RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Sunday, October 16, 2011

పౌరాణిక చలన చిత్ర సప్తాహం ప్రారంభం

నేటి సినిమాలు పొగిడే స్థితిలో లేవని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అయినా తన తల్లిని తాను తిట్టు కోలేనని పేర్కొన్నారు. తెలుగు వైభవాన్ని చాటి చెప్పే మంచి చిత్రాలు ఇంకా రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు శబ్దచిత్రం విడుదలై 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న పౌరాణిక చలన చిత్ర సప్తాహం ఆదివారం అమీర్‌పేట కమ్మ సంఘం హాల్‌లో ప్రారంభమైంది. కార్యక్రమానికి అక్కినేని ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీతత్వం ఉన్నప్పుడే ఏ రంగమైనా ముందుకు సాగుతుందని అన్నారు. పౌరాణిక పాత్ర అంటే ఇలా ఉండాలని చేసి చూపిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్‌కు దక్కుతుందని కొనియాడారు. పౌరాణిక చిత్రాలతోపాటు సామాజిక స్పృహ, చారిత్రాత్మక, హాస్య, శృంగార, ప్రేమ చిత్రాల ప్రాధాన్యాన్నీ చాటిచెప్పాలని సూచించారు. ‘మిస్సమ్మ’ చిత్రంలో మాత్రమే తాను అడిగి నటించానన్నారు.

కమ్మసంఘం, యువ కళావాహిని ఆధ్వర్యంలో ఏడు రోజుల పాటు పౌరాణిక చలన చిత్రాలను ప్రదర్శించనున్నారు. మొదటి రోజు మాయాబజార్ చిత్రాన్ని ప్రదర్శిం చారు. శ్రీవేంకటేశ్వర మహత్మ్యం, లవకుశ, పాండవ వనవాసం, భక్త ప్రహ్లాద, సీతారామ కళ్యాణం చిత్రాలను వరుసగా ప్రదర్శిస్తారు. సినీ విజ్ఞాన విశారద ఎస్వీ రామారావు చిత్రాలను విశ్లేషిస్తారని నిర్వాహకులు తెలిపారు. అంతకు ముందు శబ్దచిత్ర ఆద్యుడు హెచ్‌ఎం రెడ్డి చిత్రపటానికి అక్కినేని పూలమాల వేశారు. ఇటీవల మృతిచెందిన గేయ రచయిత జాలాది ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. సారిపల్లి కొండలరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు స్వాగతోపన్యాసం చేశారు. సినీనటుడు సాయిచంద్, ఎస్వీ రామారావు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment