' బ్రదర్స్' చిత్ర సమీక్ష 3/5
జెనెటిక్ శాస్త్రవేత్త రామచంద్ర తన భార్య మీద చేసిన ప్రయోగం వికటించి ఆమెకు అవిభక్త కవల పిల్లలు విమల్ , అఖిల్ పుడతారు. వారిద్దరూ అవిభక్త కవలలుగా ఉండటం రామచంద్రకి ఇష్టం లేకపోయినా భార్య కోరిక మేరకు వారిని అలాగే పెంచుతారు. రామచంద్ర ఎనర్జియోన్ అనే మిల్క్ పౌడర్ కనిపెడతాడు. అతి తక్కువ సమయంలోనే ఈ ఎనర్జియోన్ ప్రభావవంతంగా పేరు సంపాయించి, అమ్మకాలు విపరీతంగా పెరగడంతో అందరి చూపు ఎనర్జియోన్ పై పడుతుంది. ఎనర్జియోన్ ఎలా తయారు చేస్తారు? అనేవిషయాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్న రష్యన్ జర్నలిస్ట్ వోల్గా కి విమల్ , అఖిల్ మిత్రురాలు అంజలి కూడా సహాయం చేస్తుంటుంది.ఆ క్రమంలోరష్యన్ జర్నలిస్ట్ తో సహా ,విమల్ కూడా మరణిస్తాడు.అసలు ఈ ఎనర్జియోన్ మిల్క్ పౌడర్ ఫార్ములాలో ఏముందో తెలుసుకోవడానికి అఖిల్-అంజలి అందులో వాడుతున్న పదార్ధాల మూల కేంద్రం అయిన ఉక్రెయిన్ వెళ్తారు.ఆ తర్వాత ఏం జరిగిందీ సినిమాలో చూడాలి...
విభిన్నమైన పాత్రలకి పేరు పొందిన సూర్య హీరోగా ,'వీడొక్కడే' 'రంగం' వంటి విలక్షణమైన చిత్రాల దర్శకుడు ఆనంద్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం ఇది. అవిభక్త కవలలుగా సూర్య రెండు పాత్రలు చెయ్యడం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.. స్వార్ధం కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే సైంటిస్ట్ దుర్మార్గాన్ని అతని పిల్లలే బయట పెట్టడం ...అనే మంచి కధాంశంతో చేసిన ఈ చిత్రంలో అవిభక్త కవలలు గా సూర్య ఉన్నంత వరకూ... సినిమా మొదటి భాగం చాలా బాగుంది.విమల్ చనిపోయాక ఎనర్జియోన్ రహస్యాన్ని తెలుసుకోవడానికి అఖిల్ ఉక్రెయి న్ వెళ్లినప్పటినుండి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సస్పెన్స్ తెలిసిన తర్వాత దర్శకుడు సినిమాని ఆసక్తికరంగా నడపలేకపోయాడు. మేధావి అయిన దర్శకులతో వచ్చే ఓ పెద్ద ఇబ్బంది ఏమిటంటే-వారు వారి స్థాయిలో ఆలోచిస్తూ సగటు ప్రేక్షకుడికి దూరంగా పోతుంటారు.అదే ఇందులోనూ జరిగింది.చిత్రంలో సైన్స్ విషయాలు ప్రధానం కావడం వల్ల, అవి ప్రేక్షకులకు అర్ధం కాలేదు.ఇక రెండవ భాగం మొత్తం ఉక్రెయిన్ లో జరగడం ...అదీ సుదీర్ఘంగా సాగడం...ఆ భాగంలో వినోదం ఏమాత్రం లేకపోవడం సినిమాని నిరాసక్తంగా మార్చాయి.ఆ సన్నివేశాల్లో హీరోతోపాటు హీరొయిన్ కూడా ఉన్నప్పటికీ, వారి మధ్య రొమాన్స్ ని వినోదాత్మకంగా వా డుకోలేకపోయారు. అవిభక్త కవలల చిత్రీకరణ గొప్పగా వుంది. విరామానికి ముందు జాయింట్ వీల్ ఫై ఫైట్ ,ఉక్రెయిన్ అడవిలో ఫైట్ పీటర్ హైన్స్ బాగా చేసాడు. విమల్ చనిపోయాక అతన్ని అఖిల్ తో విడదీసే సన్నివేశం మనసులను కదిలిస్తుంది. హీరో క్రూరుడైన తండ్రిని ఎలకలకు ఆహారంగా వదిలేసే క్లై మాక్స్ సన్నివేశం కూడా బాగుంది.
అవిభక్త కవలలుగా సూర్య అద్భుతం గా నటించాడు.రెండు పాత్రల మధ్య వైవిధ్యాన్ని చూపడానికి చాలా శ్రమించాడు.అంజలి గా కాజల్ కూడా బాగా చేసింది.సినిమా అంతా అందంగా కనిపించింది.అఖిల్ కి సూర్య తమ్ముడు కార్తి, అంజలికి చిన్మయి చెప్పిన డబ్బింగ్ బాగుంది.సూర్య తండ్రి సైంటిస్ట్ రామ చంద్రగా సచిన్ ఖేడేకర్ ,తల్లిగా తార చేసారు.చాలా కాలానికి రవిప్రకాష్ కి ఇందులో చెప్పుకోదగ్గ విలన్ పాత్ర లభించింది.హారిస్ జైరాజ్ హిట్ ట్యూన్స్ ఇవ్వలేకపోయాడు. అయితే 'రాణి రాణి' వంటి పాటల చిత్రీకరణ కలర్ ఫుల్ గా వుంది. నేపధ్య సంగీతం ,విజువల్ ఎఫెక్ట్స్ , సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ, అంటోనీ ఎడిటింగ్ బాగున్నాయి. -రాజేష్
0 comments:
Post a Comment