RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, June 22, 2012

   'శకుని' చిత్ర సమీక్ష                 3/5
          'స్టూడియో గ్రీన్' గ్యాన వేల్ రాజా సమర్పణలో  శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకం ఫై శంకర్ దయాళ్ దర్శకత్వం లో బెల్లం కొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

          గ్రామంలోని తాతల నాటి ఇంటిని రైల్వే విస్తరణ లో కోల్పోతున్న కమల్ కృష్ణ, దాన్ని కాపాడుకోవడానికి రైల్వే మంత్రిని కలుద్దామని నగరానికి వస్తాడు. తను కోరుకున్న విధంగా జరిగే అవకాశం లేకపోవడంతో -ఆ రైల్వే బ్రిడ్జి  కాంట్రాక్ట్ తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి భూపతి ని కలిస్తే, అక్కడ అతనికి అవమానం ఎదురవుతుంది. అధికారం లేనిదే పనులు కావని తెలుసుకున్న కమల్ తన తెలివితో  సామాన్యురాలు రమణక్కను మేయర్ని చేసి భూపతికి తన తొలి సవాల్ విసురుతాడు. అధికారాన్ని చూసుకుని అహంకారంతో , సంపాదనే లక్ష్యం గా విర్రవీగుతున్న భూపతిని పదవి నుంచి దించడానికి ప్రతి పక్ష నాయకుడు పెరుమాళ్ళు ని పురికొల్పుతాడు.ఎన్ని ఇబ్బందులోచ్చినా కమల్ తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేదే ఈ చిత్ర కధాంశం .
          తెలుగు హీరోలతో సమానం గా ఎదిగిన కార్తీ హీరోగా రాజకీయాలను కలిపి , పూర్తి వినోదాత్మకం గా నిర్మించిన చిత్రం ఇది. కార్తీ నటనతో పాటు అప్పలరాజు గా చేసిన సంతానం నటన... మంచి స్క్రీన్ ప్లే ,శశాంక్ వెన్నెలకంటి  చురుకైన మాటలు ఈ చిత్రం లో ప్రత్యేకతలు. అలాగే ప్రధాన పాత్రలకు సమర్ధులైన నటీ నటులను ఎంపిక చెయ్యడం  కూడా సినిమాకి కలిసొచ్చింది.  సినిమా ప్రారంభం లో ....జేబులో రూపాయి లేకుండా రజనీ అభిమాని అప్పల రాజు ఆటో ఎక్కి, హీరో తన ఫ్లాష్ బాక్ చెప్పే సన్నివేశాలు  ప్రేక్షకులను చాలాబాగా అలరించాయి . ఇడ్లీలు అమ్ముకునే  రమణక్కను కార్పొరేటర్ ని ...ఆ తర్వాత మేయర్ ని చేసే సన్నివేశాలు , చెట్టుకింద స్వామిని కమల్ తన తెలివి తో బడా స్వామిని చేసే సన్నివేశాలు, రాజకీయఎత్తుగడల సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  కరడు గట్టిన రాజకీయుల మధ్య, ఎన్ని తెలివితేటలున్నా కమల్ వంటి వారు ఇంత తేలికగా నెగ్గుకు రావడం ...అంత తేలికైన విషయం అని మాత్రం ఎవరూ నమ్మరు.అయితే అటువంటివి ఏమీ ఆలోచించకుండా చూసే వారికి ఈ సినిమా రెండు గంటల పాటు మంచి వినోదాన్ని అందిస్తుందని మాత్రం చెప్పొచ్చు.
           కమల్ గా కార్తీ తన సహజ శైలి లో పూర్తి న్యాయం చేసాడు.నటన పరం గా,విజయాల పరం గా ఈ చిత్రం తో మరో మెట్టు ఫైకెక్కాడు. శ్రీదేవి గా ప్రణీత రెండు సీన్లు,రెండు పాటలకే పరిమిత మయ్యింది. అయితే అందంగా కనిపించింది.అప్పలరాజు గా సంతానం మంచి  కామెడీ పండించాడు. భూపతిగా ప్రకాష్ రాజ్ తన రెగ్యులర్ తరహా పాత్రనే మరోసారి బాగా చేసాడు. అతని ఉంపుడుగత్తె  గా కిరణ్ రాథోడ్, రమణక్కగా రాధిక ,  బీడీ బాబా గా నాజర్, హీరో మేనత్తగా రోజా, ప్రతిపక్ష నాయకుడు పెరుమాళ్ళు గా కోట ప్రధాన పాత్రలు ప్రతిభా వంతం గా పోషించారు. పోలిస్ అధికారిగా అనుష్క ఒకసారి మెరుపులా కనిపించింది. అలాగే ఆండ్రియా కూడా...'మనసులో మధువే' ఒక్కటి తప్ప , ప్రకాష్ కుమార్ పాటల్లో  చెప్పుకోదగ్గవి లేవు. కార్తీ ఫై చేసిన ఒక మాస్ మందు  పాటను తీసేసి, సినిమాకు మేలు చేసారు. రీ రికార్డింగ్ కూడా కొన్ని చోట్లే సందర్భోచితంగా వుంది.. ముత్తయ్య ఫోటోగ్రఫీ  బాగుంది.                     
                                                                                                                                                                                                     -రాజేష్

0 comments:

Post a Comment