RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Saturday, December 1, 2012

'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్ర సమీక్ష


 'కృష్ణం వందే జగద్గురుమ్'  చిత్ర సమీక్ష  3.5/5


ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం ఫై రాధా కృష్ణ (క్రిష్ ) దర్శకత్వంలో  సాయిబాబు జాగర్లమూడి , వై.రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 

బి.టెక్ చేసిన  సురభి నాటక సంస్థ కళాకారుడు బాబు ఈ రంగం లో ఏ ఉపయోగం ఉండదని ,ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటాడు.తాత సురభి సుబ్రహ్మణ్యం  చెప్పినా  వినడు.ఆ బాధతో అతను చని పోతాడు.తాత కోరిక ప్రకారం  అస్థికలు అతని స్వగ్రామం బళ్ళారి చెరువులో నిమజ్జనం చేసి,అతను రాసిన 'కృష్ణం వందే జగద్గురుమ్' నాటకాన్ని అక్కడ ప్రదర్శించి, అమెరికా వెళ్లి పోవాలని బాబు తన నాటక బృందం తో వెళ్తాడు.అక్కడ అక్రమ ల్యాండ్ మైనింగ్ చేస్తూ స్వంత సామ్రాజ్యాన్ని నడుపుతున్న రెడ్డప్ప మనుషుల దౌర్జన్యానికి గురవుతారు.వారిని ప్రతిఘటిస్తున్న బాబు కు -రెడ్డప్ప అక్రమాలను బయటపెట్టేందుకు ఆధారాలు సేకరిస్తున్న మీడియా ప్రతినిధి దేవిక కలుస్తుంది.అనాధ అయిన  బాబుకు, అనుకోని విధంగా తన కుటుంబ విషయాలు తెలుస్తాయి.తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రయత్నం లో బాబు ఎంతవరకు సఫమయ్యాడనేది  సినిమాలో చూడాలి...

చిత్త శుద్ధి ...డొక్క శుద్ధి వున్న దర్శకులు మన తెలుగు సినిమా రంగంలో అతి తక్కువగా వుండటం  వల్లనే మన చిత్రాల స్థాయి దయనీయంగా ఉంటుందనేది విచారించదగ్గ వాత్సవం. ఇటీవల వికసిస్తున్న కొత్తతరం మంచి దర్శకుల్లో రాధా కృష్ణ ఒకరు.సమాజం గురించీ ...మనిషి గురించీ అధ్యయనం చేసి, తాత్వికత మేళవించి సినిమాలు చేసి -ప్రేక్షకులను మెప్పించడం తేలికైన విషయం కాదు.'గమ్యం','వేదం' అందించి అభినందనలు అందుకున్న రాధాకృష్ణ ,మన కోసం మనం కాదు ...మంది కోసం బతకడం లోనే జీవిత సాఫల్యం వుందని చెబుతూ-ప్రేక్షకులను స్పందింప జేస్తూ  'కృష్ణం వందే జగద్గురుమ్'ను మంచి అనుభూతి మిగిల్చే సినిమాగా మలిచారు.రెగ్యులర్ సినిమాలో వుండే ఐటమ్ సాంగ్స్,ఫైట్స్ ,ట్విస్ట్ లు ఉన్నప్పటికీ 'ఆత్మ'ని కోల్పోకుండా సినిమాని నడిపించడమే ఈ దర్శకుడిలో గొప్పదనం.సురభి నాటక సమాజాన్ని సినిమాలో ప్రముఖంగా చూపడం అభినందనీయం.  సినిమా మొదటి భాగం చూసి ...అద్భుతమైన తెలుగు సినిమా చూసిన ఆనందాన్ని పొందే ప్రేక్షకుడు- రెండవ భాగం లో హీరో ఫ్లాష్ బ్యాక్ ద్వారా మేనమామ ఫై పగ సాధిస్తానంటూ తిరగడం ఇబ్బందినే కలిగిస్తుంది.అలాగే ఆంధ్ర-కర్నాటక సరిహద్దు  బళ్లారి లో కధ జరగడం తో- సహజత్వం కోసం పెట్టిన కన్నడ సంభాషణలు సగటు ప్రేక్షకుడుకి కొరుకుడు పడవు.అయితే, ఒక మంచి సినిమాలో ఇటువంటివి ప్రేక్షకుడు పట్టించుకోడు.దర్శకుడి పనితనంతో పాటు ఈ చిత్రంలో సిరివెన్నెల సాహిత్యం, సాయి  మాధవ్ సంభాషణలు,జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫీ,మణి శర్మ సంగీతం  హైలైట్స్ .సినిమాలోప్రధానంగా తీసుకున్న  అక్రమ  మైనింగ్ అంశం ... సిరివెన్నెల' పాట 'జరుగుతున్నది జగన్నాటకం'  ప్రస్తుత  అరాచకీయాన్ని కళ్ళకు కడతాయి.దర్శకుడి మార్గ దర్సకత్వంలో సాయి మాధవ్ బుర్రా రాసిన మాటలు చిత్రంలో ఎన్నోసందర్భాల్లో  'ఓహో' అనిపిస్తాయి...జీవిత సారాన్ని కురిపిస్తాయి.ఈ మధ్య రొటీన్ ట్యూన్స్ తో తెర మరుగై పోతున్న మణి శర్మ మరో సారి ఈ చిత్రం లో తన విశ్వరూపాన్ని చూపించాడు.సందర్భోచితంగా  పాటలూ, సినిమాకు ప్రాణం పోసిన అద్భుతమైన నేపధ్య సంగీతాన్ని అందించాడు.  కధకు తగ్గ  దృశ్య వైభవాన్ని జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫీతో అందించాడు.

హీరో గా చాలా  చిత్రాలు చేసినా, తన బాడీ లాంగ్వేజ్ కి పక్కాగా సూట్ అయ్యే బి.టెక్ బాబు  పాత్రలో  రాణించాడు దగ్గుబాటి  రానా. ఎక్స్ ప్రెషన్స్  లోనూ అభివృద్ధి సాధించాడు. అందంతో పాటు అభినయం లోనూ దేవికగా నయన తార రాణించింది.ఆమె తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.సురభి సుబ్రహ్మణ్యం గా కోట,రెడ్డప్ప మనుషులు నాలుక తెగ్గోసే  వీర్రాజుగా రఘుబాబు, రంగస్థల పండిట్ (రంపం)గా బ్రహ్మానందం, రత్నప్రభ గా హేమ, మట్టిరాజుగా ఎల్బీ శ్రీరామ్, రెడ్డప్పగా మిలింద్ గునాజి, చక్రవర్తిగా మురళీ శర్మ,టాక్సీ డ్రైవర్ టిప్పు గా పోసాని ,సత్యం రాజేష్,రవి ప్రకాష్,రూపా దేవి, మరి కొందరు సురభి కళాకారులు ఈ చిత్రం లోని పాత్రలను పండించారు.'బళ్ళారి బావ'పాటలో సమీరా రెడ్డి సరసన , వెంకటేష్ కాసేపు కనిపించి ఆనందింప జేశాడు.ఇందులో  ఓ ఇంగ్లీష్ తరహా డాన్స్ కూడా బోనస్.                                                         -రాజేష్ 

0 comments:

Post a Comment