'1'(నేనొక్కడినే ) సినిమా సమీక్ష
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ - ఇరోస్ ఇంటర్నేషనల్ పతాకం ఫై సుకుమార్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు .
ప్రసిద్ధ ' రాక్ స్టార్' గౌతమ్ కలలతో బాధ పడుతుంటాడు . చిన్న తనంలో తల్లి దండ్రులను ముగ్గురు వ్యక్తులు చంపేసి, తనని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు అతను ఊహించుకుంటుంటాడు . అతని పరిస్థితిని చూసి సహాయకారిగా చేరువవుతుంది సమీర అనే టి .వి .ఛానల్ రిపోర్టర్. తల్లిదండ్రు లెవరు ,తన గతం ఏమిటో? తెలుసుకునే ప్రయత్నంలో నిజమేమిటో భ్రమ ఏమిటో? తెలియని పరిస్థితిని ఎదుర్కొంటాడు గౌతమ్ . తన అన్వేషణ కొనసాగిస్తున్న గౌతమ్ కొత్త విషయాలు తెలుసుకుంటాడు . ఇంతకీ అతని తల్లి దండ్రులు ఎవరు ? వారిని ఎవరు, ఎందుకు చంపారు? గౌతమ్ కలలు యదార్ధమేనా ? అతని అన్వేషణ ఫలించిందా ?అనేది తెర ఫై చూడాలి ....
సుకుమార్ దర్శకుడిగా ఇక రిటైర్ కావచ్చు... అన్నంత గొప్పగా ఈ చిత్రాన్ని తీసాడు . ఒక హాలీవుడ్ చిత్రం చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది . తెలుగు సినిమా దర్శకుల్లో సుకుమార్ విలక్షణమైన వాడు . అతని ఊహా శక్తికి ఈ చిత్రం ఒక గొప్ప అవకాశం ... గొప్ప నిదర్శనం . అయితే ఏ దర్శకుడైనా మొదట గుర్తుంచుకోవాల్సింది ... 'మనం ఏ ప్రేక్షకుల కోసం ఈ చిత్రం చేస్తున్నాం?'అని . ఆ ప్రేక్షకుల అవగాహనా స్థాయిని ఎప్పుడూ దృష్టి లో ఉంచుకోవాలి. అది వదిలేసి తమ మేధా స్థాయి లోనో...హాలీవుడ్ స్థాయి లోనో సిన్మాలు తీసి చిక్కుల్లో పడు తుంటారు కొందరు . సుకుమార్ చేసిన పనికూడా అదే . నేల విడిచి సాము చేసాడు. గొప్ప స్క్రీన్ ప్లే చేశాడు ...కానీ, నిజమేమిటో భ్రమ ఏమిటో?...అంటూ సామాన్య ప్రేక్షకుడిని కన్ఫ్యూజ్ చేసా డు. అందులోనూ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి . సినిమాలో ఎంతో కొంత మసాలాను , కామెడీ ని ఆశించే ప్రేక్షకుడికి మూడు గంటలపాటు సీరియస్ సినిమా చూపించాడు .బోల్డంత బిల్డప్ ఇచ్చిన ఒక విలన్ ని సిల్లీగా (సినిమాటిక్ గా) టాయిలెట్ లో చంపేసాడు. రెగ్యులర్ ఫార్మేట్ లో సినిమా అయిపోయాక (విలన్ ని హీరో చంపేసాక ) కూడా తల్లి దండ్రుల సెంటిమెంట్ తో క్లైమాక్స్ లో సినిమాని సాగదీసాడు .నిజానికి- కొత్తగా ,ఆసక్తికరం గా వున్న ఈ చిత్రం కధని 'ఓకే' చేసిన హీరో , నిర్మాతలు- దర్శకుడు ఇంత క్లాసిక్ గా ...విపులంగా ...నిదానంగా ...అత్యంత భారీగా తీస్తాడని ముందుగా ఊహించి వుండరు . కొంత షూటింగ్ తర్వాత పరిస్థితి అర్ధం అయినా, చేసేదేమీ లేక చేతులెత్తేసి వుంటారు .ఇరోస్ ఇంటర్నేషనల్ వారు ముందుకు రావడం కొంతఊరట కలిగించే విషయమే !
నటుడిగా మహేష్ బాబు చిత్ర చిత్ర ప్రవర్ధమానం అవుతున్నాడు . 'రాక్ స్టార్' గా ... తల్లిదండ్రు లెవరు ,తన గతం ఏమిటో? తెలుసుకోవాలనే గౌతమ్ గా ఆద్యంతం అద్భుతంగా చేసాడు . చొక్కా విప్పి ప్రదర్శించకున్నా, పాత్ర కోసం 6 ప్యాక్ తో ఫిట్నెస్ సంతరించుకున్నాడు . సినిమా అంతా తన ఒక్కడి ఫై నే నడిపించి ' 1'(ఒక్కడినే ) అనే పేరుకు న్యాయం చేసాడు . ఇందులి చిన్న నాటి మహేష్ గా మహేష్ కుమారుడు మాస్టర్ గౌతమ్ కృష్ణ నటించడం ఒక విశేషం .రెగ్యులర్ హీరోయిన్ల బదులు కృతి సనన్ ను ఎంపిక చెయ్యడం కరెక్ట్ నిర్ణయం . ఆమె అందమే ఈ చిత్రం లో ప్రేక్షకులకు కొంతవరకు రిలీఫ్ .అలాగే, పాత్ర పరంగా కృతి బాగా నటించింది కూడా . నాజర్ , ప్రదీప్ రావత్ , కెల్లీ దోర్జీ , పోసాని కృష్ణ మురళి , శ్రీనివాస రెడ్డి , సయ్యాజి షిండే , ఆనంద్ , అను హసన్, బెనర్జీ , విక్రం సింగ్ ఈ చిత్రంలో ఇతర పాత్ర దారులు .
సుకుమార్ ఆనవాయితీ ప్రకారం ఈ చిత్రం లోనూ ఓ స్పెషల్ సాంగ్ పెట్టాడు . ముంబై డాన్సర్ సోఫీ చౌదరి చేసిన ఈ పాట సాహిత్యం సుకుమార్ గత చిత్రాల ఐటెం సాంగ్స్ మూసలోనే సాగింది . దీనికి ప్రేక్షకులు ఏమాత్రం స్పందించలేదు . దేవిశ్రీ ప్రసాద్ పాటలు చెప్పు కోదగ్గవి కాకపోయినా, సినిమా సందర్భానికి తగ్గట్టుగానే వున్నాయి . రీ రికార్డింగ్ మాత్రం అదిరిపోయింది .ధీమ్ మ్యూజిక్ ఈ చిత్రానికి చక్కటి సన్నివేశ బలాన్నిచ్చిం ది . ఎంత మోడ్రన్ ట్యూన్స్ లో అయినా 'తెలుగు మాట' మిస్ కాకపోవడం దేవిశ్రీ గొప్పదనం . రత్న వేలు ఫోటోగ్రఫీ, పీటర్ హైన్స్ థ్రిల్స్ ఈ చిత్రం లో చెప్పుకోదగ్గ హై లైట్స్ . కొన్ని మరీ అతిగా అనిపించినా బోట్ చేజ్ , గన్ మెన్ చేజ్ ,పార్కింగ్ ప్లేస్ ఫైట్ వంటి థ్రిల్స్ మంచి స్థాయి లో వున్నాయి .ఈ చిత్రంలో సంభాషణలు ,కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ,
చంద్ర బోస్ పాటలు, ప్రేమ్ రక్షిత్ డాన్సులు బాగున్నాయి - రాజేష్
# తెలుగు ప్రేక్షకులకు ఓ స్థాయిగల చిత్రాన్ని అందించాలని తపన పడ్డ దర్శకుడు సుకుమార్, హీరో మహేష్ బాబు , నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకరల ఫై గౌరవంతో ఈ చిత్రానికి రేటింగ్ ఇవ్వడం లేదు .
0 comments:
Post a Comment