RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Sunday, January 12, 2014

                                        'ఎవడు' చిత్ర సమీక్ష        3/5
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  పతాకం ఫై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు . 


గత యేడాది  సంక్రాంతి కానుకగా  రామ్ చరణ్  'నాయక్'  వచ్చింది. యాక్షన్ తో పాటు బోలెడంత వినోదాన్నీ పంచిన ఆ సినిమా చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన 'తుఫాన్' అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లోనూ చరణ్ పట్ల ఉన్న సదభిప్రాయన్ని పటాపంచలు చేసేసింది. దాంతో మెగాఫ్యాన్స్ అంతా ఈ సంక్రాంతికి వచ్చిన 'ఎవడు' మీదే ఆశలన్నీ పెట్టుకున్నారు. వారందరినీ రంజింప చేయడంలో 'ఎవడు' సక్సెస్ సాధించాడనే చెప్పాలి.
కథలోకి వెళితే... అల్లు అర్జున్, కాజల్ ప్రేమికులు. గొడవలకు దూరంగా తన ప్రియుడితో జీవితాన్ని గడపాలని కాజల్ భావిస్తుంది. వైజాగ్ లో ఉండే వీరుభాయ్ అనే పెద్ద గుండా దృష్టి కాజల్ మీద పడుతుంది. ఆమెను కోరుకుంటాడు. వాడి అనుచరుల నుండి తప్పించుకుకోవడం కోసం అర్జున్ తో సహా వైజాగ్ నుండి హైదరాబాద్ కు బస్సులో బయలు దేరుతుంది. అయితే మధ్యలోనే వీరుభాయ్ గ్యాంగ్ వీళ్ళిద్దరినీ చంపేస్తారు. అంతేకాదు... బస్ నూ తగలబెట్టేస్తారు. అయితే ఆ ప్రమాదం నుండి కొనఊపిరితో అల్లు అర్జున్ బయటపడతాడు. అతనికి హైదరాబాద్ లో ట్రీట్ మెంట్ జరుగుతుంది. అల్లు అర్జున్ ఫేస్ చాలా వరకూ కాలిపోవడంతో, అదే సమయంలో హత్యకు గురైన తన కొడుకు రామ్ చరణ్ పోలికలు వచ్చేట్టుగా సర్జరీ చేస్తుంది డాక్టరైన జయసుధ. అక్కడ నుండి కథ రకరకాల మలుపులు తిరుగుతుంది... ప్రథమార్ధంలో తన ప్రియురాలిని చంపిన వారిపై పగ తీర్చుకున్న అల్లు అర్జున్ (మనకి కనిపించేది మాత్రం రామ్ చరణే) ద్వితీయార్థంలో రామ్ చరణ్ హత్యకు కారకులైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ.
నిజానికి ఈ కథను తెరకెక్కించడం కత్తి మీద సాము అనే చెప్పాలి. అయితే దర్శకుడు వంశీ పైడిపల్లి మీద ఉన్న నమ్మకంతో దిల్ రాజు అందుకు సిద్ధపడ్డాడు. ప్రేక్షకులు ఏ విధమైన కన్ ఫ్యూజన్ కూ  లోను కాకుండా... అల్లు అర్జున్, రామ్ చరణ్ పాత్రలను చాలా క్లారిటీతో దర్శకుడు సిల్వర్ స్ర్కీన్ మీద ప్రెజెంట్ చేశాడు. ఎలాంటి అనవసరమైన ఫ్లాష్ బ్యాక్ లు లేకుండా స్రైయిట్  గా స్టోరీని నడిపేశాడు. అదే ఒకరకం గా సినిమా సక్సెస్ కు కారణమైంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీలో కాస్త రిలీఫ్ అన్నట్టుగా అప్పుడప్పుడు పాటలు వచ్చిపోతుంటాయి. నిజానికి వాటికి అంత ప్రాధాన్యం కూడా లేదు. తెలుగు సినిమా అన్న తర్వాత ఐదారు పాటలు ఉండాలి కాబట్టి పెట్టినట్టుగా ఉన్నాయి.
నటీనటుల విషయానికి వస్తే.. రామ్ చరణ్ నటనలో కొత్తదనం ఏమీ కనిపించదు. అదే నటన... పాటల్లోనూ అదే ఎనర్జీ. అల్లు అర్జున్ ఉన్నది కాసేపే అయినా యాక్షన్ లో కానీ, ఎమోషన్స్ లో కానీ తన మార్కు చూపించాడు. హీరోయిన్లు శ్రుతి హాసన్, అమీ జాక్సన్ కంటే.. కొద్దిసేపే కనిపించినా కాజల్ బాగా నటించింది. అలానే ఆమె మీద చిత్రీకరించిన పాటా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలన్నీ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. వాటి చిత్రీకరణ కూడా ఓకేనే. ఐటమ్ సాంగ్ లిరిక్స్ ను దృష్టిలో పెట్టుకుని లోకల్ ఆర్టిస్టులతో తీసి ఉండాల్సింది, కనీసం ఇండియన్స్ తో! కథపరంగా ఏ అవసరం లేకపోయినా అమీ జాక్సన్ లాంటి ఫారిన్ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్న దర్శక నిర్మాతలు ఐటమ్ సాంగ్ కు ప్రాధాన్యం ఇస్తారనుకోవడం అత్యాసే!
ఇది రెండు రివెంజ్ లు మిళితమైన కథ కాబట్టి సహజంగానే విలన్స్ చాలామందే ఉన్నారు. సాయికుమార్, కోట, అజయ్, సుబ్బరాజు, రాహుల్ దేవ్, సుప్రీత్ ఇలా వాళ్ళ లిస్టు పెద్దదే ఉంది. రామ్ చరణ్ స్నేహితులుగా శశాంక్, 'కేక' మూవీతో హీరోగా  పరిచయం అయిన సీతారామశాస్త్రి కుమారుడు రాజా నటించారు. ఇద్దరి పాత్రలూ ప్రాధాన్యం ఉన్నవే. బ్రహ్మనందం కామెడీని, ఎల్.బి. శ్రీరామ్ ఎమోషన్స్ ను అందించే ప్రయత్నం చేశారు కానీ, ఆకట్టుకోలేకపోయారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో పోలీసు వ్యవస్థ అనేది ఒకటి ఉందని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ కు వచ్చేసరికీ దానిని పూర్తిగా విస్మరించాడు. పొలిటీషియన్లు, గూండాల చేతనే  ప్రభుత్వం నడుస్తున్నటుగా చూపించాడు. ఎంత వద్దనుకున్నా సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలను ఒకదానితో ఒకటి పోల్చి చూసుకోవడం సహజం. ఆ రకంగా రెండు రోజుల ముందొచ్చిన 'వన్' కంటే 'ఎవడు' బెటర్ మూవీ అనే భావన సగటు ప్రేక్షకుడిలో కలిగింది. అందువల్లే ఈ సినిమా హిట్ నుండి       సూపర్ హిట్ దిశగా సాగే అవకాశం కనిపిస్తోంది. పండగ సెలవలు పూర్తయితే కానీ 'ఎవడు' రేంజ్ ఏమిటనేది చెప్పలేం!               -ఓం ప్రకాష్ వడ్డి 

0 comments:

Post a Comment