RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Wednesday, November 21, 2012

గోవాలో సినిమా పండుగ ప్రారంభం

గోవా నగరం అందంగా ముస్తాబైంది. ఈ సందడంతా నేడు ప్రారంభం అవుతున్న 43వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల కోసమే. ఈ నెల 30వరకు జరిగే ఈ చిత్రోత్సవాల్లో పలు భారతీయ భాషలకు చెందిన 200 సినిమాలను ప్రదర్శించనున్నారు. ఆస్కార్ అవార్డ్‌గ్రహీత ఆంగ్ లీ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం ‘లైఫ్ ఆఫ్ పై’ని ప్రారంభ చిత్రంగా ప్రదర్శించబోతున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ అతిథిగా పాల్గొనబోతున్నారు. ముగింపు చిత్రంగా మీరానాయర్ రూపొందించిన ‘ది రిలక్టంట్ ఫండమెంటలిస్ట్’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
కాగా, ఇండియన్ పనోరమా విభాగంలో ఒక్క తెలుగు చిత్రం కూడా ఎంపిక కాకపోవడం గమనార్హం. దాదాపు వంద, ఆపై చిలుకు సినిమాలు నిర్మితమవుతున్న టాలీవుడ్ నుంచి కేవలం తొమ్మిదే సినిమాలు కమిటీ ముందుకు వెళ్లాయి. వాటిలో ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, మా ఊరి జోగిని, మల్లెల తీరం, ఓంకారం, వీరంగం’ లాంటి చిత్రాలు ఉన్నాయి. అయితే ఒక్క చిత్రం కూడా ప్రదర్శనకు అర్హత పొందలేకపోయింది. గత ఏడాది తెలుగు పరిశ్రమ నుంచి ‘విరోధి’ చిత్రం ప్రదర్శితమైంది. ఈ ఏడాది కనీసం ఆ ఊరట కూడా లేదు. ఇక ఇతర భాషల్లో విషయానికి వస్తే... మలయాళ పరిశ్రమ నుంచి దాదాపు 30 సినిమాలు వెళ్లగా, వాటిలో అయిదు సినిమాలు ప్రదర్శనకు అర్హత పొందడం విశేషం. ఇంకా ఒక తమిళ చిత్రం, బెంగాలీవి మూడు చిత్రాలు, భోజ్‌పురి నుంచి ఒక చిత్రం, ఒక కొంకణి చిత్రం, ఓ అస్సామీ చిత్రం, బ్యారీ భాషకు చెందిన సినిమా... ఇలా పలు భాషలకు చెందిన చిత్రాలు ప్రదర్శితం కాబోతున్నాయి.
మన తెలుగు పరిశ్రమతో పోల్చితే ఈ భాషలన్నింటిలోనూ తక్కువ సంఖ్యలో సినిమాలు రూపొందుతాయి. అయినా చిత్రోత్సవాల్లో పోటీపడటం అభినందించదగ్గ విషయం. తెలుగు పరిశ్రమ నుంచి సినిమాలు ప్రదర్శనలకు ఎంపిక కాకపోవడం అనేది ఆలోచించదగ్గ విషయం. ఇదిలా ఉంటే... భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి ప్రత్యేకంగా ఓ అవార్డును ప్రవేశపెట్టారు. ప్రత్యేక జ్యూరీ ఎంపిక చేసే చిత్రానికి ‘సెంటినరీ ఫిల్మ్ అవార్డ్’ను అందజేస్తారు. ఈ అవార్డులో భాగంగా 10 లక్షల రూపాయలు నగదు బహుమతి అందజేయబోతున్నారు.

0 comments:

Post a Comment