'జబర్దస్త్' చిత్ర సమీక్ష 2.5/5
ఎవరూ లేని బైర్రాజు దొరికిన దగ్గరల్లా అప్పులు చేస్తూ అవారాగా బతికేస్తుంటాడు. బీహార్ లో ఒక అమ్మాయిని పెళ్ళిచేసుకోవడానికి వప్పుకుని,పెళ్ళికి ముందే పరారై హైదరాబాద్ చేరుకుంటాడు . అక్కడ శ్రేయ అనే అమ్మాయి తో కలిసి ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో చేరుతాడు . అక్కడ వచ్చిన ఓ వివాదం వల్ల , ఆ మిత్ర బృందం అంతా బయటికి వచ్చి వేరే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ పెడతారు . అది విజయవంతంగా నడుస్తున్న సమయంలో శ్రేయతో వచ్చిన స్పర్ధల కారణంగా బైర్రాజు ఆ సంస్థనుండి విడిపోయి వేరే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ పెడతాడు . సరస్వతి అనే అమ్మాయి అతనికి పరిచయమై ఆ సంస్థలో కీలక పాత్ర పోషిస్తుంది . అయితే,ఒకరోజు ఆమె డబ్బుతో మాయమవుతుంది. అప్పుడు తెలుస్తుంది బైర్రాజుకి- ఆమె 420 అని. బైర్రాజు లేకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ నడుపుతున్న శ్రేయ కూడా ఇబ్బందులను ఎదుర్కొంటుంది . అదే సమయంలో బైర్రాజు,శ్రేయ బృందానికి మలేషియా నుండి ఒక బంపర్ ఆఫర్ వస్తుంది . అక్కడ వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు?చివరికి ఎలా ఒక్కటవుతారనేది సినిమాలో చూడాలి ...
'అలా మొదలైంది' తో విజయవంతంగా కెరీర్ ప్రారంభించిన మహిళా దర్శకురాలు నందిని రెడ్డి చేసిన ఈ రెండవ చిత్రం ఆమె పేరు నిలపలేకపోయింది. 'అలా మొదలైంది' ఫ్రెష్ నెస్ తో మంచి వినోదాన్ని ఇస్తే ... పెద్ద ఆర్టిస్ట్ లతో రెగ్యులర్ సినిమా ధోరణిలో చేసిన ఈ చిత్రం ఆకట్టుకోలేక పోయింది . హిందీ చిత్రం 'బ్యాండ్ బాజా బారాత్'ను లేపేసి ఈవెంట్ మేనేజ్మెంట్ నేపధ్యంలో చేసిన ఈ చిత్రంలో దర్శకురాలు కామెడీ కాస్త ఎక్కువగానే ఇవ్వాలని ప్రయత్నించి చతికిల పడింది .హీరో ,హీరోయిన్ లు సిద్ధార్ధ,సమంతా లతో పాటు ,తెలంగాణా శకుంతల,ధర్మవరపు, సయ్యాజి షిండే,శ్రీహరి ... ఇలా అన్ని పాత్రలకూ సమర్ధులైన ఆర్టిస్టులే వున్నా-బలహీన మైన స్క్రీన్ ప్లే, టేకింగ్ వల్ల... అక్కడక్కడా కొన్ని నవ్వులు తప్ప, చాలా సన్నివేశాలు పండలేదు .' ఫీల్ లేని గోల'గా మారింది . సినిమా ప్రారంభమే- హీరో బీహార్ లో ఓ అమ్మాయి తో పెళ్లి తప్పించుకుని రావడం ...పెళ్లి కూతురు అన్న సయ్యాజి షిండే తన గుంపు తో హైదరాబాద్ వచ్చి, నెలల తరబడి హీరోను వెతకడం వంటి అసంబద్ధమైన సన్నివేశాలతో ఈ చిత్రం మొదలవుతుంది . మలేషియా ముస్లిం డాన్ హైదరాబాద్ నుండి ఈవెంట్ మేనేజర్ లుగా హీరో,హీరోయిన్ లను రప్పించడం ... శ్రీహరిని ధర్మవరపు తెలుగులో 'తుంటా' అని తిడితే, 'చిన్నప్పుడు మా అమ్మ ఇలానే తిట్టే 'దంటూ శ్రీహరి అతన్ని ముద్దు పెట్టుకోవడం... అవారా బైర్రాజు ను పోలీసుల నుండి విడిపించడానికి శ్రేయ తండ్రి కాశీ 5 లక్షలు అప్పుచెయ్యడం వంటివి తమాషా గా వున్నాయి . హీరో,హీరోయిన్ ల మధ్య ప్రేమ పరిణామ క్రమం కూడా సరిగా చూపలేక పోయారు . సినిమా క్లైమాక్స్ కి వచ్చే కొద్దీ రొటీన్ గా మారిపోయి, తేలిపోయింది . ఇందులో ప్రత్యేకతగా చెప్పుకోవాల్సింది ఏమన్నా వుంటే -అది నిత్య మీనన్ పాత్ర .420 సరస్వతి గా ఆమె చేసింది చిన్న పాత్రే అయినా ప్రేక్షకులను అలరించించింది . కధానాయిక గా మంచి కెరీర్ వున్న నిత్య ఇలా నెగెటివ్ పాత్ర చెయ్యడం సాహసమే . అలాగే , ఈ చిత్రంలో తమన్ పాటలు రెండు బాగున్నప్పటికీ ... అన్ని పాటలూ ఖర్చుకు వెనుకాడకుండా రిచ్ గా చిత్రీకరించడం మరో విశేషం . డాన్ శ్రీహరి ఇంట్లో దురదృష్ట కళాకారుడు గాజు పెట్టెలో డ్రమ్స్ వాయించుకోవడం బాగుంది .
వచ్చీ రాని ఇంగ్లీష్ మాట్లాడే అవారా బైర్రాజుగా సిద్ధార్ద్ బాగా చేసాడు . శ్రేయ గా సమంతా కూడా పాత్రకు న్యాయం చేసింది . అయితే, సమంత పాత్రను మొదట ఓవరాక్టివ్ గా చూపించి, ఆతర్వాత నార్మల్ చేసేశారు .బీహారీ గా సయ్యాజి షిండే , తెలంగాణ శకుంతల పాత్రలు రొటీన్ . డాన్ జావేద్ భాయ్ గా శ్రీహరి పాత్ర కూడా అంతంత మాత్రమే. డాన్స్ మాస్టర్ గా ధర్మవరపు కాస్త నయం. ఇతర పాత్రలు కాశీ విశ్వ నాద్, ఉత్తేజ్, ప్రగతి, తాగు బోతు రమేష్,సురేష్, ధన రాజ్, అర్జున్,వెన్నెల కిషోర్, దువ్వాసి, ప్రిన్స్,వేణు పోషించారు . ఫోటోగ్రఫీ బాగుంది . వెలిగొండ శ్రీనివాస్ మాటలు, రీ రికార్డింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు . సినిమా ప్రారంభం లో హీరోఫై సునీల్ పరిచయ వ్యాఖ్యానం ఇందులో ఇంకో విశేషం -రాజేష్
0 comments:
Post a Comment