' కెమెరా మేన్ గంగతో రాంబాబు' చిత్ర సమీక్ష 2.5/5
యూనివర్సల్ మీడియా పతాకం ఫై పూరి జగన్నాద్ దర్శకత్వం లో దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే స్పందించే వెల్డర్ రాంబాబు లో ఆవేశాన్ని గమనించిన ఓ టి.వి ఛానెల్ కెమెరా ఉమన్ గంగ అతన్ని తమ ఛానెల్ లో రిపోర్టర్ గా చేర్పిస్తుంది. రాంబాబు తన దూకుడు తో అందరి దృష్టిని ఆకట్టు కుంటాడు.నిజాన్ని నిర్భయం గా చెప్పే జర్నలిస్ట్ దశరధ రామ్ ను హత్య చేసిన మాజీ ముఖ్య మంత్రి జవహర్ నాయుడును ఎదుర్కొని, అతని రాజకీయ వారసుడు రానా ను అరెస్ట్ చేయిస్తాడు రాంబాబు. తెలివిగా ఆ కేసునుండి బయటకొచ్చిన రానా రాష్ట్ర ముఖ్య మంత్రి కావాలని ప్రయత్నిస్తుంటాడు.ఇక్కడ వ్యాపారాలు చేస్తూ దోచేస్తున్న పక్క రాష్ట్రాల వారిని తరిమేసి , రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటూ-ప్రజల్లో తన రాజకీయ ప్రాభవం పెంచుకోవడం కోసం భావోద్వేగాలను రెచ్చగొడతాడు.అయితే,అతన్నిమీడి యా ముందు నిలదీసి - అతని వాదన లోని సంకుచితత్వాన్ని ప్రజల్లో ఎండగడతాడు రాంబాబు.ఎంతో కష్ట పడి ప్రజల్లో పెంచుకుంటున్న ఇమేజ్ ని దెబ్బ తీసిన రాంబాబు ని అడ్డు తొలగించు కోవాలని రానా ప్రయత్నిస్తుంటాడు. ప్రజల సానుభూతిని పొందడానికి మరో నీచమైన పధకాన్ని వేస్తాడు. రానా వంటి దుష్ట శక్తి ని రాష్ట్ర ముఖ్య మంత్రి కాకుండా అడ్డుకోవడానికి రాంబాబు ఏం చేసాడో సినిమాలో చూడాలి...
'పోకిరి' జంట పవన్-పూరిల కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఫై సహజం గానే భారీ అంచనాలు వుంటాయి.అయితే ఇది పూరీ రెగ్యులర్ గా చేసే సరదా టైప్ సినిమా కాదు. పవన్ ఆలోచనా విధానానికి అనుగుణం గా, సామాజిక చైతన్యం పెంచేలా దీన్నిరూపొందించాల్సి వుంది. ఈ తరహా సబ్జెక్ట్ ఫై అవగాహన లేని పూరి దీని ఫై మరింత ఎక్కువ కష్టపడాల్సి వుంది. అయితే, ఇటీవల దర్శకుడు పూరీ జగన్నాద్ ప్రారంభించిన మూడు నెలలకో సినిమా స్కీం వల్ల పూరి తన చిత్రాల ఫై ఏమాత్రం శ్రద్ధ చూపలేక పోతున్నాడు.దాంతో, ఇప్పుడు వస్తున్న అతని చిత్రాల క్వాలిటీ దారుణం గా పడిపోయింది.ఇటీవల వచ్చిన అతని 'దేవుడు చేసిన మనుషులు' ఇందుకు తాజా ఉదాహరణ .ఈ ' కెమెరా మేన్ గంగతో రాంబాబు' కూడా ఆ కోవలోనే పేలవంగా వచ్చింది.దాంతో ఈ చిత్ర నిర్మాణ సమయం లోనే' కొన్ని సన్నివేశాలను హీరో రీ షూట్ చెయ్య మన్నారని,అందుకు పూరీ అంగీకరించలేదంటూ'-వార్తలు వచ్చాయి.దానికి తగ్గట్టుగానే సినిమాలో పాత్రలు, పాత్ర దారులు,సన్నివేశాలు ...అన్నీ రొటీన్ గా, నిస్సత్తువుగా వున్నాయి. ఒక్క మీడియా నేపధ్యం మాత్రమే వున్నంతలో కొత్తది. మీడియాను చూపడం లోనూ దర్శకుడి అవగాహనా లేమి,గందర గోళం కనిపిస్తుంది. ప్రస్తుతం మీడియా రాజకీయ పార్టీలు,నాయకుల చేతుల్లో పడి వారి ప్రయోజనాలు కాపాడేందుకే పని చేస్తోంది.అందువల్ల, వారంతా కలిసి కట్టుగా రాంబాబు వంటి 'ప్రజల మనిషి'కి మద్దతు పలుకుతారనడం ఉత్త భ్రమ.అలాగే రాంబాబుకు ప్రజల్లో విశేష ప్రాచుర్యం రావడాన్ని బలంగా చూపలేక పోయారు.అతను పిలిస్తే అంతమంది జనం రావడం ...తక్కువ స్థాయి గ్రాఫిక్స్ తో క్లైమాక్స్ చెయ్యడం ... ఆర్టి ఫిషియల్ గా వుంది. .టి .వి చానెల్ లో అలీ 'మేలుకొలుపు' కార్యక్రమం, మరో చానెల్ లో బ్రహ్మానందం కోట ఫై చేసిన కార్యక్రమం..వార్తలను మార్చి చదివే సన్నివేశం మంచి వినోదాన్ని అందించాయి.పరాయి రాస్ట్రీయులను పార ద్రోలాలనే రానా ఉద్యమం మన తెలంగాణా ఉద్యమాన్ని గుర్తు చేస్తుంది. ఆ సందర్భంగా -జాతీయ సమైక్యత ను చెప్పే పవన్ ప్రసంగం ఈ చిత్రం లో హై లైట్ గా నిలుస్తుంది.అది ఇక్కడి తెలంగాణా వాదులకి కూడా వర్తిస్తుంది.
కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఫైనే ఆధార పడి ఈ చిత్రం చేసారు. దానికి పవన్ పూర్తి న్యాయం చేసారు. డైలాగ్స్ పవర్ ఫుల్ గా చెప్పడమే కాకుండా,డాన్స్ కూడా మరింత ఈజ్ తో చేసాడు. అయితే స్క్రీన్ ప్లేలో విషయం లేకపోవడం వల్ల అతని శ్రమ వృధా అయ్యింది .తమన్నా అందం గానే వుంది, బాగా చేసింది ... కానీ 'ఎక్ష్త్రార్డినరీ' అమ్మాయి గా మాత్రం సరిపడ లేదు.ఆమె క్యారక్ట రైజేషన్లో ' అతి' వల్ల ప్రేక్షకులు బాధపడ్డారు.గబ్రియేల కూడా ఇబ్బంది పెట్టింది. విలన్లుగా కోట,ప్రకాష్ రాజ్ లు కొత్తగా చేసింది ఏమీ లేదు.మహిళా నేత గుండక్కగా శృతి,ముఖ్య మంత్రి గా నాజర్,ఇతర పాత్రల్లోసూర్య, ధర్మవరపు,యమ్మెస్,తనికెళ్ళ భరణి,ఉత్తేజ్,స్కార్లెట్ ఓ పాటలో నటించారు.మణిశర్మ సంగీతం లో పాటలు అంతంత మాత్రం గానే వున్నాయి.'ఎక్ష్త్రార్డినరీ', 'రెడీ 123' పాటల చిత్రీకరణ,నేపధ్య సంగీతం బాగుంది.ఈ చిత్రాన్ని 40 ఏళ్ళుగా ప్రజా సమస్యల ఫై చిత్రాలు నిర్మిస్తున్న ఆర్ .నారాయణ మూర్తి కి అంకితం ఇవ్వడం విశేషం. -రాజేష్
0 comments:
Post a Comment