ప్రపంచ సినిమా చరిత్రలోనే వినూత్న ‘ప్రయోగం’
ఇప్పటిదాకా ప్రపంచ సినీ చరిత్రలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తెలుగు సినిమా చరిత్రలో మూకీ నుండి టాకీ కొచ్చి ఈస్ట్‌మన్ కలర్, 70 ఎం.ఎం. టెక్నాలజీనుండి ప్రస్తుత 3డి, డిజిటల్ టెక్నాలజీ వరకూ ఎన్నెన్నో సరికొత్త ప్రయోగాలను ప్రేక్షకులు వీక్షిస్తూ వచ్చారు. ఇంతవరకూ ప్రపంచ సినీ చరిత్రలో ఒకే తెరపై నాలుగు ఫ్రేములు...అవి కూడా కథతో సంబంధం కలిగి ప్రేక్షకులకు ఎటువంటి గందరగోళం లేకుండా హ్యాపీగా చూడగలిగేలా ఒక వినూత్న ప్రయోగానికి నాంది పలికారు భానుప్రకాష్. ఆయనకు వచ్చిన సరికొత్త ఆలోచనలకు ప్రతిరూపమే ‘ప్రయోగం’ సినిమా. ఈ సినిమా విశేషాలను దర్శకుడు భానుప్రకాష్ ‘కలర్స్’తో పంచుకున్నారు.మీ గురించి చెబుతారా?
బి.టెక్ పూర్తిచేసుకుని కొంతకాలం ఢిల్లీలోని సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్‌గా ఉద్యోగం చేసి సినిమా మీద మక్కువతో ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ ఎం.ఏ. ఫిలిం మేకింగ్ కోర్స్ పూర్తిచేశాను. సినిమా రంగంలోకి అందరూ నాలుగు డబ్బులు సంపాదించుకుందామనే కాంక్షతో వస్తుంటారు. కానీ నేను తెలుగు ప్రేక్షకులకు సరికొత్త ప్రయోగంతో రొటీన్‌కు భిన్నంగా తన సినిమా ఉండాలని అటువంటి తన ఆలోచనలకు ఒక కార్యరూపంగా రూపొందించిన చిత్రమే ఈ ‘ప్రయోగం’.
ప్రయోగం మేకింగ్: ఇక సినిమా కథ విషయానికి వస్తే ఇందులో ‘ప్రయోగం’ అనేది ఒక వెబ్‌సైట్ పేరు. ఒక సైంటిఫిక్ బ్యాక్‌గ్రౌండ్ డిటెక్టివ్ ఈ వెబ్‌సైట్‌ను నడిపిస్తూ ఉంటాడు. సిటీలో మత్తుమందులు విచ్చలవిడిగా విస్తరిస్తున్న తరుణం లో అసలు ఈ మత్తుమందులు సిటీకి సప్లయ్ చేసే వ్యక్తిని పట్టుకోవడానికి సైంటిఫిక్ డిటెక్టివ్ చేసిన ఎక్స్‌పరిమెంట్ ఏమిటనేది ప్రయోగం కథ. అతడు నిర్వహించిన ఈ ప్రయోగం ద్వారా అసలు నేరస్తులు పట్టుబడటమే కాకుండా సొసైటీలో నాలుగు గ్రూపుల మధ్య నడిచే మానసిక సంఘర్షణలు, వైరుధ్యమైన పరిస్థితులు, మానవ సంబంధాలు, వారి వ్యక్తిత్వాలు.
ప్రయోగం ఆలోచన ఎలా వచ్చిందంటే...
‘ఇంగ్లాండ్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసేటప్పుడు డిజిటల్ రివల్యూషన్ ఇన్ సినిమా అనే అంశంపై రీసెర్చ్ చేస్తూ డిజిటల్ కెమెరా ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ప్రయోగాలు జరిగాయో తెలుసుకున్నాను. ఆ క్రమంలో ఒక పేజ్‌లో నాలుగు ఫొటోలుండటం చూశాను. అప్పుడు అనిపించింది. సినిమాలో ఒకే ఫ్రేమ్‌లో నాలుగు సన్నివేశాలు జరిగితే ఏది చూస్తారు? నాలుగింటిలో నాలుగు ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు కనిపిస్తుంటే ప్రేక్షకులు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? ఒకవేళ నాలుగు చూడాలనిపిస్తే నాలుగు చూడగలరా? ఇటువంటి ప్రశ్నలు నన్ను వెంటాడాయి. వీటన్నింటికీ సమాధానమే మీ ముందుకు వస్తున్న ఈ నా ప్రయోగం సినిమా.
నిర్మాణ విశేషాలు: ఈ చిత్ర నిర్మాణ విశేషాల గురించి చెబుతూ భానుప్రకాష్ ఇలా అన్నారు. ‘ప్రయోగాత్మకమైన ఆలోచన రావడం కష్టం కాదు. ఆ ఆలోచనని కథగా మలిచి దానికి సంబంధించిన వారందరినీ ఒప్పించి, ఒక తాటిపైన ఉంచి, కెమెరాలో బంధించి జనరంజకంగా తీర్చిదిద్దటం అత్యంత కష్టతరమైన పని. నేను చేసిన ఈ ప్రయోగం కోసం నలభై మంది ఆర్టిస్టులను ఎంపికచేసి వారికి 66 రోజులపాటు లొకేషన్‌లో సెట్ వేసి ట్రైనింగ్ ఇచ్చి షూట్ చేశాము. ఎందుకంటే నటీనటులు కెమెరా ముందు రెండు గంటలపాటు కట్ లేకుండా ఏకధాటిగా నటిస్తూనే ఉండాలి.
ఒకవేళ వారిలో ఎవరైనా ఒక గంట తర్వాత తప్పు చేస్తే, అక్కడ కట్ చేసి మళ్లీ మొదటినుండి రెండు గంటలు షూట్ చేయాలి. ఇంత రిస్క్ తీసుకోవడానికి కారణం ప్రేక్షకులు ఈ నాలుగు గ్రూపుల నిజ జీవితాలు చూస్తున్న అనుభవం కలగాలి. ఈ మేకింగ్‌లో రెండో కష్టం ఏమిటంటే...ఈ నాలుగు ఫ్రేముల్లో ఉన్న నటులు ఒకరితో ఒకరు ఫోన్‌లో సంభాషిస్తూ ఉండాలి. నాలుగు ఫ్రేముల్లో రెండు గంటల షూట్‌లో ఒక ఫ్రేమ్‌లో వ్యక్తి ఏ సెకండ్‌లో కాల్ చేస్తాడో...ఇంకో ఫ్రేమ్‌లో ఉన్న వ్యక్తి దాని తర్వాత సెకండ్‌లో కాల్ లిఫ్ట్ చెయ్యాలి.
ఇది ప్రాక్టికల్‌గా చాలా కష్టమైన పని. ఇక మూడోది...జీపులో ఫిక్స్ చేసిన కెమెరాతో జీపు రెండు గంటలపాటు వివిధ ప్లేసులకి, రోడ్లమీద తిరుగుతూ రెండు గంటల్లో ఫలానా టైమ్‌కి ఫలానా ప్లేస్‌కి జీపు వచ్చి తీరాలి. దీనితో జీపు ట్రాఫిక్ వల్ల అప్పుడప్పుడు త్వరగా, లేటుగా వచ్చేది. టైమ్‌కి ఆ ప్లేస్‌కి వచ్చేవరకూ మొదటినుంచి రెండు గంటల షాట్ మళ్లీ తీయాల్సివచ్చేది.
ఎవరికోసం ఈ ప్రయోగం?
నేను ఎంచుకున్న కథ సమాజంలో వివిధ వర్గాలవారి జీవన శైలిని ప్రతిబింబిస్తుంది. నేను చేసిన ప్రయోగం కథని ఆవిష్కరించిన విధానం సరికొత్తగా ఇంతవరకూ ఎవరూ చూడని విధంగా ఉండటం. ఇలా చేయడం వలన వినోదం పాళ్లు రెగ్యులర్‌గా తీసినదానికన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందన్న ప్రగాఢ నమ్మకం ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే ‘అవతార్’ సినిమా 3డిలో చూసినప్పుడు ఏ సినిమా కలిగించని అనుభూతిని నాకు ఆ సినిమా కలిగించింది.
ఈ ప్రయోగంతో ఏం చెప్పదల్చుకున్నారు?
వినోదం ప్రధానంగా సాగే ఈ ప్రయోగంలో అంతర్లీనంగా డ్రగ్స్ జోలికి వెళ్లవద్దు అనే మెసేజ్ కూడా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు అడ్వాన్స్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ చిత్రం విజయవంతం చేసి తెలుగు వాళ్లు కూడా ప్రయోగాత్మక చిత్రాలు మిగిలిన భాషల కన్నా ధీటుగా తీయగలరు అనే విశ్వాసాన్ని ప్రపంచానికి తెలియజేయాలని...నూతన ప్రయత్నంగా చేస్తున్న నా ఈ ‘ప్రయోగం’ సక్సెస్ చేస్తారని మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను.
0 comments:
Post a Comment