'సాహసం' చిత్ర సమీక్ష 2.5 / 5
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం ఫై చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం లో బి.వి .యస్ .యన్ .ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు .
ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజన్సీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసే గౌతమ్ కు ధనవంతుడు కావాలనేది జీవిత లక్ష్యం . అతని లక్ష్యాన్ని చేరుకోవడం కోసం బాబాలను కలిసి జాతకాలు చూపించుకుంటూ, లాటరీ టికెట్స్ కొంటూ ఉంటాడు. కానీ వాటి ఫలితాలు నిరుత్సాహకరంగా వుంటాయి . అనుకోకుండా ఒక వర్షం కురిసిన రాత్రి- అతని తాతగారు దాఛిన డైరీ,ఒక హారం దొరుకుతాయి . అప్పుడే అతనికి ఓ కొత్త దారి దొరుకుతుంది. గౌతమ్ కి తాత గారైన వర్మ భారత్ – పాకిస్థాన్ విడిపోకముందు పెషావర్ లో వజ్రాల వ్యాపారం చేసే వారు . స్వతంత్ర సమయం లో జరిగిన అల్లర్లకు భయపడి అతను పాకిస్తాన్ నుండి పారిపోయి వస్తూ -తన వారసుల కోసం విలువైన వజ్రాలను ఓ చోట దాచి పెడతాడు . తాత డైరీ ద్వారా ఆ వివరాలు తెలుసుకున్న గౌతమ్ ఎలాగైనా వాటిని సంపాదించాలనుకుంటాడు. ఆ వజ్రాల నిధివున్న పాకిస్థాన్ లోని హింగ్లాజ్ దేవి దేవాలయానికి శ్రీ నిధి అనే భక్తురాలితో కలిసి వెళ్తాడు .అక్కడ కనిష్కుడి నిధికోసం వెతుకుతున్న సుల్తాన్ అనే మోతుబరి నుండి గౌతమ్ కు ప్రమాదం ఏర్పడుతుంది . ఆతర్వాత ఏమి జరిగిందీ సినిమాలో చూడాలి ...
విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరు పొందిన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం లో వచ్చిన వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ఇది . ఈ తరహా చిత్రాలు తెలుగు తెరకు కొత్తగానే చెప్పుకోవాలి . అయితే , చంద్రశేఖర్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మాస్ యాక్షన్ 'నిధి అన్వేషణ' కధాంశంతో చెయ్యడం దీని ప్రత్యేకత . అడ్వెంచర్ చిత్రం చెయ్యాలనుకోవడం , భారీ ఖర్చుకి సిద్దపడ్డ నిర్మాత దొరకడం బాగానే వుంది గానీ...ఈ తరహా చిత్రాల్లో కావాల్సిన ...ఆసక్తి కలిగించే మసాలా,బిగి కలిగిన కధనం కొరవడడంతో ఈ చిత్రంలో దర్శకుడిగా చంద్రశేఖర్ అంతంత మాత్రంగానే రాణించాడు . బుర్రపెట్టి చూడాల్సిన సినిమా కాదని దర్శకుడే చెప్పినా... అడ్వెంచర్ చిత్రంలో ఉండాల్సిన థ్రిల్ తో పాటు వినోదం కూడా ఇందులో కనిపించదు .కధలో హీరో తాత వజ్రాలు... సుల్తాన్ కోరే కనిష్కుడి నిధి... దాని అన్వేషణ విధానాలు అంతా గందరగోళం గా వుంటుంది . సన్నివేశాల టేకింగ్ కూడా పట్టుగా లేదు .
సినిమా ప్రారంభంలో ఏటియం డబ్బు దోపిడీ సన్నివేశంలో చేజ్,ఫైట్...ఆర్కియాలజీ ఆఫీసు లో లాకెట్ కోసం ఫైట్...పెషావర్ లో సుల్తాన్ మనుషులనుండి హీరో తప్పించుకునే సన్నివేశాలు ... క్లైమాక్స్ చివరి సన్నివేశాలు బాగున్నాయి .పెద్దగా చదువుకోని సెక్యురిటీ గార్డ్ ప్రమాదకరమైన పాకిస్తాన్ లో వీరోచిత విన్యాసాలు చెయ్యడం , పరమ భక్తురాలైన హీరోయిన్, నిధికోసం ప్రమాదకరమైన అన్వేషణ చేస్తున్న హీరోతో పాటే కొనసాగడం అర్ధం కాదు . హీరోయిన్ గ్లామర్ ని కూడా సినిమా కోసం తగు విధం గా ఉపయోగించుకోలేదు . క్లైమాక్స్ లో నది ఫై వంతెన సన్నివేశాల్లో గ్రాఫిక్ వర్క్ బాగా లేదు. పాక్ లో గుర్రాల ఫై గొర్రె పిల్లతో ఆడే 'జుష్ కాషి' ఆటను ఇందులో ఉపయోగించుకోవడం బాగుంది కానీ, సమర్దవంతం గా చెయ్యలేకపోయారు . పాక్ సరిహద్దుల్లోని లడక్ ప్రాంతంలో చిత్రీకరించిన ప్రదేశాలు బాగున్నాయి .
గౌతమ్ గా గోపీచంద్ బాగా చేసాడు . వీర భక్తురాలు శ్రీనిధి గా అందాల ప్రదర్శన లేని పాత్ర బాగానే చేసింది . ఖయామత్ రాజు గా అలీ , సుల్తాన్ గా హిందీ నటుడు శక్తి కపూర్ ప్రధాన పాత్ర బాగా చేసాడు . అయితే వారిని మరింత బాగా ఉపయోగించు కోవాల్సింది . ఇతర పాత్రల్లో సుమన్ , సూర్య , నారాయణ రావు నటించారు . "నాదికాని కోటి రూపాయలైనా నాకొద్దు - నాది అన్నది అర్ధ రూపాయి అయినా వదులుకోను" - వంటి రాధాకృష్ణ మాటలు కొన్ని సందర్భాల్లో బాగున్నాయి . శ్రీ పాటల్లో చెప్పుకోదవి లేవు . రీ రికార్డింగ్ బాగుంది ... కొన్ని సీన్స్ లో చాలా బాగుంది . శ్యాం దత్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది . సెల్వ యాక్షన్ సీన్స్ బాగా చేస్తే ... రామకృష్ణ కధకి అనువైన సెట్స్ చక్కగా వేసారు -రాజేష్
0 comments:
Post a Comment