'షాడో' చిత్ర సమీక్ష 2/5
మన దేశం లో బాంబ్ పేలుళ్లకు కుట్ర చేస్తున్న అంతర్జాతీయ మాఫియా డాన్ నానా భాయ్ రహస్యాలను తెలుసుకున్న రహస్య జర్నలిస్ట్ రఘురాం వాటిని ప్రచురించాలనే ప్రయత్నం లో ప్రాణాలు కోల్పోతాడు . ఆ కిరాతకాన్ని కళ్ళారా చూసిన రఘురాం కొడుకు రాజారాం పగబట్టి 'షాడో' పేరుతో వారిని వరుసగా చంపుతుంటాడు . అదే సమయంలో నానా భాయ్ ని పట్టుకోవడానికి స్పెషల్ పొలీస్ అధికారి ప్రతాప్ మలేషియా వస్తాడు . తనకన్నా ముందే నానా భాయ్ గ్యాంగ్ ని హతమారుస్తున్న షాడో ను పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు . ఒక సారి నానా భాయ్ మనుషులతో జరిగిన ఘర్షణలో మతి స్థిమితాన్ని కోల్పోయిన షాడో, తిరిగి కోలుకునే క్రమం లో చిన్న నాడు తప్పిపోయిన తల్లి,చెల్లి బతికే వున్నారని ... ప్రతాప్ తన చెల్లి భర్త అని తెలుసుకుంటాడు . కుటుంబాన్ని రక్షించుకుంటూనే నానా భాయ్ ని చంపి పగ తీర్చుకోవడం ఈ చిత్ర కధాంశం .
ఈ సినిమాతో మరోసారి ఒక సన్నాసి దర్శకుడి వల్ల ఓ మంచి నిర్మాత దెబ్బ తినిపోయాడు . ఫోజులెక్కువ ...విషయం తక్కువ తో బతికేసే గారడీ గాళ్ళ మాయలో ఈ నిర్మాతలు ఎలా పడతారో అర్ధం కాదు . తెలుగులో దశాబ్దాల నుండీ చూస్తున్న పగ-ప్రతీకారం కధ , రొటీన్ ఫ్యామిలీ సెంటిమెంట్ , అరిగి పోయిన యాక్షన్ సన్నివేశాలతో నిర్మించిన ఈ చెత్త చిత్రానికి నిర్మాత ఎంతో భారీ గా ఖర్చు చేసారు . థియేటర్ లోకి వెళ్ళిన జనమంతా సినిమా చూసి వడ దెబ్బ తగిలినట్లు గిల గిల్లాడుతున్నారు . ఎక్కడా మనకు కొత్తదనం మచ్చుకైనా కనిపించదు . అసలీ దర్శకుడికి కనీస సినిమా పరిజ్ఞానమైనా ఉందా ? -అనిపిస్తుంది . బాధ్యత లేకుండా, నిర్మాత డబ్బును దుర్వినియోగం చేస్తూ- పిల్లలాటలా ఈ సినిమాని చేసాడు . గబ్బర్ సింగ్ లో హై లైట్ అయిన 'అంత్యాక్షరి' ని ఇందులోనూ పెట్టి... అనుకరించడం కూడా రాదని చూపించు కున్నాడు.
రాజారాం గా ,షాడో గా వెంకటేష్ బాగా చేసాడు . అయితే విషయం లేని సినిమాలో కష్టానికి ఫలితముండదు . సినిమా ప్రారంభం లో వెంకటేష్ షాడో గెటప్ కొంత ఎబ్బెట్టుగా వుంది .తాప్సీ అందం గా నటించింది . పొలీస్ అధికారి ప్రతాప్ గా శ్రీకాంత్ చురుగ్గానే చేసాడు . సైకో శీను గా ఎమ్మెస్ నారాయణ చాలా పెద్ద పాత్ర పోషించినా అతని కామెడీ అంతంతమాత్రం గానే వుంది . కృష్ణ భగవాన్ కొంత పర్వాలేదు . హిందీ నటుడు ఆదిత్య పంచోలి ఇందులో మాఫియా డాన్ నానా భాయ్ గా నటించాడు .
నాగేంద్ర బాబు,గీత,మధురిమ,నాగి నీడు,జయప్ రకాశ్ రెడ్డి,సయ్యాజి షిండే, రాహుల్ దేవ్, నాజర్ , సూర్య, ఉత్తేజ్,సత్యం రాజేష్,రమ్య, సుబ్బరాజు, శ్రీనివాస్ రెడ్డి ,ధర్మవరపు, సుమన్, వెన్నెల కిషోర్ ఇతర పాత్రలు పోషించారు .
కోన వెంకట్ – మెహర్ రమేష్ కలిసి రాసిన డైలాగ్స్ మరీ చప్పగా వున్నాయి . తమన్ పాటల్లో 'షాడో టైటిల్ సాంగ్' బాగుంది .పాటల చిత్రీకరణ బాగుంది . రీ రికార్డింగ్ కూడా సినిమాకి న్యాయం చెయ్యలేదు . మూరెళ్ళ శ్రీను-శ్యాం కె నాయుడు ల ఫోటోగ్రఫీ, వెంకటేష్ ఎడిటింగ్, స్టన్ శివ ఫైట్స్ అంతంత మాత్రంగానే వున్నాయి -రాజేష్
0 comments:
Post a Comment