RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, May 25, 2012



                                                 'దరువు' చిత్ర సమీక్ష     2.25 /5

శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై శివ దర్శకత్వం లో బూరుగు పల్లి శివ రామ క్రిష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సిగ్గు సెరం...మానం మర్యాద లేకుండా డబ్బుకోసం అడ్డమైన పనులు చేసే బుల్లెట్ రాజా ఓ సారి దొంగతనానికి వెళ్ళినప్పుడు పెళ్ళికూతురు శ్వేతప్రేమలో పడిపోతాడు. తన బావ హార్బర్ బాబు తో బలవంతపు పెళ్ళికి సిద్దపడ్డ శ్వేత మనసుని , డాన్స్ మాస్టర్ విద్యా బాలన్ ని అడ్డం పెట్టుకుని గెలుచుకుంటాడు . అయితే, యమలోకం లో చిన్న యముడిని ఇబ్బంది పెట్టడానికి , చిత్రగుప్తుడు కావాలని  చేసిన పొరపాటువల్ల ...ఆయువు తీరకుండానే బుల్లెట్ రాజా చనిపోయి ,యమలోకానికి వస్తాడు. అప్పుడు జరిగిన పొరపాటు తెలుసుకున్న చిన్న యముడు- బుల్లెట్ రాజాను పక్క రాష్ట్రంలో మరణించిన మంత్రి రవీందర్ రూపంలో తిరిగి భూలోకానికి  పంపుతాడు. రవీందర్ గత ప్రవర్తన కు భిన్నంగా, ప్రజలకు  అనుకూలంగా చేస్తున్న బుల్లెట్ రాజా ను మట్టు పెట్టాలని అతని సన్నిహితులు ప్రయత్నిస్తారు. వారి కుట్రలను భగ్నం చేసి ...శ్వేతను ఎలా సొంతం  చేసుకున్నాడనేదే  ఈ చిత్ర కధాంశం.

వినోదాత్మక చిత్రాల హీరో రవితేజ ని కొత్తగా చూపించాలని ఇందులో సోషియో ఫాంటసి  గా  యమలోకాన్ని తీసుకున్నారు.అయితే గతం లో ప్రముఖ నటులు విజయవంతంగా చేసిన యమలోకం నేపధ్యంలో- సన్నివేశ రూప కల్పనలో ఘోరంగా విఫలమయ్యారు. దాదాపు  గత చిత్రాల్లోని సన్నివేశాలనే పేలవంగా  మరోసారి చూస్తున్నట్లు అనిపిస్తుంది. బుల్లెట్ రాజా -రవీందర్ లుగా రవితేజ నటనే ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ ఏకైక అంశం. బుల్లెట్ రాజా గా రవితేజ మరీ ఊర మాస్ పాత్ర చేసాడు. అరుపులు,గోలతో, వింత హావభావాలతో ... రెచ్చి పోయి చేసిన అతని నటన చూసాక రాబోయే చిత్రాల్లో - రవి తేజ ఇంకా  ఏ రేంజ్ నటనతో ఇరగదీస్తాడో నని భయం వేస్తుంది.  అయితే ఎడతెగని  ఉత్సాహంతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనే అతని తపన ఎంతైనా అభినందనీయం. రవీందర్ పాత్ర కాస్త హుందాగా వుంది. విద్యా బాలన్ గా బ్రహ్మానందం పాత్ర కూడా ఈ చిత్రం లో ప్రత్యేకత సంతరించుకుంది. శివ శంకర్ ని  పోలిన  డాన్స్ మాస్టర్ గా బ్రహ్మానందం తో ఇంకా మంచి ఫలితాలు సాధించే అవకాశం వున్నా ...స్క్రీన్ ప్లే లోపం వల్ల , వున్నంతలో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. పవిత్రానంద స్వామి పిలిస్తే చనిపోయిన రవీందర్ లేవడం, స్మశానం లో విలన్స్ తో కామెడీ-ఫైట్ సన్నివేశం, నిమ్మ కాయలు తల ఫై పెట్టి ఆడుకోవడం, జ్యోతి తో డిస్కషన్ సీన్ లో పవిత్రానంద స్వామి  ఇరుక్కు పోవడం,తల్లి  జయ సుధతో  సెంటిమెంట్ సన్నివేశాలు బాగున్నాయి. యమలోకం సెట్ తో  సహా కళా దర్శకుడి ప్రతిభ స్పష్టంగా కని పిస్తుంది. ఇటువంటి సినిమాల్లో పంచ్ లున్న డైలాగ్స్ కి ఎంతో ప్రాధాన్యత వుంటుంది. అయితే అందులో   చాలా మంది చేతులు పెట్టినట్లున్నారు ...సంభాషణలు అక్కడక్కడా బాగున్నాయి , కొన్ని చోట్ల ఘోరంగా వున్నాయి . అలాగే ప్రేక్షకులను అలరించే పాటలు కూడా ఈ చిత్రం లో మైనస్ అయ్యాయి.విజయ్ అంటోనీ   పాటల తో పాటు చిత్రీకరణ  కూడా ఆకట్టు కోలేదు . దర్శకుడు,సంగీత దర్శకుడు తమిళియన్స్ కావడం మూలంగా అరవ వాసన కూడా తగులుతుంది.
ప్రాధాన్యత లేని శ్వేత పాత్రలో  తాప్సి లంకణాలు చేసిన దానిలా, ఎండి పోయిన చెట్టులా కనిపించింది. పెద్ద యముడిగా సత్యనారాయణ,చిన్న యముడిగా తమిళ నటుడు ప్రభు,చిత్ర గుప్తుడిగా ఎమ్మెస్ నారాయణ,నారదుడుగా యల్.బి.శ్రీరాం,  మిత్రుడిగా వెన్నెల కిషోర్, పీ.ఏగా శ్రీనివాస రెడ్డి,  పవిత్రానంద స్వామిగా రఘు బాబు, తల్లిగా జయసుధ,పండితుడిగా  ధర్మవరపు, విలన్స్  హార్బర్ బాబు గా సుశాంత్ సింగ్,సయ్యజి షిండే, అవినాష్ నటించారు. వెట్రి ఫోటో గ్రఫీ పర్వాలేదు. రీ రికార్డింగ్- గ్రాఫిక్స్ అంతంత మాత్రం గానే వున్నాయి.                    
                                          -  రాజేష్

0 comments:

Post a Comment