'ఆటోనగర్ సూర్య' చిత్ర సమీక్ష 2. 5 / 5
మ్యాక్స్ ఇండియా లిమిటెడ్ పతాకంఫై దేవకట్టా రచన ,దర్శకత్వంలో కె .అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు
మ్యాక్స్ ఇండియా లిమిటెడ్ పతాకంఫై దేవకట్టా రచన ,దర్శకత్వంలో కె .అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు
చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథగా మారిన సూర్య (నాగచైతన్య) అతని మేనమామ సాయికుమార్ కూడా ఆదరించడు. అక్కడే ఆటోనగర్‌లో ఉండే మెకానిక్ (సమ్మెటగాంధీ) ఇచ్చిన ప్రోత్సాహంతో మంచి మెకానిక్‌గా మారతాడు. డీజిల్‌తో పనిలేకుండా బేటరీతోనే జీపుల్ని నడిపే టెక్నిక్‌ను కనిపెడతాడు. కానీ ఆటోనగర్‌పై కన్నేసిన ఇంద్ర (జయప్రకాష్‌రెడ్డి) మాఫియా ముఠా- సూర్య కనిపెట్టిన ఆ టెక్నాలజీ ఇవ్వనందుకు గొడవ చేయడంతో- సూర్య జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడే తను మెకానికల్ ఇంజనీరింగ్ చదివి.. బయటకు వస్తాడు. కానీ మళ్ళీ తన తెలివితేటలతో సొంతంగా షెడ్ పెట్టాలనుకున్నా - మళ్ళీ అదే మాఫియా అడ్డుకుంటుంది. వారిని ఏమీచేయలేని స్థితి. ఇదంతా మేయర్ కోటిలింగం(మధు) కనుసన్నల్లోనే జరుగుతుంది . చివరికి సూర్య వారిని ఎదిరించి- ఆటోనగర్ ని ఎలా కాపాడాడు? అన్నది కథ.
నాగచైతన్య చిత్రాలంటే ప్రేమకథలకు పెట్టింది పేరు . '100%లవ్', ' ఏమాయచేసావె', 'మనం' వంటి సాఫ్ట్ పాత్రలను చేసిన చైతన్యకు మాస్ ఇమేజ్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం లో భాగం గానే 'జోష్', 'దడ', 'బెజవాడ' చిత్రాల్లో ఒక్కోవిధమైన మాఫియాను ఎదిరించే పాత్రలను పోషించాడు.అదేవిధంగా 'వెన్నెల' వంటి హాయిగొలిపే చిత్రానికి దర్శకత్వం వహించిన దేవకట్టా ఆ తరువాత .... 'ప్రస్థానం' అనే రాజకీయ నేపధ్యాన్ని ఎంచుకున్నాడు. ఆ రెండింటికీ మంచి పేరే వచ్చింది. ఇప్పుడు అదే దర్శకుడు నాగచైతన్యకు మాస్ ఇమేజ్ తెచ్చే ప్రయత్నం చేశాడు. విజయవాడలో 'ఆటోనగర్' అనేప్రాంతం ఉంది. అక్కడ వాహనాల షెడ్లేకాదు.. ఆ పేరుతో రకరకాలుగా స్మగ్మింగ్‌లు, దందాలు, ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటాయి. దాన్ని వెలికి తెచ్చేప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ, వాటిని బయటపెట్టే ప్రయత్నంలో ఎంచుకున్న కథానాయకుడు ఇంకా' బలమైన వాడు' అయి ఉంటే బాగుండేది . సమాజంలో దోపిడీదారులు, పెత్తందారులు, సామాన్యులు, వారందరిపై పెత్తనం చెలాయించే ఇంకో రకం కూడా ఉంది. అదే మాఫియా.. అంటూ చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. ఇందులో ప్రధానంగా హీరోకు ఒక ఎయిమ్ ఉంటుంది.. దేశంలో మంచి మెకానిక్‌గా గుర్తింపు పొంది- తాను కనిపెట్టిన మోటర్ టెక్నాలజీతో పేరు, డబ్బు సంపాదించుకోవాలని. కానీ ఆ విషయం కథనం లో మరుగునపడిపోయింది
ఈ సినిమాలో నాగచైతన్య పాత్రే కీలకం. కథంతా అతని చుట్టూనే తిరుగుతుంది. లెంగ్తీ డైలాగ్స్ పలకడం లో ఇబ్బంది పడ్డా - మాస్ పాత్రలో మరోసారి మెప్పించే ప్రయత్నం చేశాడు. ప్రతినాయకులు భారీ ఆకారాలతో ఉండడంతో కొన్ని సన్నివేశాల్లోఅతని హీరోయిజం తేలి పోయింది . మరదలిగా సమంత నటించింది. కేవలం ఆటవిడుపుకోసం ఆమె పాత్ర ఉంది. నటించే అవకాశం కూడా పెద్దగాలేదు.'సురా..సురా' అనే పాటలో గ్లామర్ తో ఆకట్టుకుంది. సాయికుమార్ తన పాత్రను బాగాచేశాడు. విజయవాడ అనే సిటీలో ఆటోనగర్ ను తన చేతుల్లో ఉంచుకున్న రౌడీగా జయప్రకాష్‌రెడ్డి నటించాడు. ఆయన అనుచరుడి గా అజయ్ నటించాడు. వీరందరిని లీడ్ చేసే పాత్ర మేయర్‌ది.ఈ పాత్రను టీవీ నటుడు మధు పోషించాడు. ఇక రఘుబాబు పోలీసు అధికారిగా సరిపోయాడు. కలెక్టర్‌గా ఆహుతిప్రసాద్‌చేసారు . బ్రహ్మానందం, వేణుమాధవ్,మాస్టర్ భరత్‌ల పాత్రలు ఆశించిన వినోదాన్నివ్వలేదు .
ఇందులో అనూప్ రూబెన్స్ పాటలు అంతంత మాత్రమే. సెకండాఫ్‌లో ఓ పాటనుకూడా ఆలపించాడు.నేపధ్య సంగీతం ఒక మాదిరిగా వుంది . శ్రీకాంత్ నారోజ్ కెమెరా పనితనం పర్వాలేదు. చిత్రంలో ఆర్ట్‌కు ప్రాధాన్యత ఉంది. ఆటోనగర్ సెట్ నిర్మాణంలో రవీందర్ తన పనితనాన్ని చూపించాడు. దేవకట్టా సంభాషణలు చాలా చోట్ల పర్వాలేదు. 'మన పనిలోనే దేవుడు ఉన్నాడు '... 'నిజమైన జైలు జైలు బయటే ఉంది '.. వంటి కొన్ని డైలాగ్‌లు బాగున్నాయి . 'సమాజంలో మనిషి.. వ్యవస్థ' వంటివి కామన్‌మేన్‌కు అర్థంకావు. -రవళి
0 comments:
Post a Comment