టింది. తిక్కవరం వాత్సవ్యుడుగా రఘుబాబు తిక్క పాత్ర పర్వాలేదు.రామ్ తండ్రిగా ప్రభు పాత్రోచితంగా నటించాడు. ఇతర పాత్రల్లో రమాప్రభ, ఆహుతి ప్రసాద్, అభిమన్యు సింగ్, అజయ్, జయలక్ష్మి, రాజేంద్ర, జయప్రకాశ్ రెడ్డి చేసారు. మణిశర్మ రీ రికార్డింగ్ ,వెంకటేష్ ఫోటోగ్రఫీ బాగుంది. సురేంద్ర క్రిష్ణ సంభాషణలు అంతంత  మాత్రంగానే వున్నాయి.                                                                                                    -రాజేష్ 

0 comments:

Post a Comment