'బిజినెస్ మేన్' చిత్ర సమీక్ష 3/5
ఆర్. ఆర్. మూవీ మేకర్స్ పతాకం ఫై పూరి జగన్నాద్ దర్శకత్వంలో వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
'ముంబాయిని మాఫియ రహిత నగరం గా మార్చామని'- ముంబాయి పోలీసు కమీషనర్ ప్రకటించిన రోజునే అక్కడ సూర్య అడుగు పెడతాడు. ముంబాయిని ఉచ్చపోయిన్చడానికే వచ్చానని చెప్పుకునే సూర్య ఆ క్రమం లోనే ముందుకు సాగుతూ సూర్య భాయ్ గా ఎదుగుతాడు. మరో పక్క పోలీసు కమీషనర్ కూతురినే ప్రేమలోకి దించుతాడు. సమాజంలో పలుకు బడి పెరుగుతున్నా- పోలీసులు తో పాటు సూర్య కు ప్రత్యర్ధులు కూడా పెరుగుతారు. వారిని ఎదుర్కొంటూ , మాఫియాని కార్పోరేటీకరిన్చాలనే సూర్య తన కోరిక తీర్చుకోవడానికి ఏమి చేసాడనేదే ఈసినిమా ...
' పోకిరి' వంటి పెద్ద హిట్ కాంబి నేషన్ లో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలతో, పేరుకు తగ్గట్టే బ్రహ్మాండమైన బిజినెస్ తో విడుదలయ్యింది . అసలే ' దూకుడు' మీదున్న మహేష్ బాబు తో అభిమానుల ఆశల మేరకు సినిమా అందించడం అంత తేలిక కాదు. పూర్తిగా ఆసహజం, ఆచరణ సాధ్యం కాని కధనే తీసుకున్నా ... ప్రత్యేకం గా పెట్టే కామెడీ వంటి అనవసరమైన ఫార్ములా జోలికి పోకుండా ...సూటిగా చెప్పడం ద్వారా అయితే పూరీ జగన్నాద్ ఈ చిత్రం లో విజయవంతం అయ్యాడు. మహేష్ బాబు నటన, పూరి మాటలు- టేకింగ్ , తమన్ సంగీతం ఈ చిత్రం లో హై లైట్స్ . మాఫియా నేపధ్యం పాతదే అయినా వేగం గా నడపడం వల్ల , సినిమాలో వినోదం తగ్గిందనే అసంతృప్తి కలగా కుండా ...బోర్ లేకుండా చెయ్య గలిగారు. మహేష్ తో నెగిటివ్ ఛాయలున్న రఫ్ఫ్ పాత్రను చాలా బాగా చేయించారు. ఒక విధం గా ఈ చిత్రం అంతా మహేష్ వన్ మేన్ షో అనే చెప్పాలి. బ్యాంకు నుండి పత్రాలు దోపిడీ చేయడం, ఐ .టి దాడుల పేరుతో ఎన్నికల ఫండ్ దొంగిలించడం, ఎన్నికలకోసం వేలకోట్లు ఇవ్వడం ...మొదలైన ఎన్నో అర్ధం లేని అంశాలు ఈ చిత్రం లో ఉన్నాయి. హీరో పనిగట్టుకుని కమీషనర్ కూతుర్ని ట్రాప్ చెయ్యాలనుకోవడం , వారి మధ్య ప్రేమ పుట్టడం, ఆ తర్వాత వారి మధ్య వచ్చే సన్నివేశాలు అంత రక్తి కట్టలేదు. గట్టి విలన్ పాత్ర లేకపోవడం వల్ల , సినిమా క్లైమాక్స్ కూడా అంత ఆసక్తికరంగా లేదు. 'యువత గొప్ప లక్ష్యం పెట్టుకోవాలి...దాన్ని సూటిగా సాధించేయాలి' -అంటూ దర్శకుడు సినిమా చివరిలో హీరో తో ఇప్పించిన సందేశం వినడానికి బాగుంది. ఈ చిత్రం లో హీరో సాధించిన విధం గా జరగాలంటే సినిమాల్లోనే సాధ్యం. ఇంటర్వెల్ ముందు గ్యాంగ్ ఫైటే చేస్తూ హీరో హీరోయిన్ కంట బడటం' పోకిరి' ఇంటర్వెల్ సీన్ ని గుర్తు చేస్తుంది.
మహేష్ బాబు నటుడిగా ఈ చిత్రం లో మరింత పక్వమైన నటన ప్రదర్శించాడు. మాన్లీగా కనిపిస్తూ , మంచి హావభావ ప్రకటనతో సంభాషణలు పలికి ఆకట్టుకున్నాడు. కాజల్ పాత్ర,నటన గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు. ఆమె తండ్రి పోలీసు కమీషనర్ గా నాజర్ , రాజకీయ నాయకులుగా ప్రకాష్ రాజ్, సయ్యాజి షిండే , రాజా మురద్ , ఇతర పాత్రల్లో బ్రహ్మాజీ, గణేష్, ధర్మవరపు,భరత్ రెడ్డి ,మాస్టర్ ఆకాష్ నటించారు. పూరి జగన్నాద్ అందించిన సంభాషణలు చాలా సినిమాల తర్వాత ఇందులో రొటీన్ కి భిన్నం గా, అర్ధవంతంగా, పవర్ ఫుల్ గా వున్నాయి. తమన్ పాటల్లో ఒకటి పాత హిందీ ట్యూన్ , ఐటెం సాంగ్ కి వాడుతారనుకున్న ' సార్ వస్తారోస్తారా 'పాటను హీరో - హీరోయిన్ లతో చేసారు. ఈ పాట తో పాటు' చందమామ' పాట కూడా బాగా చిత్రీకరించారు. ఈ పాటలోహీరో - హీరోయిన్ ల సున్నితమైన ముద్దు ముచ్చట ప్రేక్షకులకు బోనస్ . 'బ్యాడ్ బోయ్స్' పాటలో ముంబై నటి శ్వేతా భరద్వాజ్ అందంగా చేసింది. అయితే సెన్సార్ 'బ్లర్' ల వల్ల పూర్తిగా ఆస్వాదించ లేక పోయారు. నేపధ్య సంగీతం చాలా బాగుంది. విజయ్ ఫైట్స్,శ్యాం ఫోటో గ్రఫీ ,శేఖర్ ఎడిటింగ్ బాగున్నాయి.
0 comments:
Post a Comment