RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Thursday, November 29, 2012

‘చేపలమ్మా.. చేపలు’ పాట నెట్‌లో హల్‌చల్

గంగ్నమ్ స్టైల్ అయిపోయింది. ఇప్పుడు ‘చేపలమ్మా.. చేపలు’ పాట నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. బ్రిటన్‌కు చెందిన పాకిస్థానీ మహమూద్ షాహిద్ నజీర్(31) పాడిన ఈ పాటను యూట్యూబ్‌లో ఇప్పటికే 36 లక్షల మంది వీక్షించారు. లండన్‌లోని అప్టన్ పార్క్ క్వీన్స్ మార్కెట్లో చేపలు అమ్మే నజీర్ వినియోగదారులను అకర్షించడానికి.. ‘కమాన్ లేడీస్.. కమాన్ లేడీస్.. హావ్ ఎ లుక్.. వన్ పౌండ్ ఫిష్.. వెరీవెరీ గుడ్.. వెరీవెరీ చీప్’ అంటూ పాడిన ఈ పాట అందరినీ ఎంతో ఆకర్షిస్తోందని, ఈ క్రిస్‌మస్‌కు నంబర్ వన్ పాటగా నిలుస్తుందని ‘సన్’ పత్రిక తెలిపింది. యూట్యూబ్‌లో నజీర్ ఉంచిన ఈ పాట ఇప్పుడు అతడికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఏకంగా వార్నర్ మ్యూజిక్ సంస్థ దృష్టి అతడిపై పడేలా చేసింది. ఈ పాట కూడా దక్షిణ కొరియా పాప్ గాయకుడు సై పాడిన గంగ్నమ్ తరహాలో పెద్ద హిట్ అవడం ఖాయమని వార్నర్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే హాలీవుడ్ ప్రముఖులు అలేషా డిక్సన్, యూఎస్ బాయ్స్ బ్యాండ్ మైండ్‌లెస్ బిహేవియర్, రియో ఫెర్నినాండ్ వంటివారు ఈ పాటకు ఫిదా అయిపోయారు. క్వీన్స్ మార్కెట్లో నజీర్ ఈ పాట పాడటం మొదలుపెడితే చాలు.. జనం గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చేస్తారట. కొందరైతే.. తన పాట కోసమే.. ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, ఐరోపా నుంచి వస్తున్నారని నజీర్ చెప్పాడు. సంపాదన కోసం పాకిస్థాన్‌కు చెందిన నజీర్ ఏడాది క్రితం లండన్‌కు వచ్చాడు. ఆయన భార్య, నలుగురు పిల్లలూ పాకిస్థాన్‌లోనే ఉంటారు. ఈ ఉద్యోగంలో చేరిన మొదటి రోజే.. నజీర్ యజమాని వినియోగదారులను ఆకర్షించడానికి బిగ్గరగా అరవమని చెప్పాడు. అయితే, అలా అరవడం ఇష్టం లేని నజీర్.. ఈ పాటను పాడటం మొదలెట్టారు. వినియోగదారులకు ఈ పాట నచ్చడంతో.. నువ్వు పాప్ స్టార్ అవ్వాలి. నువ్వు ఎక్స్‌ఫ్యాక్టర్ షోలో పాల్గొనాలి అని వారు చెప్పారు. అయితే, ఎక్స్‌ఫ్యాక్టర్ షోలో ఇతడి పాటను తిరస్కరించారు. అయితేనేం.. ఇప్పుడు అంతకు మించి పెద్ద పాప్ స్టార్‌గా నజీర్ మారిపోయాడు. ఇప్పుడు అతడితో ఒప్పందం కుదుర్చుకున్న వార్నర్ మ్యూజిక్.. ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన గీతం కోసం ఎక్స్‌ఫ్యాక్టర్ విజేత పాటకు పోటీగా నజీర్ ‘వన్ పౌండ్ ఫిష్’ పాటను దించనుంది.

0 comments:

Post a Comment