అంతర్జాతీయ సినిమాకు కొన్ని ప్రమాణాలుంటాయనీ, మనకి పాటలు, డాన్సులు, ఫైట్లు, మెలోడ్రామాలు కావాలనీ, అలాంటప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో మన సినిమాలకి ఎలా పేరొస్తుందని సుప్రసిద్ధ నటులు అక్కినేని నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ ఎడిషన్ ఎడిటర్ జగన్.. కాన్స్ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించిన 15 సినిమాల కథలతో రాసిన 'ది టేస్ట్ ఆఫ్ మనీ' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తొలి ప్రతిని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు అందజేశారు.
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కాన్స్ సినిమా మీద రాసినట్లే భారతీయ సినిమా గురించి కూడా జగన్ పుస్తకం రాయాలని కె.శ్రీనివాస్ ఆకాంక్షించారు. కొన్ని ప్రమాణాలు పాటిస్తే, సరిగ్గా చెప్పగలిగితే చిన్న కథతోటే మన సినిమాని కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లవచ్చనే సంగతిని ఈ పుస్తకంలో తెలియజేశానని రచయిత జగన్ చెప్పారు. ఈ పుస్తకాన్ని తన మాతృమూర్తికి అంకితమిచ్చారు. ఆమెను అక్కినేని చేతుల మీదుగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రసాద్ గ్రూప్స్ అధినేత ఎ.రమేశ్ ప్రసాద్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, నటుడు, రచయిత తనికెళ్ల భరణి, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment