RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, May 11, 2012

'గబ్బర్ సింగ్' చిత్ర సమీక్ష

'గబ్బర్ సింగ్' చిత్ర సమీక్ష                    3/5

పరమేశ్వర ఆర్ట్ ప్రోడక్షన్స్ పతాకం ఫై హరీష్ శంకర్ దర్శకత్వం లో గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

తనకు తగిన ఆదరణ లేకపోవడం తో చిన్నతనం లోనే  ఇల్లువదిలి పోయిన హీరో కు 'షోలే' గబ్బర్ సింగ్  విలనిజం అంటే ఇష్టం . ఆ పేరునే పెట్టుకుని పోలీసు అధికారి గా మారి తన వూరు కొండవీడు కి బదిలీ అయ్యి వస్తాడు. అక్కడ జనాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్న సిద్దప్ప నాయుడు  ను అడ్డుకుని ప్రజల్లో మంచిపేరు తెచ్చుకుంటాడు. తాగు బోతు కూతురు భాగ్య లక్ష్మి ఫై మనసు పడతాడు.రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మల్యే అవ్వాలనుకున్న , తమ దారికి అడ్డుపడుతున్న గబ్బర్ సింగ్ ను తప్పించడానికి సిద్దప్ప చేసే ప్రయత్నాలను ఎదుర్కుంటూ ...భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకున్న గబ్బర్ సింగ్ తన కుటుంభాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్న అభిమన్యుని ఎలా మట్టు పెట్టాడనేదే ఈ చిత్ర కధాంశం.

మొదట 'షాక్' తిన్నా ...రవితేజ  'మిరపకాయ్' ,ఇప్పుడు పవన్ కళ్యాణ్  'గబ్బర్ సింగ్'తో హీరో ల ఇమేజ్ తో మ్యాజిక్ చెయ్యడం లో  హరీష్ శంకర్ విజయవంతమయ్యాడు. హిందీ లో  విజయం సాధించిన 'దబాంగ్' కు మన నేటివిటీ కి తగిన మార్పులు చేసి తీసిన ఈ చిత్రం పూర్తిగా మాస్ ...పరమ మాస్ చిత్రం. పూర్తిగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఫై నే  ఆధార పడి చేసిన చిత్రం. పోలీసు స్టేషన్ కే తన పేరు పెట్టుకున్న  గబ్బర్ సింగ్ వ్యవహార శైలి ...చూస్తే మనకు మహా అసహజత్వం కనిపిస్తుంది.  అటువంటివి ఏమీ ఆలోచించ కుండా చూస్తూ పోతేనే ఈ చిత్రం లో వినోదం దొరుకుతుంది . గబ్బర్ సింగ్ గ్రామస్థులతో పరిచయ సన్నివేశం, రౌడీ తో కబాడీ ఫైట్, హస్త కళా ప్రదర్శన ప్రారంభం లో చెప్పుల ప్రహసనం, కోట మందు పాట, గబ్బర్ భారీ  కట్ అవుట్ తో బ్రహ్మానందం హడావుడి, పెళ్లి చూపులకు వెళ్ళి వచ్చే సన్నివేశాలు,పోలీసు స్టేషన్ లో రౌడీలతో అంత్యాక్షరి... మంచి వినోదాన్ని అందించాయి.అయితే ఈ రౌడీల అంత్యాక్షరి మరీ అంత మొరటుగా కాకుండా చేసుంటే  బాగుండేది. తల్లి, సవతి తండ్రి, తమ్ముళ్ళ  తో చేసినసన్నివేశాలు తక్కువే అయినా, పండాయి.  హీరోతో తల పడిన ప్రతినాయకుడి ఎత్తుగడలన్నీ  మరీ పాతకాలం నాటివి.  క్యారెక్టరైజేషణ్ లో విలన్ ని ఇంకాస్త బలం గా చూపాల్సింది. అలాగే  క్లైమాక్స్ కూడా షార్ట్ కట్ లో        తేల్చేసి నట్లనిపిస్తుంది. హరీష్ రాసిన  సంభాషణలు ఈవినోదాత్మక చిత్రానికి పెద్ద అసెట్ అయ్యాయి.

ప్రజలకి మంచి చేసే' తిక్క' పోలీసు అధికారిగా 'లెక్క' తప్పకుండా,  తన సహజ శైలి లో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను,అభిమానులను విశేషం గా ఆకట్టుకున్నాడు. భాగ్య లక్ష్మి గా శృతి హసన్ ఎంపిక ఈ చిత్రం లో పెద్ద మైనస్. గ్రామీణ వాతావరణానికి ఏ మాత్రం సరిపడని గెటప్ తో శ్రుతిని ఓ బొమ్మలా చూపించారు. ఆమెకి చెప్పించిన డబ్బింగ్ ఇంకా ఇబ్బంది పెట్టింది. సిద్దప్పగా అభిమన్యు సింగ్ బాగా చేసాడు.  చిన్న గబ్బర్ సింగ్ గా  పూరి జగన్నాద్ కొడుకు ఆకాష్ నటించిన ఈ చిత్రం లో తనికెళ్ళ భరణి,నాగినీడు,సుహాసిని,రావు రమేష్,గాయత్రి రావు,అజయ్, కోటఇతర పాత్రలు పోషించారు. పోలీసు సాంబ గా అలీ, రికవరీ రంజిత్ కుమార్ గా బ్రహ్మానందంతో పాటు సిద్దప్ప గ్యాంగ్ లో రౌడీ లు అంతా  మంచి కామెడీ చేసారు. 'దబాంగ్' లో చేసిన మలైకాఅరోరా ఇందులోనూ ' కెవ్వు కేక' అంటూ ఐటెం సాంగ్ చేసింది. ఒకటి రెండు పాత ట్యూన్స్ ఉన్నావాటిని  చక్కగా మిక్స్  చేసి , పాటలు హిట్ చేసి దేవి శ్రీ ప్రసాద్ సినిమా  విజయానికి దోహదం చేసాడు. ప్రత్యేకం గా 'ఆకాశం అమ్మయితే' పాటను చెప్పుకోవాలి .  పాటల చిత్రీకరణ తో పాటు , జయనన్ విన్సెంట్ ఫోటో గ్రఫీ, రాం-లక్ష్మణ్ యాక్షన్, గౌతం రాజు ఎడిటింగ్ బాగున్నాయి.                                                                                                                                                                                                                                                      -రాజేష్

0 comments:

Post a Comment