'డమరుకం' చిత్ర సమీక్ష 2.5/5
దేవతలు,రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధం లో అందరూ మరణించినా అంధకాసురుడు అనే రాక్షసుడు మాత్రం ప్రాణాలతో మిగిలి ఉంటాడు . పంచగ్రహ కూటమి రోజున పుట్టిన అమ్మాయిని పెళ్ళిచేసుకుని, వధిస్తే లోకాన్ని శాసించే శక్తి మంతుడవుతానని తెలిసి ...మహేశ్వరిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు.అందుకు అడ్డు పడనని శివుడి నుండి మాట తీసుకుంటాడు.అయితే ,శివ భక్తుడిగా ఉంటూ,తన వారినందరినీ పోగొట్టుకుని శివ ద్వేషి గా మారిన మల్లికార్జున్ ని మహేశ్వరి ప్రేమిస్తుంది. మహేశ్వరి మనసు దోచుకోవడానికి అంధకాసురు డు మహేశ్వరి బావ రూపం లో వచ్చి, మల్లికార్జున్ అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తాడు.పరమేశ్వరుడు వీరిలో ఎవరికి సహకరిస్తాడు?చివరికి ఎవరు గెలుస్తారు?అనేది సినిమాలో చూడాలి...
సోషియో ఫాంటసీ కధాంశం తో, గ్రాఫిక్స్ ప్రధానంగా వచ్చిన చిత్రాల కోవలో వచ్చిన మరో చిత్రం ఈ 'డమరుకం' . ఈ మధ్యనే వచ్చిన' శక్తి', 'భద్రీనాద్' పెద్ద ఫ్లాప్ అయ్యాయి.వాటంత హింసించక పోయినా- 'డమరుకం' కూడా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టిన చిత్రమే. కామెడీ చిత్రాల దర్శకుడిగా మంచిపేరు సంపాయించిన శ్రీనివాస్ రెడ్డి తన స్టైల్ కి పూర్తి భిన్నమైన కధతో, భారీ బడ్జెట్ తో చేసిన చిత్రం ఇది.వచ్చిన ఈ బంపర్ ఆఫర్ ను శ్రీనివాస్ రెడ్డి సద్వినియోగ పర్చుకోలేకపోయాడనే చెప్పాలి. ఇటీవల భారీ చిత్రాలు చేసిన మన దర్శకులు చాలా మంది... నిర్మాతలను,హీరోలను మేనేజ్ చేసినంత బాగా, సబ్జెక్ట్ ని చెయ్యలేక పోతున్నారు.అందుకే పరిశ్రమ భారీ పరాజయాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.దేవుళ్ళతో కూడిన సోషియో ఫాంటసీ అనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో అటువంటిది ఏదీ కనబడదు. కనీసపు రీజనింగ్ లేకుండా,పరమ రొటీన్ గా , కేవలం గ్రాఫిక్స్ మాయాజాలం ఫై ఆధార పడి ఈ చిత్రం చేసారు.నిజానికి, ఇందులో చాలా సన్నివేశాల్లో గ్రాఫిక్స్ ప్రే క్షకులను మంత్ర ముగ్దులను చేస్తాయి .అయితే, బలమైన స్క్రీన్ ప్లే ఉన్నప్పుడే గ్రాఫిక్స్ సినిమాకి మరింత బలాన్నిస్తాయనే విషయం వీరు పట్టించుకోలేదు.అందుకే శివుడు సాంబ య్యగా భూలోకంలో తిరిగేస్తూ...బ్రహ్మానందం వంటి చిన్న పాత్రకు కూడా ప్రత్యక్షమైపోయి అన్నివిషయాలూ చెప్పేస్తుంటాడు.మల్లికార్జున్, మహేశ్వరి లకూ దైవానుగ్రహం వుందని చెప్తారు తప్ప ,అవి వారికి ఉపయోగ పడటం కనిపించదు.అంధకాసురుడు నిజంగా బలవంతుడా...కాదా అన్నంత అనుమానాస్పదం గా ప్రవర్తిస్తుంటాడు.క్లైమాక్స్ లో విలన్ దెబ్బకి హీరో ఆకాశం లోకి వెళ్లి అక్కడ శివ సాక్షాత్కారం పొంది కిందికి రావడం వంటివి తమాషాగా వున్నాయి.విలన్ శివభక్తుడు...హీరో శివ ద్వేషి కావడం ప్రత్యేకతను సంతరించుకున్నప్పటికీ, కధా క్రమంలో దాన్ని నిలుపుకోలేకపోయారు. నంది,బ్రహ్మ రాక్షసుడు వంటి గ్రాఫిక్స్ పేలవంగా వుంటే..అతి ముఖ్యమైన క్లైమాక్స్ లో డి .టి .యస్ సౌండ్ మిస్ కావడం పెద్ద మైనస్ .కామెడి లో సిద్ధహస్తుడైన శ్రీనివాస్ రెడ్డి ఇందులో కామెడి సన్నివేశాలను కొత్తగా చూపించలేక పోయాడు.
కధా నాయకుడిగా నాగార్జున నటన,దేవిశ్రీ ప్రసాద్ సంగీతం,చోటా ఫోటోగ్రఫీ ఈ చిత్రం లో హైలై ట్స్ .సినిమా అంతా భారీ నిర్మాణ విలువలు కనిపిస్తాయి.నాగార్జున సిక్స్ పాక్ బాడీ తో చాలా హుషారుగా తన పాత్రను పోషించారు.కొత్తదనం లేని ప్రధాన పాత్రను అనూష్క అందం గా పోషించింది.'బొమ్మాళీ ' అంటూతన గొంతుతో 'అరుందతి' లోఅలజడి సృష్టించిన రవిశంకర్ ఇందులో అంధకాసురుడుగా తననటనతో,గొంతుతో పాత్రకు జీవం పోసాడు. ప్రకాష్ రాజ్ ను శివుడుగా చూపడంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది.అనుష్క బావగా గణేష్ వెంకట్రామన్ బాగాచేసాడు.ఇతర పాత్రల్లో జీవా,బ్రహ్మానందం,కృష్ణ భగవాన్,రఘుబాబు,ఎమ్మెస్ నారాయణ,దేవన్, ప్రగతి, అభినయ నటించారు.శ్రీనివాస్ రెడ్డి సంభాషణలు చాలా సన్నివేశాల్లో బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ప్రేక్షకులను అలరించాయి.నేపధ్య సంగీతం కూడా బాగుంది.'కన్యా కుమారీ' పాట హుషారుగా ...'ప్రాణమా' అందంగా లలితంగా...'శివ శివ శంకర' భక్తి రసాత్మకంగా భారీగా చిత్రీకరించారు.చార్మి ఫై చేసిన 'గరం గరం చాయ్' మంచి మసాలా పాట .మొత్తం సినిమాని చోటా .కే.నాయుడు కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. గౌతం రాజు ఎడిటింగ్ గొప్పతనం కూడా అంతటా కనిపిస్తుంది. -రాజేష్
0 comments:
Post a Comment