RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, June 1, 2012

 'అధినాయకుడు' చిత్ర సమీక్ష          2.5/5

శ్రీ కీర్తి క్రియేషన్స్  పతాకం ఫై పరుచూరి మురళి దర్శకత్వం లో యం.యల్.పద్మ కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

కిరాయి హంతకుడిగా జీవిస్తున్న బాబీకి   అనుకోకుండా, తను చంపాలనుకున్నరాయల సీమ ప్రజా నాయకుడు రామ కృష్ణ ప్రసాద్   తన తండ్రి అనే విషయం తెలుస్తుంది. రాయల సీమ ప్రజల కష్టాలను తీర్చడానికి ,ఫ్యాక్షనిజాన్ని రూపు మాపడానికి  కంకణం కట్టుకున్న హరిశ్చంద్ర ప్రసాద్ కుమారుడైన రామ కృష్ణ ప్రసాద్ కుటుంభం ఫై ప్రతీకారం తీర్చు కోవాలని అతని ప్రత్యర్ధులు రామ కృష్ణ ప్రసాద్  మేనకోడలిని కిడ్నాప్ చెయ్యాలని చూస్తారు.వారి ప్రయత్నాన్ని అడ్డుకున్న బాబీ  ఆమెతో కలిసి రాయల సీమలోని రామ కృష్ణ ప్రసాద్ ఇంటికి వెళ్తాడు. చిన్నప్పుడే దూరమైన కొడుకు వచ్చినందుకు ఆ కుటుంభం లోని వారంతా ఎంతో సంతోషిస్తారు. అయితే,ఒక కటినమైన వాత్సవం తెలిసిన రామ కృష్ణ ప్రసాద్ మాత్రం బాబీ ని దూరంగానే పెడతాడు. హరిశ్చంద్ర ప్రసాద్ హత్యకు కారకులైన వారు రామ కృష్ణ ప్రసాద్ కుటుంభం ఫై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తారు. వాటిని రామ కృష్ణ ప్రసాద్,బాబీ ఎదుర్కొని, ప్రత్యర్ధులను మట్టు పెట్టడం ఈ చిత్ర కధాంశం.

బాల కృష్ణ వంటి అద్భుత మైన నటుడి త్రి పాత్రాభినయం తో మంచి కమర్షియల్ సినిమా తీయడం -అన్నది దర్శకుడు పరుచూరి మురళి 'ప్రతిభకు మించిన పని' అని ఈ చిత్రం చూస్తే అర్ధం అవుతుంది. ఎంతో విస్తృతమైన కధ ను హ్యాండిల్   చేయడం లో దర్శకుడి నిస్సహాయత అడుగడుగునా  కనిపిస్తుంది. ప్రేక్షకులకు ఓ కొత్త చిత్రం చూస్తున్న ఫీలింగ్ ఎక్కడా కలగదు. సినిమాలో ఏ పాత్ర ఏంటి? అనేది అర్ధం కాక ప్రేక్షకులు చాలాసార్లు గందరగోళానికి గురవుతారు. రాయల సీమ ఫ్యాక్షన్, పగ-ప్రతీకారాల  పాతబడ్డ  సన్నివేశాలకు తోడు ...బలహీనమైన   టేకింగ్ ...ఏ మాత్రం ఉత్సాహం లేని రీ రికార్డింగ్  కలిసి ఈ చిత్రాన్ని నిస్సారం గా మార్చాయి.  మూడు పాత్రల్లో బాల కృష్ణ  నటన మాత్రమే  ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ అంశం. అయితే,బాలకృష్ణ అభిమానులకు కూడా ఈ చిత్రం సంతృప్తిని ఇవ్వదు .బాలయ్య  బాబీ గా టీ షర్ట్ లు, టైట్ పాంట్స్ వేసుకుని కుర్రాడిలా అనిపించడానికి చేసిన ప్రయత్నం ఇబ్బంది కరంగా వుంది. రామ కృష్ణ ప్రసాద్ గెటప్ కూడా అంత బాగా కుదరలేదు. హరిశ్చంద్ర ప్రసాద్ గా కనిపించే అన్ని సన్నివేశాలు బాగున్నాయి.ముఖ్యం గా -లండన్లో సమావేశం సన్నివేశం. అతని తో రాయల సీమ యాస పలికించడం కూడా బాగుంది.  'ట్రెండ్ తో మాకు పని లేదు...తప్పు చేసిన వాడి బెండు తీయడమే నా స్టైల్' వంటి డైలాగ్స్ కొన్ని అక్కడక్కడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 'నేను మాట్లాడుతున్నపుడు నీ గొంతు పెరిగిందో...మాటల్లో మర్యాద తగ్గిందో' వంటి  కొన్నిడైలాగ్స్ మరీ రొటీన్ గా  వున్నాయి.రెహమాన్ తో ఫ్లాష్ బ్యాక్  చెప్పించడం బాగుంది. పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ఫారినర్స్ ఫై ప్రదీప్ రావత్ గ్యాంగ్ దాడి చేసే సన్నివేశాలు మరీ అతిగా వున్నాయి. అమాయకుడి పాత్ర పోషించిన బ్రహ్మానందం కామెడీ కొన్ని చోట్ల పండింది. వేణుమాధవ్ సన్నివేశాలు బాగున్నాయి. గ్లామర్ కోసం లక్ష్మీ రాయ్ ఉపయోగపడింది. ఓ పాటలో మితి మించింది. సలోని కూడా ఓపాటలో  అందాలు చిందించింది. ఇతర పాత్రల్లో కోట, ప్రదీప్ రావత్,మురళి శర్మ, చరణ్ రాజ్, జయసుధ, రెహమాన్, సుకన్య, పీ.జే.శర్మ, సన, కరుణ, కాశీ విశ్వనాద్,రవిప్రకాష్ పోషించారు. సన్నివేశ పరమైన ఒక పాట తప్ప, కళ్యాణీ మాలిక్ పాటల్లో కొత్తదనం లేదు. సురేంద్ర రెడ్డి ఫోటోగ్రఫీ పర్వాలేదు.  సాంకేతిక లోపం వల్ల -సినిమాలో పలు చోట్ల కలర్ లో వ్యత్యాసం కనిపిస్తుంది. జయసుధ విగ్గులోని  ఇబ్బందిని పట్టించుకోకుండానే పని కానిచ్చేసారు. ప్రకృతి చికిత్స ఆశ్రమం సెట్ బాగుంది.                    
                                                                                                                                                                                                                                                                                                                          -రాజేష్

0 comments:

Post a Comment