RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Sunday, October 30, 2011

సెన్స్‌లెస్‌ 'సెవెంత్‌సెన్స్‌' [చిత్ర సమీక్ష]

సెన్స్‌లెస్‌ 'సెవెంత్‌సెన్స్‌' [చిత్ర సమీక్ష]
చారిత్రక, జానపద, పౌరాణిక కథాంశాలు...సినిమాలో చూపించాలంటే...రెండు వైపులా పదునున్న కత్తిని వాడటమే. ఏ మాత్రం పరిధి తప్పినా అభాసుపాలవటం ఖాయం. బద్రినాథ్‌, శక్తి...ఇలాగే చారిత్రక నేపథ్యాన్ని సరైన పంథాలో చూపలేక విఫలమయ్యాయి. అదే ధోరణిలో...ఈసారి
ఓ డబ్బింగ్‌ చిత్రమొచ్చింది. అంతే తేడా. 'సెవెన్త్‌సెన్స్‌' అంటే ఏడో జ్ఞానం. ఏడో జ్ఞానానికి...ఏడో శతాబ్దానికి... పొరుగుదేశానికి దర్శకుడు మురుగదాస్‌ ముడిపెెట్టబోయి గందగోళంలో పడ్డాడు. చారిత్రక నేపథ్యానికి కల్పనలు అతిగా జోడించటం దర్శకులకు అలవాటైపోయింది. దీనివల్ల ప్రేక్షకుల్ని తప్పుదారి పట్టించటమే అవుతుంది. మురుగదాస్‌ తీసుకొచ్చిన 'సెవెంత్‌సెన్స్‌' అలాంటిదే. 'మగధీర' కాన్సెప్ట్‌తో రావటంలో కొత్తదనమేంటో అర్థం కాదు. చైనాను విలన్‌గా చూపి ప్రయోజనం పొందాలని ప్రయత్నించి బోర్లాపడ్డాడు. ఏతావాతా సెన్స్‌లేని సినిమాగా
సెవెంత్‌సెన్స్‌ మిగిలిపోయింది.
ఇక కథలోకి వెళితే...16వ శతాబ్దంలో తమిళనాడుకు చెందిన పల్లవరాజు బోధిదర్మ (సూర్య) పలు విద్యలు నేర్చుకుని చైనా వెళతాడు. వారు అతన్ని దుష్టశక్తిగా భావిస్తారు. అక్కడ ఓ పల్లెలో అంతుపట్టని వ్యాధి సోకి ప్రాణహాని జరగడంతో తన వైద్యజ్ఞానంతో నయం చేస్తాడు. దాంతో పాటు శత్రువులెవరైనా హఠాత్‌గా దాడిచేస్తే ఎదుర్కొరేందుకు ఆత్మరక్షణ కళలో భాగంగా వశీకరణ (అదే సెవెన్త్‌సెన్స్‌) అనే ప్రాచీన యుద్ధ కళనీ వారికి నేర్పిస్తాడు. చివర్లో వారి కోరికమేరకు అక్కడే తనువు చాలిస్తాడు. తదనంతర కాల పరిస్థితులరీత్యా చైనీయులు ఆలోచనలు మారి.. బోదిధర్మ నుంచి నేర్చిన విద్యను భారత్‌కు వ్యతిరేకంగా ప్రయోగించడానికి ఇప్పటి చైనా కుట్రపన్నుతుంది.
కట్‌చేస్తే... వర్తమానంలో.. జెనెటిక్‌ విద్యార్థి శుభ (శృతిహాసన్‌) బోదిధర్మ శక్తి పై పరిశోధన చేస్తుంది. అది ఫలిస్తే.. చైనీయుల కుయుక్తులు చెల్లవు కనుక.. ఆమెను చంపి, ఇండియాలో ప్రాణాంతకమైన వ్యాధిని పుట్టించమని డాంగ్‌లీ (జాన్‌ట్రీ) అనే వ్యక్తిని పంపిస్తుంది. అలా అతను ఓ కుక్కద్వారా వ్యాధి కణాలు చొప్పించి దేశం మొత్తం వ్యాపించేలా చేస్తాడు. మరోవైపు శుభ తన పరిశోధనల్లో బోదిధర్మ వంశీయులు ఉన్నారని తెలుసుకుని కాంచీపురం వెళ్ళి అరవింద్‌ (సూర్య) అతని వారసుడని తెలుసుకుని, తన ప్రయోగాలకు సాయపడమంటుంది. అందులో భాగంగా డిఎన్‌.ఎ.ద్వారా బోధిదర్మలోఉన్న శక్తిని అరవింద్‌లో ప్రవేశపెట్టే ప్రక్రియ మొదలుపెడుతుంది. ఇది తెలిసిన డాంగ్లీ ఏం చేశాడు? తర్వాత పరిణామాలు ఏమిటి? అన్నది సినిమా.
బుద్దిడి బోధనల్ని ఆచరించినవారు నాటి కాలంలో అనేకమంది ఉన్నారు. ఆ పరంపంరలో వచ్చినవాడే బోదిధర్మ. ఇతను చైనాకెళ్ళి ఆత్మరక్షణ విద్యల్ని నేర్పుతాడు. ఈయన వెళ్లి వైద్యం, యుద్ధ విద్యలు నేర్పడం వరకూ చరిత్రలో ఉందని కొంతమంది అంటారు. షావొలిన్‌లో అతనికొక మందిరాన్ని కట్టారట ! ఈ విషయమూ చాలామందికి తెలీదు.
అయితే బోదిధర్మ అనే వ్యక్తిని తీసుకొని, అనేక కల్పనలు జోడించి దర్శకుడు మురుగదాస్‌ కథను అల్లుకున్నాడు. తను ఎంచుకున్న కథలో చాలా డెప్త్‌ ఉంది. దానిని నేటి కాలమనానికి అన్వయించడంలో గాడి తప్పాడు. కథానాయకుడిని చివరి ఘట్టం వరకు పాజిటివ్‌గా ఉంచి చివర్లో తేల్చేయడం బాగోలేదు. హీరో శక్తి, విలన్‌శక్తి చూపించడానికే అల్లిన కథలా అనిపించింది.
హీరోయిన్‌ను చంపడానికి విలన్‌ వచ్చిన గమనంలో ఉత్కంఠత లేదు. సన్నివేశాల్లో డెప్త్‌లేదు. స్క్రీన్‌ప్లేలో పట్టులేకపోవడం ప్రధాన లోపం. ముందుగానే బోదిధర్మ గురించి చెప్పేసి...తర్వాత.. అరవింద్‌ గురించి చెప్పడంతో కథ తేలిపోయింది. బోదిధర్మ ఎపిసోడ్‌ సెకండాఫ్‌లో ఉండేలా స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌లో జాగ్రత్తలు తీసుకుంటే కథ మరోలా ఉండేది. చివరి వరకు ఉత్కంఠ ఎదురుచూసే విధంగా లేకపోగా... హీరో, విలన్ల మధ్య జరిగే పోరాటాలే ఆకట్టుకున్నాయి. విలన్‌ పాత్ర ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో 'హాంటర్స్‌', టెర్నినేటర్‌ చిత్రాల్లో విలన్‌ శైలిని దించేశాడు. హాలీవుడ్‌లో హీరోగా చేసిన తను తమిళ సినిమాలో విలన్‌గా చేయడం విశేషమే.
సినిమాకు పెద్దగా ఉపయోగం లేకపోయినా బోధిదర్మ ఆహార్యం సూర్యకు నప్పింది. సిక్స్‌పాక్‌ బాడీని చూపించి సూర్య యూత్‌ను అలరిస్తాడు. శ్రతిహాసన్‌ నటన పెద్దగా చెప్పేదేమిలేదు. ఆమె పాత్ర కీలకమేకానీ కొన్ని సన్నివేశాల్లో బెరుకుగా కన్పిస్తుంది. మురుగదాస్‌ సినిమాలు సాంకేతికంగా ఉన్నతంగా ఉంటాయనేది పేరు. కానీ ఈ చిత్రంవరకు టెక్నికల్‌గా కూడా కొంత ఫెయిల్‌ అయ్యాడు. అరవింద్‌పై సూర్య కిరణాలు పడితే పడ్డ శ్రమ వృధా అవుతుందని శృతి చెబుతూనే.. మరుషాట్‌లో సూర్యకిరణాలపడడం.. వెంటనే బోదిధర్మశక్తి ఆవహించడం విచిత్రంగా అనిపిస్తుంది.
దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన డాంగ్‌లీ చేసే అరాచకాలు అవి ఇవీ కావు. పోలీసు క్వార్టర్లో ప్రవేశించి విచక్షణా రహితంగా చంపేయడం, రోడ్డుపై అరాచకాన్ని సృష్టించినా ప్రభుత్వం స్పందించకపోవడం వంటివన్నీ.... టీవీ సీరియల్‌ ఎపిసోడ్‌లా అనిపిస్తాయి. గత చరిత్ర తెలియదని వేలెత్తిచూపే మురుగదాస్‌కు దేశానికి సంబంధిన వర్తమానకథను కేవలం ఆరుగురు సైంటిస్టులకే పట్టినట్లు, అసలు ప్రభుత్వ యంత్రాంగం గుర్తించకపోవడం అనేది.. అసంబద్ధంగా ఉంది.
రవిచంద్రన్‌ ఫొటోగ్రఫీ ఫర్వాలేదు. ఒక్కపాటకూడా గుర్తుండేలా లేదు. హరీస్‌జైరాజ్‌ పాత ట్యూన్స్‌ ఇచ్చాడు. శంకర్‌లా 'అపరిచితుడు' తరహాలో గొప్ప సందేశాన్ని ఇవ్వాలనుకుని.. కథను ఎటునుంచో ఎటో తీసుకుకెళ్ళడంతో క్లారిటీ దెబ్బతింది. వశీకరణ విద్యే.. సెవెన్స్‌ సెన్స్‌.. అని చెప్పాడు. ఇప్పటి జనరేషన్‌ పసుపు ఒంటికి రాసుకోవడం మర్చిపోతున్నారు.. ఇంటిముందు పేడతో కళ్ళాపు జల్లడం తెలీదు...అంటూ క్లైమాక్స్‌లో సూర్య చెప్పటం, విదేశీయులు చెబితేనేగానీ నమ్మేట్లు లేరు అనడం...మరీ టూమచ్‌ అయింది. ఈ విషయాలు నేటి గ్రామాల్లో చాలామందికి తెలుసు. ఏదో చెప్పాలనుకుని ఏమీ చెప్పలేకపోయినట్లుంది. చేసిన ప్రయత్నం గొప్పదే. దాన్ని మరింత సెన్స్‌గా తీస్తే బాగుండేది.
దీపావళికి తెలుగు చిత్రాలేవీ లేకపోవడంతో రెండు అనువాద చిత్రాలు తమ సత్తా చూపేందుకు సిద్ధమయ్యాయి. వాటిలో షారూఖ్‌ 'రా.వన్‌' అయితే, రెండవది సూర్య నటించిన 'సెవెన్త్‌సెన్స్‌'. సూర్యను తెలుగు హీరోగా చూడ్డం అలవాటుపడిన ప్రేక్షకులను రాబట్టేందుకు బంపర్‌ ఓపెనింగ్స్‌ ఎగ్జిబిటర్లు ప్లాన్‌చేశారు. అండర్‌ ప్రొడక్షన్స్‌లోనే ఆసక్తి రేకెత్తించే అంచనాలు విడుదలనాటికి మరింత పెరిగాయి. గజని తర్వాత వస్తున్న కాంబినేషన్‌ కావడంతోపాటు సూర్య విచిత్రమైన గెటప్స్‌ చర్చనీయాంశమయ్యాయి. కానీ సినిమా చూశాక ఆ అంచనాలు అందుకోలేదని తెలిసిపోతుంది.
                                                                                                                                                    - మురళి

0 comments:

Post a Comment