'అత్తారింటికి దారేది' చిత్ర సమీక్ష 3.75/5
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం ఫై రిలయన్స్ వారి సమర్పణలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన,దర్శకత్వంలో బి .వి .ఎస్ .యన్ .ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు .
ఇటలీలోని మిలాన్ లో రఘు నందా పెద్ద బిజినెస్ మెన్. ఆయన మనవడే గౌతమ్ నందా. 'ఆరడుగుల బుల్లెట్' లా తాతకు అన్నివేళలా గౌతమ్ అండగా ఉంటాడు. రఘు నందాకు ఒక చివరికోరిక వుంటుంది. తనకు ఇష్టంలేకుండా వేరొకరిని పెళ్లిచేసుకుందన్న కోపంతో తన కూతురు సునంద ను ఇల్లు వదిలి పొమ్మన్నానని అనుక్షణం బాధపడుతూ వుంటాడు. తను చనిపోయేలోపు కన్న కూతురుని కళ్ళారా చూడాలనివుందని అడగితే- తాత కోరిక నెరవేర్చడానికి హైదరాబాద్ కు చేరుకుంటాడుగౌతమ్. సునంద ఇంట్లో సిద్దార్థ్ పేరుతో కారు డ్రైవర్ గా పనికి కుదురుతాడు.అలా వచ్చిన గౌతంకు తన మరదళ్ళు అయిన శశి, ప్రమీల లతో ఎలాంటి ప్రేమ బంధం ఏర్పడింది? తండ్రి అంటే మండి పడుతున్న సునందలో మార్పు తీసుకురావడానికి , తాత కోరికను తీర్చడానికి గౌతమ్ ఏం చేసాడనేది సినిమాలో చూడాలి ...
కనుల పండువగా వుండే భారీసినిమాలు కరువై
అవురావురుమంటున్న తెలుగు ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టే సినిమా ‘అత్తారింటికి దారేది’. పవన్ కళ్యాణ్ హీరో ఇమేజ్ కి , త్రివిక్రమ్ జనరంజక రచనా - దర్శకత్వ ప్రతిభ కలిసి...కమర్షియల్, ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ అంశాలు మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి వినోదాన్ని అందిస్తుంది .
పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కు సరిగా సరిపోయే విధంగా గౌతమ్ నందా పాత్ర ను దర్శకుడు త్రివిక్రమ్ చక్కగా తీర్చిదిద్దాడు. గౌతమ్ పాత్ర లో ఉండే ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్, బుల్లెట్ లా పేలే డైలాగ్స్ పవన్ కళ్యాణ్ అభిమానులకు విశేషంగా ఆనందింపజేస్తాయి. పవన్ కళ్యాణ్ తో 'చూడు 'సిద్దప్ప నేను సింహం లాంటి వాడిని...', సింహం నిద్ర పోతుంటే జూలుతో జడవేయ్యోద్దు..పులి పలకరించిందని పక్కనే నిలుచుని ఫోటోకు ఫోజివ్వద్దు' వంటి త్రివిక్రమ్ కలం నుంచి అలాంటి మార్కు ఉన్న డైలాగ్స్ ఈ చిత్రంలో చాలా వున్నాయి . త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కు పవన్ కళ్యాణ్ మరింత పవర్ యాడ్ చేసి అభిమానులకు వంద శాతం సంతృస్తిని కలిగించాడు. అయితే కథలో కొత్తదనం లేకపోవడం...స్క్రీన్ ప్లే వేగంగా,పట్టుగా లేకపోవడం కొంత నిరాశను కలిగించినా.. త్రివిక్రమ్ మార్క్ కథనం, పవన్ పెర్ఫార్మెన్స్ ఆడియెన్స్ ఆ ఇబ్బందిని మర్చి పోయేలా చేసాయి . అలాగే రచయితగా త్రివిక్రమ్ ప్రాసకోసం,పంచ్ ల కోసం ఒక్కోసారి సందర్భ ఔచిత్యాన్నిమర్చిపోవడం కనిపిస్తుంది . సినిమా ద్వితీయార్ధంలో బ్రహ్మనందం చేసిన 'అహల్య' ఎపిసోడ్, పవన్ కళ్యాణ్ బాబా ఎపిసోడ్ ప్రేక్షకులను అభిమానులకుతప్ప...మిగతా ప్రేక్షకులకు బాగా ఇబ్బంది పెట్టాయి . ఇక రైల్వే స్టేషన్ లో క్లైమాక్స్ సీన్ చిత్రానికి హైలెట్. క్లైమాక్స్ లో దర్శకుడు త్రివిక్రమ్ టేకింగ్, పవన్ కళ్యాణ్ నటన చిత్రం స్థాయిని పెంచాయి .
రఘునందా గా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ తనదైన శైలిలోచక్కగా నటించాడు.'మిర్చి' చిత్రం ద్వారా టాలీవుడ్ లో రీఎంట్రి ఇచ్చిన నదియా సునందగా ప్రధాన పాత్రలో ఆకట్టుకున్నారు. శశిగా సమంత, ప్రణీతలు గ్లామర్ తో ఆలరించారు. పోసాని సన్నివేశాలు కూడా బాగున్నాయి . ఇతర పాత్రల్లో మోహన్ రుషి , రావు రమేష్ ,అలీ , ఎమ్మెస్ నారాయణ , రఘుబాబు , కోట , డా" భరత్, కాదంబరి కిరణ్ , పృథ్వి , ప్రదీప్ నటించారు .
దేవి శ్రీ ప్రసాద్ఈ చిత్రానికి అందించిన ఆడియో ఇప్పటికే శ్రోతలను అలరిస్తోంది . రామజోగయ్య శాస్త్రి రాసిన 'కిర్రాక్', 'దేవ దేవం', 'బాపు గారి బొమ్మ', 'టైమ్ టూ పార్టీ' పాటలతోపాటు, దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా రాసిన 'నిన్ను చూడగానే', శ్రీమణి రాసిన 'ఆరడుగుల బుల్లెట్'తోపాటు 'కాటమ రాయుడా' అంటూ పవన్ పాడిన పాటకు అనూహ్య స్పందన లభించింది. ఆడియోకు ధీటుగా పాటల చిత్రీకరణ కూడా వుండటం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ . పీటర్ హైన్స్ వెరైటీ ఫైట్స్ అందించారు . ప్రసాద్ మూరెళ్ల తన ఫోటోగ్రఫీ తో యూరప్ అందాలను చక్కగా చూపడమే కాకుండా,కీలక సన్నివేశాల చిత్రీకరణకు జీవం పోశారు.ఒక పాటలో దేవిశ్రీ ప్రసాద్ , మరోపాటలో ముంతాజ్, హంసనందిని కనిపించడం విశేషం -రాజేష్
0 comments:
Post a Comment