'ఆహా కళ్యాణం' చిత్ర సమీక్ష 3/5
శక్తి (నాని) ఎటువంటి లక్ష్యం లేని కుర్రాడు . అతనికి జీవితంలో ఏం చేయాలో కూడా తెలియదు. అతను ఒక పెళ్లిలో శృతి (వాణి కపూర్)తో పరిచయమై ,ఫ్రెండ్స్ అవుతారు. శృతి ఒక లక్ష్యం వున్న అమ్మాయి. ఆమె సొంతంగా ఒక వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీని ప్రారంభించాలని అనుకుంటుంది. తన వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ లో భాగస్వామిగా చేసుకోమని శక్తి కోరతాడు. మొదట వద్దన్నా , తరువాత శక్తిని పార్ట్నర్ గా చేర్చుకోవడానికి శృతి అంగీకరిస్తుంది. వారిద్దరూ కలిసి ‘గట్టి మేళం’ అనే పేరుతో వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీని మొదలుపెడతారు. వీరి కంపెనీకి కొద్ది రోజుల్లోనే మంచి పేరు వస్తుంది. ఒక రోజు వారి బృందం పార్టీ జరుపుకున్న రాత్రి - ఆ మైకం లో శృతి, శక్తి మరింత దగ్గరవుతారు . ఆ సాన్నిహిత్యాన్ని రొటీన్ సంఘటనగా తీసుకున్న శక్తితో శృతిగొడవ పడుతుంది .దానివల్ల ఇద్దరూ విడిపోయి నష్టపోతారు . ఆ తరువాత వారి బిజినెస్ ఏమైంది? మళ్ళీ వారిద్దరూ కలిశారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
హిందీ లో విజయ వంతం అయిన 'బ్యాండ్ బాజా బారాత్' ను గతంలో ఓ పెద్ద దొంగల సంస్థ తెలుగులో ఫ్రీ మేక్ చేసేసింది . అయితే, దొంగలకు ఎలాంటి శాస్తి జరగాలో- అలానే ఆ చిత్రం బాక్సాఫీసు ముందు ఘోరంగా చీదేసింది. ఆ నేపధ్యం , పాత్రలతోనే వచ్చిన 'ఆహా కళ్యాణం' మాత్రం 'ఆహా' అనిపించక పోయినా , ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని కలిగిస్తుంది .దీన్ని తమిళంలో రీ మేక్ చేసి తెలుగు లోకి అనువదించారు . అందుకనే- సినిమా అంతా ఎంత జాగ్రత్త పడ్డా, అనువాద అవలక్షణాలు స్పష్టంగా కనిపిస్తూనే వుంటాయి .దర్శకుడు గోకుల్ కృష్ణ ఒరిజినల్‌కి మార్పు చేర్పులు చేయడానికి సాహసించలేదు. హిందీలో ఎలా ఉందో అలానే తీయడానికి కట్టుబడ్డాడు. సరదా సన్నివేశాల వరకు బాగానే చేసినా , సినిమాలో హీరో - హీరో యిన్ ల మధ్య ఘర్షణని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. సినిమా మొత్తం నాని - వాణి ల ఫైనే నడిచినా, ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా, ఇద్దరూ బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ తో అలరించారు . నాని – వాణి కపూర్ ల మధ్య కెమిస్ట్రీ ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్. వీరి మధ్య వచ్చే ముద్దు సన్నివేశం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది .
యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమా మొత్తం పెళ్లిసందడితో కలర్ ఫుల్ గా సాగుతుంది. వచ్చీరాని ఇంగ్లీష్ మాట్లాడే శక్తి పాత్రలో నాని చాలా బాగా చేసాడు . శృతి పాత్ర చేసిన వాణీకపూర్ అందం, అభినయం రెండింటితో ప్రేక్షకులను ఆకట్టుకుంది . డాన్సుల్లో కూడా తన గ్లామర్ తో కట్టి పడేసి, ఈ సినిమాలో తనే హైలైట్ అయ్యింది . అతిథిపాత్రలో చాన్నాళ్ళకి సిమ్రాన్ మళ్ళీ కనిపించింది . శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు బాగున్నాయి .ధరన్ కుమార్ పాటలు బాగున్నా -అనువాద సాహిత్యం సింక్ కాక రొదలా వినిపించాయి .ప్రయోగాత్మకం గా చేసిన పంచ్ డైలాగ్స్ పాట కూడా అలానే వుంది . రీ రికార్డింగ్ కొన్ని సన్నివేశాల్లో బాగుంది . లోగనాధన్ శ్రీనివాసన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫ్రేమ్స్ అన్నీ రిచ్‌గా ఉన్నాయి. ఆర్ట్ వర్క్ అందంగా, బాగుంది. బవన్ శ్రీకుమార్ ఎడిటింగ్ ఫర్వాలేదు -రాజేష్
0 comments:
Post a Comment